వైఎస్ వారధిపై సర్కారు అనాసక్తి
Published Sun, Nov 10 2013 2:24 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
సాక్షి, రాజమండ్రి :ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ గోదావరిపై చేపట్టిన నాలుగు లేన్ల వైఎస్ వారధి నిర్మాణం పూర్తికి అప్రోచ్ రోడ్డుకు అవసరమైన భూమికి సంబంధించిన వివాదాలు తీవ్ర ఆటంకంగా పరిణమిస్తున్నాయి. వంతెనకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టారనో, మరెందుకనో- ఆటంకాలను తొలగించి, నిర్మాణం పూర్తి చేయించాలన్న ఆసక్తి ప్రభుత్వంలో కానరావడం లేదు. ఈ నేపథ్యంలో వంతెన నిర్మాణ పనులను నిలిపి వేయాలని కాంట్రాక్ట్ పొందిన గామన్ ఇండియా సంస్థ భావిస్తోంది. అంతేకాక జరుగుతున్న జాప్యం వల్ల తనకు కలిగే నష్టం నుంచి బయటపడడానికి ఒప్పందం ప్రకారం తదుపరి చర్యలకు ఉపక్రమించాలనుకుంటున్నట్టు సమాచారం. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టుగా రూ.809 కోట్ల అంచనా వ్యయంతో 2006లో రాజమండ్రి-కొవ్వూరు మధ్య శ్రీకారం చుట్టిన ఈ వంతెన పనులు 2009లో ఊపందుకున్నాయి. మహానేత మరణానంతరం దానికి వైఎస్ వారధిగా పేరు పెట్టారు. 2011లో పూర్తవాల్సిన పనులు ఇప్పటికీ పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గామన్ ఇండియాకు గడువులపై గడువులు పొడిగిస్తున్న ప్రభుత్వం, పనులకు లైన్ క్లియర్ చేయకుండా కాలయాపన చేస్తోంది. దీంతో వచ్చే మార్చి నుంచి నిర్మాణ పనులు నిలిపి వేయాలని గామన్ భావిస్తోంది.
4.5 ఎకరాలపై తేలని వివాదం
గోదావరి నదిపై 4.1 కిలోమీటర్ల వంతెన, పశ్చిమ గోదావరి జిల్లా వైపు రాజమండ్రి-ఏలూరు రోడ్డుకు అనుసంధానం చేసేందుకు 1.97 కిలోమీటర్లు, తూర్పుగోదావరి వైపు దివాన్ చెరువు సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు 8 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్లు నిర్మాణ ప్యాకేజీలో ఉన్నాయి. రోడ్ల కోసం తూర్పువైపు 124 ఎకరాలు, పశ్చిమాన 25.30 ఎకరాల భూమిని 2009లోనే నిర్మాణ సంస్థకు అప్పగించాల్సి ఉంది. కానీ భూ యజమానులు భూ సేకరణను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులపై కౌంటర్లు దాఖలు చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ఫలితంగా పశ్చిమగోదావరి జిల్లా వైపున 600 మీటర్ల రోడ్డు నిర్మాణానికి అవసరమైన 4.5 ఎకరాల భూమికి సంబంధించిన వివాదాలు నేటికీ పరిష్కారం కాలేదు. వంతెన పనులు ఇంకా 10 శాతం పూర్తవాల్సి ఉంది. రోడ్డు పనులు పశ్చిమాన 40 శాతం, తూర్పువైపున 30 శాతం పూర్త కావాలి. పశ్చిమాన 4.5 ఎకరాలకు సంబంధించిన కోర్టు కేసుల ప్రభావంతో పనులన్నీ మందగించాయి. దీంతో పాటు వంతెన అప్రోచ్ రోడ్లను పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ప్రధాన రహదారులకు కలిపేందుకు అవసరమైన అనుమతి ప్రభుత్వం నుంచి నేటికీ రానేలేదు.
వచ్చే మార్చి నాటికీ అనుమానమే..
వంతెన నిర్మాణం బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (బీఓటీ) పద్ధతిలో జరుగుతోంది. అంటే నిర్మాణం పూర్తయ్యాక కాంట్రాక్టరు 20 ఏళ్ల పాటు టోల్‌గేట్లు పెట్టి నిర్మాణ వ్యయాన్ని, లాభాన్ని రాబట్టుకుని ఆ తర్వాత ప్రభుత్వానికి అప్పగించాలి. ఈ నిబంధన ప్రకారం ఏ కాంట్రాక్ట్ సంస్థయినా నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసుకోవాలనే ఆరాటపడుతుంది. కానీ భూమి అప్పగించడంలో ప్రభుత్వపరంగా జాప్యం జరుగుతున్నందున ఇప్పటికి మూడుసార్లు నిర్మాణ గడువును పొడిగించింది. చివరిగా గడువును 2014 మార్చికి పొడిగించినా, అప్పటికి కూడా వివాదాలు పరిష్కారమై, పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ వంతెన నిర్మాణం పూర్తిచేసి, క్లియరెన్స్ ఉన్న చోట్ల రోడ్లు పూర్తి చేసినా టోల్‌గేట్లు తెరవాలంటే రాకపోకలు ప్రారంభం కావాలి.
కానీ 600 మీటర్ల మేర రోడ్డు లేకపోతే వంతెన వినియోగంలోకి రావడం అసాధ్యం. ఇప్పటికే వందల కోట్లు పెట్టుబడి పెట్టిన గామన్ ఈ వివాదాలు తొలగకుండా మరింత పెట్టుబడి పెట్టి వంతెన నిర్మాణం, ఇతర పనులు పూర్తి చేయడానికి విముఖంగా ఉందని ఆ సంస్థ వర్గాలు చెబుతున్నాయి. 2014 మార్చి నాటికి వివాదాలను పూర్తిగా పరిష్కరించని పక్షంలో నిర్మాణాన్ని నిలిపివేయాలనుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఇక్కడి నిర్మాణ యంత్రాలను, సిబ్బందిని ఆ సంస్థ పనులు జరుగుతున్న ఇతర ప్రాంతాలకు తరలించారు. వంతెనపై చిన్న చిన్న సిమెంటు పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ‘మీరు మార్చిలో పనులు వదిలేస్తారా?’ అని గామన్‌కు చెందిన ఓ అధికారిని ‘సాక్షి’ ప్రశ్నించగా ‘ఇప్పటికే ఆలస్యం అయింది. అయితే పూర్తి క్లియరెన్స్‌లు వచ్చేస్తే మిగిలిన పనులు పూర్తి చేయడం మాకు పెద్ద లెక్క కాదు’ అన్నారు.
Advertisement
Advertisement