- బీసీ ఆత్మీయ సదస్సులో పలువురు వక్తల ఉద్ఘాటన
లబ్బీపేట : దేశ జనాభాలో 50 శాతంగా ఉన్న బీసీలు పాలితులుగానే మిగిలిపోతున్నారని, రాజ్యాధికార సాధన దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు అన్నారు. పలు బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం బృందావన కాలనీలోని ఎ కన్వెన్షన్ హాల్‌లో బీసీ ఆత్మీయ సభ నిర్వహించారు. తొలుత జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం విద్యుత్ బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మాదాటి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన సభలో పలువురు వక్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశ జనాభాలో 20 శాతం ఉన్న అగ్రవర్ణాల వారు అధికారం చెలాయిస్తున్నారని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం విషయంలో బలహీనవర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నిరక్షరాస్యుల్లో అధికశాతం ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు చెందిన వారే ఉండటం బాధాకరమన్నారు.
బీసీలకు సైతం సబ్‌ప్లాన్ అమలు చేయాలని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కోరనున్నట్లు పేర్కొన్నారు. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత కల్పించినట్లే , బీసీలకు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. మరో ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య మాట్లాడుతూ బీసీలందరూ ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బీసీ జనసభ వ్యవస్థాపక అధ్యక్షుడు దోపిదేశి గంగాధర్ మాట్లాడుతూ బీసీలకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతోందన్నారు. రాజకీయంగా బీసీలు పొందాల్సిన స్థానాలను ఇతర వర్గాల వారు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. దీనిపై పోరాడాలని పిలుపునిచ్చారు.
సభకు అధ్యక్షత వహించిన మాదాటి పూర్ణచంద్రరరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపధ్యంలో బీసీ ఉద్యోగులు అన్ని విధాలుగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నగర డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ చావలి పద్మావతి, విజయవాడ నగర పాలక సంస్థ కార్పొరేటర్లు, బీసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.