శివాజీనగర్, న్యూస్‌లైన్ : నిరక్షరాస్యత నిర్మూలనకోసం అమలు చేస్తున్న సాక్షర భారత్ కార్యక్రమం అభాసుపాలవుతోంది. తొమ్మిది నెలలుగా వేతనాలు అందక కార్యక్రమ కోఆర్డినేటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మండల, గ్రామ స్థాయి కోఆర్డినేటర్లు సుమారు 1,400 మంది పనిచేస్తున్నారు. మండల కోఆర్డినేటర్లకు నెలకు రూ. 6 వేలు, గ్రామ కోఆర్డినేటర్లకు రూ. 2 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. అయితే మండల కోఆర్డినేటర్లకు ఏడు నెలలుగా, గ్రామ కోఆర్డినేటర్లకు తొమ్మిది నెలలుగా వేతనాలు అందడం లేదు. వేతనాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కోఆర్డినేటర్లు పలుసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో వారు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
అన్ని జిల్లాల్లోని కోఆర్డినేటర్లంతా కలిసి ఈ నెల 30వ తేదీన హైదరాబాద్‌లోని వయోజన విద్య డెరైక్టరేట్‌ను ముట్టడించాలని నిర్ణయించారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని, కనీస వేతనం పెంచాలని, వయోజన విద్యాశాఖలో ఖాళీగా ఉన్న సూపర్‌వైజర్ పోస్టులను మండల కోఆర్డినేటర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలతో భర్తీ చేయాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని, ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఎనిమిది ప్రధాన డిమాండ్లతో డెరైక్టరేట్ ముట్టడికి సిద్ధమవుతున్నారు.
వేతనాలు విడుదల చేయాలి
సాక్షర భారత్ కోఆర్డినేటర్లకు ఏడెనిమిది నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలు మంజూరు చేయాలి. గ్రామ కోఆర్డినేటర్ల వేతనాన్ని రూ. 4 వేలకు, మండల కోఆర్డినేటర్ల వేతనాన్ని రూ. 12 వేలకు పెంచాలి. నెలనెలా క్రమం తప్పకుండా వేతనం అందేలా చర్యలు తీసుకోవాలి.
-శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు,సాక్షర భారత్ ఉద్యోగుల సంఘం, ఇందూరు
జీతాలు ఇంకెప్పుడిస్తరు!
Published Wed, Nov 13 2013 6:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM
Advertisement
Advertisement