YALAMANCHILI Ravi
-
విజయవాడ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవికి అస్వస్థత
విజయవాడ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి అస్వస్థతకు గురయ్యారు. హార్ట్ స్ట్రోక్ రావడంతో అప్రమత్తమైన ఆయన కుటుంబసభ్యులు అత్యవసర చికిత్స కోసం ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. అయితే రవికి పలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. -
కాకాని విగ్రహం తొలగింపు
పటమట(విజయవాడ తూర్పు): విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్న ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, జై ఆంధ్ర ఉద్యమ నేత కాకాని వెంకట రత్నం విగ్రహాన్ని ఆదివారం తెల్లవారు జామున పోలీసులు, అధికారులు దౌర్జన్యంగా తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ నేత యలమంచిలి రవి తదితరులు ఘటనాస్థలికి చేరుకొని ఆందోళనకు దిగారు. తమ అనుమతి లేకుండా, ముందస్తు సమాచార మివ్వకుండా విగ్రహాన్ని ఎలా తొలగిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విగ్రహ తొలగింపును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. వివరాలు.. స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన కాకాని వెంకటరత్నం సేవలను గుర్తించి విజయవాడ లోని బెంజ్ సర్కిల్లో అప్పట్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల ఆ ప్రాంతంలో ఫ్లైవోవర్ నిర్మాణ పనులు చేపట్టారు. ఇందుకు విగ్రహం అడ్డు వస్తోందంటూ ఆదివారం తెల్లవారు జామున పోలీసులు, అధికారులు.. దానిని తొలగించే ప్రయత్నం చేశారు. ఈ సమాచారం అందుకున్న ఆయన అభిమానులు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి తదితరులు అక్కడకు చేరుకొని ఆందోళనకు దిగారు. యలమంచిలి రవి మాట్లాడుతూ.. టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. అధికార దర్పంతో నగరంలోని విగ్రహాలను, గుళ్లను కూల్చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర పోరాటంతో పాటు జై ఆంధ్రా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తొలగించడం దారుణమన్నారు. విగ్రహం తొలగింపు ప్రయత్నాలను అడ్డుకోబోగా పోలీసులు రవిని అరెస్టుచేసి ఆ తర్వాత విగ్రహాన్ని తొలగించారు. ప్రస్తుతం బాపు మ్యూజియంలో విగ్రహాన్ని భద్రపర చినట్లు అధికారులు తెలిపారు. కాగా ‘బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు విగ్రహం అడ్డు వస్తున్నట్లు జాతీయ రహదారుల విభాగం నుంచి నగర పోలీస్ కమిషనర్‌కు లేఖ రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకున్నాం’ అని ట్రాఫిక్ ఏసీపీ శ్రావణ్‌కుమార్ చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు మాట్లాడుతూ.. ఫ్లైఓవర్ పనులు పూర్తి కాగానే విగ్రహాన్ని యథాస్థానంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని దొంగతనంగా తరలించి కృష్ణా జిల్లా ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ప్రభుత్వంపై పార్లమెంటు మాజీ సభ్యుడు, వ్యవసాయ రంగ ప్రముఖుడు డాక్టర్ యలమంచిలి శివాజీ మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాకాని వెంకటరత్నం ఓ వ్యక్తి కాదని ఓ ఉద్యమానికి చిహ్నమని గుర్తు చేశారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో విజయవాడలో కాల్పులు జరిగి 9 మంది చనిపోయారని.. ఆ సమయంలో కెనాల్ గెస్ట్‌హౌస్‌లో ఉన్న కాకాని ఈ విషయం తెలిసి గుండెపోటుతో మరణించారని చెప్పారు. -
పీఎస్ నుంచి యలమంచలి రవి విడుదల
సాక్షి, కృష్ణా: ఉంగుటూరు పోలీసు స్టేషన్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత యలమంచిలి రవి ఆదివారం సాయంత్రం విడుదలయ్యారు. జై ఆంధ్ర ఉద్యమనేత కాకాని వెంకటరత్నం విగ్రహం తొలిగించేందుకు అధికారులు ప్రయత్నించడంతో.. వారిని యలమంచిలి రవి అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయనను అరెస్టు చేసి.. ఉంగటూరు పోలీసు స్టేషన్‌ను తరలించారు. అంతకుముందు విగ్రహ కమిటీకి చెప్పకుండా కాకాని విగ్రహాన్ని ఎలా తొలగిస్తారని యలమంచిలి పోలీసులను నిలదీశారు. ప్రొక్లైనర్‌ను అడుకుని పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. దీంతో యలమంచిలి రవిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత భారీ బందోబస్తు మధ్య కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని అధికారులు అక్కడి నుంచి తొలగించారు. ఈ క్రమంలో ఉంగుటూరు పోలీసు స్టేషన్లో ఉన్న యలమంచలి రవిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్థసారథి, మల్లాది విష్ణు పరామర్శించారు. ఆ తర్వాత సాయంత్రం యలమంచలి రవి పీఎస్ నుంచి విడుదలయ్యారు. -
విజయవాడ బెంజ్ సర్కిల్లోఉద్రిక్తత..నేతలు అరెస్టు
-
అర్ధరాత్రి ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ నేత అరెస్టు
సాక్షి, విజయవాడ : విజయవాడ బెంజ్ సర్కిల్లోఅర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. జై ఆంధ్ర ఉద్యమనేత కాకాని వెంకటరత్నం విగ్రహం తొలిగేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ చర్యను వైఎస్సార్ సీపీ నేత యలమంచిలి రవి అడ్డుకున్నారు. విగ్రహ కమిటీకి చెప్పకుండా కాకాని విగ్రహాన్ని ఎలా తొలగిస్తారని రవి ప్రశ్నించారు. ప్రొక్లైనర్‌ను అడుకుని పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. దీంతో యలమంచిలి రవిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి మాచవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత భారీ బందోబస్తు మధ్య కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని అధికారులు అక్కడి నుంచి తొలగించారు. వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళనకు దిగడంతో యలమంచిలి రవిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు నిరంకుశంగా వ్యవహరించారని విమర్శించారు. విగ్రహం తొలగింపుపై ఎవరికీ సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. అంతేకాక అడ్డుకున్న తమను పోలీసుల బలవంతంగా అరెస్టు చేశారని తెలిపారు. వైఎస్సార్ సీపీ నేతలు వంగవీటి రాధా, ఎల్లంపల్లి శ్రీనివాస్‌లు యలమంచిలి రవిని కలిసి పరామర్శించారు. మరోవైపు బెంజ్ సర్కిల్ ఉద్రిక్తత కొనసాగుతోంది. కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తొలగించడాన్ని ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
విజయవాడలో అర్ధరాత్రి ఉద్రిక్తత , వైఎస్సార్సీపీ నేత అరెస్ట్
-
వైఎస్సార్సీపీలో చేరిన యలమంచిలి రవి
-
వైఎస్సార్సీపీలో చేరిన యలమంచిలి
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కనకదుర్గమ్మ వారధి వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై యలమంచిలి రవి విలేకరులతో మాట్లాడుతూ టీడీపీలో తనకు గౌరవం ఇవ్వలేదని అన్నారు. పదవుల కోసం తాను పార్టీ మారలేదని, తనకు అప్పగించిన బాధ్యతలకు అనుగుణంగా ప్రజాసేవకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. చంద్రబాబు తనను రెండుసార్లు మోసం చేశారని, రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీపై నమ్మకం పోయిందన్నారు. కార్యకర్తలు, స్నేహితులతో చర్చించిన అనంతరం టీడీపీని వీడి వైఎస్సార్ సీపీతో చేరినట్లు యలమంచిలి రవి తెలిపారు. ‘టీడీపీలో ఉన్న మంత్రులు నన్ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధకు గురిచేశాయి. అవే నేను పార్టీ మారడానికి దోహదపడ్డాయి. రైతు గర్జన సమయంలో కూడా మమ్మల్ని ఉపయోగించుకుని మాకు సీటు ఇస్తామని హామీ ఇచ్చి మళ్లీ మోసం చేశారు. టీడీపీలో నాకు గౌరవం ఇవ్వలేదు. మనస్తాపం చెందాను. నా తండ్రి లాగానే వివాదాలు లేకుండానే పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తాను. మా తాత దగ్గర నుంచి ప్రజలకు సేవ చేస్తున్నాం. వైఎస్ జగన్ మాటకు కట్టుబడి ఉన్నాను’ అని యలమంచిలి రవి పేర్కొన్నారు. -
టీడీపీని వీడుతున్నా: మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి
పటమట(విజయవాడ తూర్పు): హామీలను నెరవేర్చకుండా పొంతన లేని సమాధానాలు చెప్పటం ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి పేర్కొన్నారు. చంద్రబాబు తనను రెండు సార్లు మోసం చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీపై నమ్మకం పోయిందన్నారు. కార్యకర్తలు, స్నేహితులతో చర్చించిన అనంతరం టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. శుక్రవారం విజయవాడ పటమటలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో ప్యాకేజీ మంచిదన్న చంద్రబాబు ఇప్పుడు హోదా కావాలంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. చెప్పారు. నేడు వైఎస్సార్ సీపీలోకి ప్రజా సంకల్ప యాత్ర శనివారం కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా కనక దుర్గ వారధి వద్ద అభిమానులు, కార్యకర్త లతో కలసి ఉదయం 9 గంటలకు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరుతు న్నట్లు యలమంచిలి రవి ప్రకటించారు. -
వైఎస్సార్సీపీలో చేరుతున్నా: యలమంచిలి రవి
విజయవాడ : తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరునున్నారు. ఈ నెల 14వ తేదీ ఉదయం 9 గంటలకు కనకదుర్గమ్మ వారధి వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా యలమంచిలి రవి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీలో తనకు గౌరవం ఇవ్వలేదని అన్నారు. ‘2009లో ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే ఎన్నికయ్యాను. ఆ తర్వాత టీడీపీలో చేరాను. ఇప్పుడు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వెళ్తున్నాను. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అనడంతో యువత నిరుత్సాహ పడ్డారు. 2004, 2014లో నన్ను భంగపడేలా చేశారు. 2014 నుంచి అవకాశం రాకపోయినా పార్టీలో ఉన్నాను. కొందరి చర్యల కారణంగా నేను పార్టీలో ఉన్నానో లేదో నాకే అర్థం కాలేదు. దీంతో బాధపడ్డాను’ అని వ్యాఖ్యానించారు. ‘టీడీపీలో ఉన్న మంత్రులు నన్ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధకు గురిచేశాయి. నేను అందుకే పార్టీ మారడానికి దోహదపడ్డాయి. రైతు గర్జన సమయంలో కూడా మమ్మల్ని ఉపయోగించుకుని మాకు సీటు ఇస్తామని హామీ ఇచ్చి మళ్లీ మోసం చేశారు. టీడీపీలో నాకు గౌరవం ఇవ్వలేదు. మనస్తాపం చెందాను. నా తండ్రి లాగానే వివాదాలు లేకుండానే పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తాను. మా తాత దగ్గర నుంచి ప్రజలకు సేవ చేస్తున్నాము. వైఎస్ జగన్ మాటకు కట్టుబడి ఉన్నాను’ అని యలమంచిలి రవి పేర్కొన్నారు. టీడీపీలో కలవరం ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర టీడీపీ శ్రేణుల్లో గుబులు పుట్టిస్తోంది. జిల్లాలో పాదయాత్ర అనంతరం టీడీపీ పునాదులు కదిలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా అంశంలో వైఎస్సార్ సీపీ వ్యూహానికి తలకిందులైన టీడీపీ నాయకులపై ఆ పార్టీ నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. -
వైఎస్సార్సీపీలోకి మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి
-
నిన్న కేశినేని.. నేడు యలమంచిలి
అధికార పార్టీలో ఆగని మాటల తూటాలు నేడు గద్దెపై యలమంచిలి రవి తీవ్ర ఆరోపణలు అధినేత వద్ద పంచాయితీలు విజయవాడ : జిల్లాలోని టీడీపీ నేతల మధ్య ఆదిపత్యపోరు తారాస్థాయికి చేరింది. జిల్లాలో ఎవరికి వారు తమ మాట నెగ్గాలని, తాను చెప్పినట్లు అధికారులు పనిచేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో నేతల నోటి నుంచి మాటల తూటాలు పేలుతున్నాయి. అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారు. శుక్రవారం ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. రాష్ట్ర డీజీపీ కూడా ‘ఎవరో.. ఏవేవో మాట్లాడుతుంటారు. వాటన్నింటినీ పట్టించుకోవాలా?..’ అంటూ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలపై స్పందించారు. నాని వ్యాఖ్యలపై పార్టీ అధినేత, సీఎం చర్చలు జరుపుతుండగానే శనివారం ఉదయం పటమట రైతు బజారులో టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌పై పలు ఆరోపణలు చేశారు. ఆయన వర్గం డబ్బులకు షాపులు అమ్ముకుంటున్నారంటూ వ్యాఖ్యానించి కలకలం సృష్టించారు. తన అనుచరులను రైతుబజారు నుంచి బయటకు పంపిస్తూ గద్దె అనుయాయులకు షాపులు కేటాయిస్తున్నారని యలమంచిలి ఆరోపించారు. ప్రజా సంక్షేమం గాలికొదిలి... ప్రజాసంక్షేమం గురించి టీడీపీ ప్రజాప్రతినిధులకు పట్టడం లేదు. ఎవరికి వారు అధికారులపై ఆధిపత్యం సాధించేందుకు పథకం ప్రకారం ముందుకు సాగుతున్నారు. ఎంపీ వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని అధిష్టానం ఆయన్ని వెంటనే హైదరాబాద్ పిలిపించింది. సీఎం చంద్రబాబు స్వయంగా ఎంపీతో మాట్లాడారు. పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అధికారులకు తాను చెబుతానని, వారి సహకారం ఉంటుందని నానీకి సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన ఆగ్రహం చల్లారింది. చంద్రబాబు నివాసం నుంచి బయటకు వచ్చిన ఎంపీ తాను పబ్లిక్‌లో కాకుండా పార్టీ నేతల వద్దే మాట్లాడి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆగ్రహాన్ని ఒక్కసారి వెళ్లగక్కడం, ఆ తరువాత సీఎం సర్దిచెప్పడంతో తాత్కాలికంగా పరిస్థితి చక్చబడింది. అయితే, తన మాటలు అధికారులు పట్టించుకోవడం లేదనే కోపంతోనే పార్టీలో జరుగుతున్న పరిణామాలను బయటపెట్టినట్లు ఎంపీ కేశినేని నాని చెప్పడం ఇదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్నికల ముందు నుంచే వైరం ఎన్నికలకు ముందు నుంచే దేవినేని ఉమాకు, కేశినేనికి మధ్య స్పర్థలున్నా యి. పార్టీ అధికారంలోకి రావడం, ఉమాకు మంత్రి పదవి దక్కడంతో అధికారులు ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘ఎంపీ పిలిచినా పట్టించుకోవద్దని, ఆయన కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడుకుంటారు..’ అని పలువురు అధికారుల వద్ద ఉమా వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ విషయాలు తెలుసుకున్న ఎంపీ కేశినేని జిల్లా ఉమా జాగీరు కాదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేల్లో సగం మందికి పైగా ఎంపీ కేశినేని నానికి అనుకూలంగా ఉన్నారు. నాని వ్యాఖ్యలపై మంత్రి కొల్లు కూడా పలువురి వద్ద సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఎం వద్దకు వెళ్లేందుకు యలమంచిలి సిద్ధం! ఎన్నికల ముందు టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి టీడీపీ గెలుపు కోసం శ్రమించారు. మొదటి నుంచి తనకు పార్టీలో ప్రాధాన్యత లేదని, ఈ విషయాన్ని చంద్రబాబు వద్దే తేల్చుకుంటానని పలు సందర్భాల్లో ఆయన పేర్కొన్నారు. రవి మాటలను పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆయన శనివారం ఉదయం తనకు అన్యాయం జరుగుతోందని, తనతోపాటు వచ్చిన వారిని ఎక్కడా ఏ పనీ చేయనీయకుండా టీడీపీ వారే అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యవహార శైలిపై సోమవారం చంద్రబాబు వద్ద తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. నలిగిపోతున్న అధికారులు టీడీపీ ప్రజాప్రతినిధుల వ్యవహార శైలితో ప్రభుత్వ అధికారులు నలిగిపోతున్నారు. మంత్రికి సమాధానం చెప్పుకోలేక, ఎమ్మెల్యేలకు ఏంచెప్పాలో అర్థం కాక తికమక పడుతున్నారు. ఏ విషయమైనా తనకు తెలియకుండా చేయొద్దంటూ ఉమా అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఎంపీ ఏకంగా బయటపడి మాట్లాడారు. పలువురు ఎమ్మెల్యేలు త్వరలోనే సీఎంకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వైద్య ఆరోగ్య శాఖలో ఏ తనిఖీలు, సమీక్షలు నిర్వహించినా ముందుగా తనకు తెలియజేయాలని మంత్రి కామినేని శ్రీనివాస్ హుకుం జారీచేయడంతో ఆ శాఖ జోలికి మాత్రం ఉమా వెళ్లడం లేదని సమాచారం. -
కృష్ణాలో చిరం‘జీవం’ ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ అయిన చిరంజీవికి కృష్ణాజిల్లాలో సొంత వర్గం లేకుండా పోయింది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ నుంచి యలమంచిలి రవి, వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనంతో యలమంచలి రవికి మంత్రిపదవి వస్తుందన్న ప్రచారం సాగింది. అయితే ఆయనకు ఆ పదవి దక్కకపోగా మాజీ మంత్రి దేవినేని నెహ్రూతో కష్టాలు తప్పలేదు. ప్రతి విషయంలోనూ పార్టీలో నెహ్రూ మాట చెల్లబడి అయ్యింది. ఆఖరికి డివిజన్ అధ్యక్షుల ఎంపిక, మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థుల ఎంపికలోనూ రవికి మొండిచెయ్యి దక్కింది. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడ పశ్చిమం నుంచి ఎన్నికైన వెల్లంపల్లి శ్రీనివాస్‌ది భిన్నమైన కధ. ఆయన ఏం చేసినా చిరంజీవి చూసీ చూడనట్లు వదిలేశారు. దుర్గగుడిపై పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులొచ్చినా పల్లెత్తు మాట అనలేదు. పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతున్నా సీటు ఇప్పించారు. తీరా సీటు వచ్చిన 24 గంటల్లోపే వెల్లంపల్లి తనదారి చూసుకున్నారు. తిరువూరులో కాంగ్రెస్ సీటు ఆశించి అది దక్కకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగిన నంబూరి శ్రీనివాసరావు చిరంజీవిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తనకు సీటు ఇప్పిస్తానని చెప్పి రెండున్నర ఎకరాల పొలాన్ని బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, 2014లో కూడా సీటు ఇవ్వకుండా తనను మోసం చేశారని ఆరోపించారు. వంగవీటి రాధాకృష్ణ ప్రజారాజ్యాన్ని పార్టీని కాంగ్రెస్‌లో కలిపివేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆయన కాంగ్రెస్‌లో కలవకుండా ఉండిపోయారు. 2012లో వైఎస్సార్ సీపీలో చేరారు. మచిలీపట్నం నుంచి పోటీ చేసిన బూరగడ్డ వేదవ్యాస్ కూడా వైఎస్సార్ సీపీలో, 2009లో గుడివాడ నుంచి పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావు తెలుగుదేశంలో చేరిపోగా, కైకలూరులో కామినేని శ్రీనివాస్ బీజెపీ తీర్థం పుచ్చుకుని అభ్యర్థిగా బరిలోకి దిగారు. జిల్లాలో ఏ నాయకుడు కూడా చిరంజీవిని నమ్ముకునే సాహసం చేయకపోవడం తగ్గిపోయిన ఆయన ప్రాభవానికి అద్దం పడుతోంది. -
వాడి తగ్గని ఉద్యమం
= వాడవాడలా ఆందోళనలు = కొనసాగిన వైఎస్సార్సీపీ, జేఏసీల దీక్షలు = ఉద్యమోధృతికి న్యాయవాదుల జేఏసీ పిలుపు సమైక్య సమ్మె విరమించి పలువురు విధుల్లోకి వెళ్లినా.. ఉద్యమ వేడి తగ్గలేదు. జిల్లా అంతటా ఎన్జీవోల జేఏసీ, వైఎస్సార్సీపీ, వివిధ వర్గాలు రోడ్లపైకొచ్చి సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగిస్తున్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. సాక్షి, విజయవాడ : సమైక్యం కోసం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీకి విభజన బిల్లు వస్తే దానికి వ్యతిరేకంగా ఓటేస్తామని ఎమ్మెల్యేల నుంచి హామీ తీసుకునే కార్యక్రమం విజయవాడలో ఉద్రిక్తత కు దారితీసింది. ఎమ్మెల్యే యలమంచిలి రవి జేఏసీ సభలో వీరంగం సృష్టించారు. దీంతో పరిస్థితి తీవ్రంగా మారింది. మంత్రి పార్థసారథి కలుగజేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లాలో ఆ పార్టీ కార్యకర్తలు, నేతల ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగాయి. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు శనివారం 67వ రోజుకు చేరాయి. హనుమాన్‌జంక్షన్‌లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. గన్నవరంలో పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నూజివీడులోని జంక్షన్‌రోడ్డులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 47వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రారంభించారు. తిరువూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 11వ రోజుకు చేరాయి. తిరువూరు మండల, పట్టణ పార్టీ కన్వీనర్లు శీలం నాగనర్శిరెడ్డి, చలమాల సత్యనారాయణల ఆధ్వర్యంలో బోసు సెంటర్లో ఏర్పాటుచేసిన శిబిరంలో పలువురు నాయకులు రిలేదీక్షలు చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో దివిసీమలో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. నాగాయలంకలో రహదారులను దిగ్బంధించి వంటావార్పు చేశారు. రోడ్డుపైనే భోజనాలు చేశారు. చల్లపల్లిలో చేపట్టిన దీక్షలు 64వ రోజుకు చేరాయి. ముగిసిన న్యాయవాదుల యాత్ర... అవనిగడ్డ కోర్టుకు చెందిన న్యాయవాదుల సమైక్యాంధ్ర ైచైతన్యయాత్ర శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా చల్లపల్లిలో బహిరంగసభ నిర్వహించి, ఉద్యమంలో రైతులు, విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని, ఆందోళనలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. అవనిగడ్డలో చేపట్టిన దీక్షలు 52వ రోజుకు చేరాయి. ఘంటసాల, మోపిదేవి, కోడూరులో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. పామర్రు ఐకేపీ మహిళలు శనివారం రిలేదీక్షలలో పాల్గొన్నారు. అడ్డాడ అరవింద స్కూల్, జుఝవరం ఉషోదయ స్కూలు విద్యార్థులు నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి ట్రాఫిక్ స్తంభింపచేశారు. గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్లో సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్షలు కొనసాగాయి. జేఏసీ, మున్సిపల్ ఉద్యోగులు దీక్షలు నిర్వహించారు. గుడ్లవల్లేరులో సమైక్యాంధ్రను కాంక్షిస్తూ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం నాటి దీక్షలలో స్వశక్తి సంఘాల మహిళలు పాల్గొన్నారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల పరిధిలో సమైక్యాంధ్ర కోసం రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని మున్సిపల్ కూడలి సమీపంలో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ముస్లిం మైనార్టీలు కూర్చున్నారు. చంద్రబాబు దీక్షకు మద్దతుగా మైలవరంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు శనివారం ఆరో రోజుకు చేరుకున్నాయి. ఎన్జీఓల ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహిస్తున్న రిలే దీక్షలు 47వ రోజూ కొనసాగుతున్నాయి. కొండపల్లిలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు శనివారం 17వ రోజుకు చేరుకున్నాయి. ఎట్టకేలకు 72 రోజుల ఉద్యమం తర్వాత జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.