మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి
విజయవాడ : తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరునున్నారు. ఈ నెల 14వ తేదీ ఉదయం 9 గంటలకు కనకదుర్గమ్మ వారధి వద్ద వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా యలమంచిలి రవి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీలో తనకు గౌరవం ఇవ్వలేదని అన్నారు. ‘2009లో ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే ఎన్నికయ్యాను. ఆ తర్వాత టీడీపీలో చేరాను. ఇప్పుడు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వెళ్తున్నాను. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అనడంతో యువత నిరుత్సాహ పడ్డారు. 2004, 2014లో నన్ను భంగపడేలా చేశారు. 2014 నుంచి అవకాశం రాకపోయినా పార్టీలో ఉన్నాను. కొందరి చర్యల కారణంగా నేను పార్టీలో ఉన్నానో లేదో నాకే అర్థం కాలేదు. దీంతో బాధపడ్డాను’ అని వ్యాఖ్యానించారు.
‘టీడీపీలో ఉన్న మంత్రులు నన్ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధకు గురిచేశాయి. నేను అందుకే పార్టీ మారడానికి దోహదపడ్డాయి. రైతు గర్జన సమయంలో కూడా మమ్మల్ని ఉపయోగించుకుని మాకు సీటు ఇస్తామని హామీ ఇచ్చి మళ్లీ మోసం చేశారు. టీడీపీలో నాకు గౌరవం ఇవ్వలేదు. మనస్తాపం చెందాను. నా తండ్రి లాగానే వివాదాలు లేకుండానే పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తాను. మా తాత దగ్గర నుంచి ప్రజలకు సేవ చేస్తున్నాము. వైఎస్ జగన్ మాటకు కట్టుబడి ఉన్నాను’ అని యలమంచిలి రవి పేర్కొన్నారు.
టీడీపీలో కలవరం
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వస్తున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర టీడీపీ శ్రేణుల్లో గుబులు పుట్టిస్తోంది. జిల్లాలో పాదయాత్ర అనంతరం టీడీపీ పునాదులు కదిలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా అంశంలో వైఎస్సార్ సీపీ వ్యూహానికి తలకిందులైన టీడీపీ నాయకులపై ఆ పార్టీ నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment