కాకాని విగ్రహాన్ని తొలగిస్తున్న దృశ్యం
పటమట(విజయవాడ తూర్పు): విజయవాడ బెంజ్ సర్కిల్‌లో ఉన్న ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, జై ఆంధ్ర ఉద్యమ నేత కాకాని వెంకట రత్నం విగ్రహాన్ని ఆదివారం తెల్లవారు జామున పోలీసులు, అధికారులు దౌర్జన్యంగా తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, వైఎస్సార్‌సీపీ నేత యలమంచిలి రవి తదితరులు ఘటనాస్థలికి చేరుకొని ఆందోళనకు దిగారు. తమ అనుమతి లేకుండా, ముందస్తు సమాచార మివ్వకుండా విగ్రహాన్ని ఎలా తొలగిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
విగ్రహ తొలగింపును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. వివరాలు.. స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన కాకాని వెంకటరత్నం సేవలను గుర్తించి విజయవాడ లోని బెంజ్ సర్కిల్‌లో అప్పట్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల ఆ ప్రాంతంలో ఫ్లైవోవర్ నిర్మాణ పనులు చేపట్టారు. ఇందుకు విగ్రహం అడ్డు వస్తోందంటూ ఆదివారం తెల్లవారు జామున పోలీసులు, అధికారులు.. దానిని తొలగించే ప్రయత్నం చేశారు. ఈ సమాచారం అందుకున్న ఆయన అభిమానులు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి తదితరులు అక్కడకు చేరుకొని ఆందోళనకు దిగారు. యలమంచిలి రవి మాట్లాడుతూ.. టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. అధికార దర్పంతో నగరంలోని విగ్రహాలను, గుళ్లను కూల్చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర పోరాటంతో పాటు జై ఆంధ్రా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తొలగించడం దారుణమన్నారు. విగ్రహం తొలగింపు ప్రయత్నాలను అడ్డుకోబోగా పోలీసులు రవిని అరెస్టుచేసి ఆ తర్వాత విగ్రహాన్ని తొలగించారు.
ప్రస్తుతం బాపు మ్యూజియంలో విగ్రహాన్ని భద్రపర చినట్లు అధికారులు తెలిపారు. కాగా ‘బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు విగ్రహం అడ్డు వస్తున్నట్లు జాతీయ రహదారుల విభాగం నుంచి నగర పోలీస్ కమిషనర్‌కు లేఖ రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకున్నాం’ అని ట్రాఫిక్ ఏసీపీ శ్రావణ్‌కుమార్ చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు మాట్లాడుతూ.. ఫ్లైఓవర్ పనులు పూర్తి కాగానే విగ్రహాన్ని యథాస్థానంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని దొంగతనంగా తరలించి కృష్ణా జిల్లా ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ప్రభుత్వంపై పార్లమెంటు మాజీ సభ్యుడు, వ్యవసాయ రంగ ప్రముఖుడు డాక్టర్ యలమంచిలి శివాజీ మండిపడ్డారు.
ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాకాని వెంకటరత్నం ఓ వ్యక్తి కాదని ఓ ఉద్యమానికి చిహ్నమని గుర్తు చేశారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో విజయవాడలో కాల్పులు జరిగి 9 మంది చనిపోయారని.. ఆ సమయంలో కెనాల్ గెస్ట్‌హౌస్‌లో ఉన్న కాకాని ఈ విషయం తెలిసి గుండెపోటుతో మరణించారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment