= వాడవాడలా ఆందోళనలు
= కొనసాగిన వైఎస్సార్‌సీపీ, జేఏసీల దీక్షలు
= ఉద్యమోధృతికి న్యాయవాదుల జేఏసీ పిలుపు
సమైక్య సమ్మె విరమించి పలువురు విధుల్లోకి వెళ్లినా.. ఉద్యమ వేడి తగ్గలేదు. జిల్లా అంతటా ఎన్జీవోల జేఏసీ, వైఎస్సార్‌సీపీ, వివిధ వర్గాలు రోడ్లపైకొచ్చి సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగిస్తున్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
సాక్షి, విజయవాడ : సమైక్యం కోసం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీకి విభజన బిల్లు వస్తే దానికి వ్యతిరేకంగా ఓటేస్తామని ఎమ్మెల్యేల నుంచి హామీ తీసుకునే కార్యక్రమం విజయవాడలో ఉద్రిక్తత కు దారితీసింది. ఎమ్మెల్యే యలమంచిలి రవి జేఏసీ సభలో వీరంగం సృష్టించారు. దీంతో పరిస్థితి తీవ్రంగా మారింది. మంత్రి పార్థసారథి కలుగజేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లాలో ఆ పార్టీ కార్యకర్తలు, నేతల ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగాయి.
కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు శనివారం 67వ రోజుకు చేరాయి. హనుమాన్‌జంక్షన్‌లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. గన్నవరంలో పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నూజివీడులోని జంక్షన్‌రోడ్డులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 47వ రోజుకు చేరాయి.
ఈ దీక్షలను వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రారంభించారు. తిరువూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 11వ రోజుకు చేరాయి. తిరువూరు మండల, పట్టణ పార్టీ కన్వీనర్‌లు శీలం నాగనర్శిరెడ్డి, చలమాల సత్యనారాయణల ఆధ్వర్యంలో బోసు సెంటర్లో ఏర్పాటుచేసిన శిబిరంలో పలువురు నాయకులు రిలేదీక్షలు చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో దివిసీమలో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. నాగాయలంకలో రహదారులను దిగ్బంధించి వంటావార్పు చేశారు. రోడ్డుపైనే భోజనాలు చేశారు. చల్లపల్లిలో చేపట్టిన దీక్షలు 64వ రోజుకు చేరాయి.
ముగిసిన న్యాయవాదుల యాత్ర...
అవనిగడ్డ కోర్టుకు చెందిన న్యాయవాదుల సమైక్యాంధ్ర ైచైతన్యయాత్ర శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా చల్లపల్లిలో బహిరంగసభ నిర్వహించి, ఉద్యమంలో రైతులు, విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని, ఆందోళనలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. అవనిగడ్డలో చేపట్టిన దీక్షలు 52వ రోజుకు చేరాయి. ఘంటసాల, మోపిదేవి, కోడూరులో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. పామర్రు ఐకేపీ మహిళలు శనివారం రిలేదీక్షలలో పాల్గొన్నారు.
అడ్డాడ అరవింద స్కూల్, జుఝవరం ఉషోదయ స్కూలు విద్యార్థులు నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి ట్రాఫిక్ స్తంభింపచేశారు. గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్షలు కొనసాగాయి. జేఏసీ, మున్సిపల్ ఉద్యోగులు దీక్షలు నిర్వహించారు. గుడ్లవల్లేరులో సమైక్యాంధ్రను కాంక్షిస్తూ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం నాటి దీక్షలలో స్వశక్తి సంఘాల మహిళలు పాల్గొన్నారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల పరిధిలో సమైక్యాంధ్ర కోసం రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
పట్టణంలోని మున్సిపల్ కూడలి సమీపంలో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ముస్లిం మైనార్టీలు కూర్చున్నారు. చంద్రబాబు దీక్షకు మద్దతుగా మైలవరంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు శనివారం ఆరో రోజుకు చేరుకున్నాయి. ఎన్జీఓల ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహిస్తున్న రిలే దీక్షలు 47వ రోజూ కొనసాగుతున్నాయి. కొండపల్లిలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు శనివారం 17వ రోజుకు చేరుకున్నాయి. ఎట్టకేలకు 72 రోజుల ఉద్యమం తర్వాత జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.