47 గ్రామాల్లో తాగునీరు కలుషితం
విజయనగరం ఆరోగ్యం :మనిషికి జీవనాధారమైన తాగునీరు కాలక్రమేనా కలుషితమవుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ఆ నీటినే తాగాల్సిన దుస్థితి నెలకొంది. నీటి పరీక్ష కేంద్రం పరీక్షల్లో జిల్లాలో చాలా గ్రామాల్లో తాగునీరు కలుషితమైనట్లు నిర్ధారణ జరిగింది. తాగునీటిని ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయకపోవడం వల్లే నీరు కలుషితమవుతున్నట్లు తెలుస్తోంది. తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నా అది కార్యరూపం దాల్చలేదు. పది నెలలో కాలంలో జిల్లాలో 47 గ్రామాల్లో తాగునీరు కలుషతమైనట్లు విశాఖపట్నానికి చెందిన నీటి పరీక్ష కేంద్రం అధికారులు నిర్ధారించారు.
ప్రతీ నెలా నీటి నమూనాల సేకరణ..
హెల్త్ సూపర్‌వైజర్ల ద్వారా వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రతి నెలా నీటి నమూనాలను తెప్పిస్తారు. వాటిని విశాఖలోని నీటి పరీక్ష కేంద్రానికి పంపిస్తారు. అక్కడ అధికారులు నీరు కలుషితమా, కాదా అని నిర్ధారిస్తారు. నీరు కలుషితమూతే ఆర్‌డబ్ల్యూఎస్ శాఖాధికారులకు సమచారం అందించి నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తారు.
కలుషిత నీరున్న గ్రామాలు...
మెంటాడ మండలంలోని మెంటాడ గ్రామం, కురుపాం మండలం సీమలగూడ, డెంకాడ మండలం జొన్నాడ, గురుగుబిల్లి మండలం లఖనాపురం, నడిమివరివలస, పార్వతీపురం మండలం బందలుప్పి,వీరభద్రపురం, నర్సిపురం, ఎల్.కోట మండలం లచ్చంపేట, ఎల్.కోట, భోగాపురం మండలం బెరైడ్డిపాలెం, సాలురు మండలం మామిడిపేట, కొమరాడ మండలం కొమరాడ, కొట్టకి, రామభద్రపురం మండలం జొన్నవలస,నాయుడువలస, విజయనగరం మండలం సారిక, డెంకాడ మండలం అయినాడ,అక్కులపేట, గరివిడి మండలం కోనూరు,పర్ల, కొమరాడ మండలం బూరివలస, పెదశాఖ, కొండశాఖ, మెంటాడ మండలం పిట్టాడ, గుమ్మలక్ష్మీపురం మండలం కన్యగూడ, మక్కువ మండలం వీరభద్రపురం, బొండపల్లి మండలంలోని చలుమూరివీధి, ఎస్.కోట మండలం భీమవరం, కొమరాడ మండలం గాంధీనగరం, కొమరాడ మండలం పోకిరి, గజపతినగరం మండలం రంగాపురం, పాచిపెంట మండలం తడిలోవ, మక్కువ మండలం గొల్లవీధి, మూడంగి, మెంటాడ మండలం లక్ష్మీపురం, గుర్ల, తదితర 47 గ్రామాల్లో నీరు కలుషితమైందని అధికారులు నిర్థారించారు.