- కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగుల స్పష్టీకరణ
- అధికారులకు సమ్మె నోటీసులు అందజేసిన జేఏసీ నాయకులు
విజయనగరం మున్సిపాలిటీ: డిమాండ్‌ల సాధన కోసం కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న సమ్మెలో భాగంగా జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు విజయనగరం జిల్లాలో ఈ నెల 15 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లనున్నారు. ఈ మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ బి.గోవిందరావు, కన్వీనర్ జి.సురేష్, రాష్ట్ర కమిటీ సభ్యుడు రామకృష్ణలు కలెక్టర్‌తో పాటు ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ సి.శ్రీనివాసమూర్తికి, విజయనగరం డీఈ ప్రసాద్‌లకు సమ్మె నోటీసులు అందించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ గోవిందరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో సుమారు 15వేల మంది వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా.. జిల్లాలో వెయ్యి మంది ఉద్యోగులు ఇదే జీవనాధారంగా పని చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వాలు తమ ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సంస్థలో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వినియోగదారులకు నిరంతర సేవలందించటంలో కీలక పాత్ర పోషిస్తున్న తమపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించటం సమంజసం కాదన్నారు. కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, దశల వారీగా క్రమబద్ధీకరణ చేయాలన్న డిమాండ్‌లతో సమ్మెలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై రెగ్యులర్ విద్యుత్ ఉద్యోగుల సంఘాలకు విన్నవించటం జరిగిందని, వారు కూడా మద్దతిచ్చేందుకు హమీ ఇచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వం, యాజమాన్యాలు స్పందించి తమ డిమాండ్‌లను పరిష్కరించకపోతే 15 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళతామని స్పష్టం చేశారు.
15 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి...
Published Sat, Dec 6 2014 4:15 AM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM