లారీ ఢీకొని కానిస్టేబుల్ దుర్మరణం | Constable killed | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని కానిస్టేబుల్ దుర్మరణం

Published Fri, Feb 12 2016 1:48 AM | Last Updated on Tue, Mar 19 2019 5:56 PM

Constable killed

సామర్లకోట : గ్యాస్ సిలిండర్ల లోడు లారీ ఢీకొని ఓ కానిస్టేబుల్ దుర్మరణం పాలయ్యారు. కాకినాడ-సామర్లకోట ఏడీబీ రోడ్డులో గురువారం జరిగిన ఈ ఘటనలో సామర్లకోట పోలీసు స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ దంగేటి రాంబాబు(50) మరణించారు. భోజనం క్యారేజ్ తీసుకుని ఆయన స్కూటర్‌పై కాకినాడ నుంచి సామర్లకోటలోని పోలీసుస్టేషన్‌కు విధులకు హాజరవుతున్నారు. ఇదే మార్గంలో ఉన్న రెండు పెట్రోలు బంకుల మధ్య నుంచి వచ్చిన గ్యాస్ సిలిండర్ల లారీ ఆయన స్కూటర్‌ను ఢీకొని, సుమారు 30 అడుగుల దూరం ఈడ్చుకుపోయింది.
 
 ఈ సంఘటనలో తలకు తీవ్ర గాయం కావడంతో రాంబాబు అక్కడికక్కడే చనిపోయారు. ఈ సంఘటనతో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్సీ రవిప్రకాష్ సంఘటన స్థలానికి చేరుకుని, ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. అందరితో కలివిడిగా ఉండే రాంబాబు మృతి వార్త తెలిసిన వెంటనే సహచరులతో పాటు ఆటో యూనియన్ నాయకులు, పండ్ల వర్తకులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కంటతడి పెట్టారు.
 
  పెద్దాపురం సీఐ కె.శ్రీధర్‌కుమార్, ఎస్సై ఆకుల మురళీకృష్ణ కూడా రాంబాబు మృతదేహాన్ని చూసి.. కన్నీరుమున్నీరయ్యారు. డీఎస్పీ ఎస్.రాజశేఖరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన లారీని సీజ్ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పెద్దాపురం ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కాకినాడలోని రాంబాబు స్వగృహానికి తరలించారు. రాంబాబుకు భార్య కృష్ణవేణి, పెద్ద కుమారుడు రామ్‌కుమార్, చిన్న కుమారుడు లక్ష్మణ్, కుమార్తె సుమ ఉన్నారు. కుమార్తెకు వివాహం చేయగా, కుమారుడు లక్ష్మణ్ భీమవరంలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు.
 
 నిత్యం దైవదర్శనం
 పంచారామ క్షేత్రంలోని స్వామివారిని నిత్యం దర్శనం చేసుకున్నాకే రాంబాబు విధులకు హాజరయ్యేవారని ఆయన దైవభక్తిని ఆలయ అర్చకులు గుర్తుచేసుకున్నారు. అందరితో కలిసిమెలిసి ఉంటూ, అధికారుల మనన్నలు పొందిన కానిస్టేబుల్ రాంబాబు మరణంతో పోలీసు స్టేషన్‌లో విషాదం నెలకొంది. చిన్నా, పెద్దా, ధనిక, పేద తారతమ్యం లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండేవారని సహచరులు పేర్కొన్నారు.
 
 మీసాల రాంబాబు
 పెద్ద మీసాలతో ఉండటంతో ఆయనను మీసాల రాంబాబు అని ముద్దుగా పిలుస్తుంటారు. 1983 లో కాకినాడ రిజర్‌‌వ పోలీసులో చేరిన ఆయన 2009లో సామర్లకోటకు వచ్చారు. రాంబాబు మృతికి ఎస్పీ, డీఎస్పీతో పాటు సీఐ కె.శ్రీధర్‌కుమార్, ఎస్సైలు ఆకుల మురళీకృష్ణ, కె. నాగార్జున, సతీష్, ఏఎస్సైలు రాజబాబు, జీవీవీ సత్యనారాయణ , పోలీసుల సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు గంగిరెడ్డి బలరామ్ సంతాపం ప్రకటించారు.
 
 డిప్యూటీ సీఎం సంతాపం
 కానిస్టేబుల్ రాంబాబు మృతికి డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సంతాపం ప్రకటించా రు. ప్రభుత్వం నుంచి రావలసిన అన్ని రాయితీలు అందేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement