సాక్షి, విజయవాడ :
విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో సమైక్యవాదులు అవిశ్రాంత పోరు సాగిస్తున్నారు. ఆందోళనలు, నిరసనలు, దీక్షలు, రాస్తారోకోలు అన్ని మండలాలు, గ్రామాల్లో కొనసాగుతున్నాయి. ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వ సంస్థలు మూతబడ్డాయి. బ్యాంకులు తెరవలేదు. పోస్టల్ సేవలు అందలేదు. దీంతో ఆయా సంస్థల నుంచి ప్రజలకు సేవలు అందకపోవడంతో జనజీవనం స్తంభించింది. విద్యుత్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో జనజీవనం అంధకారంలో మగ్గిపోయింది. జనం ఉక్కపోతతో విలవిలలాడారు.
రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలో అనేకచోట్ల తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. పట్టణాలు, పల్లెల్లో జనం విలవిల్లాడారు. మంగళవారం ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి రెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విద్యుత్ కోత విధించారు. దీంతో ప్రజలు నానా అగచాట్లు పడ్డారు. ముఖ్యంగా ఏటీఎం సెంటర్లు విద్యుత్ లేక చాలాచోట్ల మొరాయించాయి. ఆస్పత్రుల్లో విద్యుత్ లేకపోవడంతో రోగులు విల విల్లాడారు. విద్యుత్ జేఏసీ నాయకులు ట్రాన్స్‌కో కార్యాలయాల వద్ద, ఏపీఎస్‌పీడీసీఎల్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి కేంద్రం దిగివచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. అయినా సమైక్యం కోసం ఈ బాధలు పడడానికి సిద్ధమని... ప్రభుత్వం గద్దె దిగేవరకు తాము ఇబ్బందులు ఓర్చుకుంటామని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు.
రాధా దీక్ష భగ్నం...
రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా విజయవాడలో వైఎస్సార్ సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ చేపట్టిన ఆమరణదీక్షను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున భగ్నం చేశారు.
ఎమ్మెల్యే విష్ణు దౌర్జన్యం
సమైక్య రాష్ట్రం కోసం రాజీనామా చేయాలని బెజవాడ బార్ అసోసియేషన్ సమైక్య జేఏసీ న్యాయవాదులు ఎమ్మెల్యే మల్లాది విష్ణును నిలదీశారు. ఈ సంఘటనతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే న్యాయవాదులపై తన ప్రైవేటు సైన్యంతో దౌర్జన్యానికి దిగారు. దీంతో తిరగబడ్డ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో బెజవాడ కోర్టుల ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజయవాడ ఎంపీ లగడపాటి కనబడటం లేదంటూ విద్యార్థి జేఏసీ, పొలిటికల్ జేఏసీ నాయకులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అవనిగడ్డలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయం ముందు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.
కొనసాగుతున్న దీక్షలు...
కోడూరు, నాగాయలంక మండలాల్లో దీక్షలు నాలుగో రోజుకు చేరాయి. జేఏసీ ఆధ్వర్యంలో చల్లపల్లిలో చేపట్టిన దీక్షలు 60వ రోజూ కొనసాగాయి. అవనిగడ్డలో చేపట్టిన దీక్షలు 48వ రోజుకు చేరాయి. వేకనూరుకు చెందిన 70 మంది రైతులు దీక్షలో పాల్గొన్నారు. తొలుత వారు ట్రాక్టర్లతో వేకనూరు నుంచి అవనిగడ్డ వరకు ర్యాలీ నిర్వహించారు. జేఏసీ పిలుపు మేరకు దివిసీమలో ప్రభుత్వ రంగసంస్థలు బంద్ పాటించాయి. జేఏసీ నాయకులు బ్యాంకులు, ఎల్‌ఐసీ, టెలికాం, పోస్టాఫీస్‌లను మూసివేయించారు.
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో తిరువూరులో రిలేదీక్షలు ఏడోరోజుకు చేరాయి. పార్టీ నాయకురాలు పిడపర్తి లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో కృష్ణా థియేటర్ సెంటర్లో రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో పామర్రు నాలుగురోడ్ల కూడలిలో బజ్జీలు వేసి నిరసన తెలిపారు. నూజివీడులో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 62వ రోజుకు చేరాయి. విద్యుత్ ఉద్యోగులు జంక్షన్‌రోడ్డులో ధర్నా నిర్వహించారు. చిన్నగాంధీబొమ్మ సెంటరులోని రిలేదీక్ష శిబిరంలో ఉపాధ్యాయులు కూర్చున్నారు. ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులకు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు లక్ష రూపాయల విలువైన బియ్యాన్ని పంపిణీ చేశారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జంక్షన్‌రోడ్డులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 43వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను వైఎస్సార్‌సీపీ నియోజకవర్గం సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రారంభించారు.
అవిశ్రాంత పోరు
Published Wed, Oct 9 2013 3:24 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement