సాక్షి, కాకినాడ: ‘కోవిడ్–19’ వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ గడువు మే 3వ తేదీకి కేంద్రం పొడిగించడంతో ఏప్రిల్ 14 తర్వాత ఎత్తివేస్తారని, రెడ్ జోన్లకే పరిమితం చేస్తారనే ప్రచారానికి తెరపడింది. ఈ నెల 20వ తేదీ వరకు మరింత కఠినంగా అమలు చేస్తామని, అనంతరం కొన్ని అత్యవసరాలకు వెసులుబాటు ఉంటుందని చెప్పడంతో కాస్తా ఊపిరి పీల్చుకున్నారు. అది కూడా కేసుల సంఖ్య పెరగకపోతే మాత్రమే సడలింపులుంటాయని వెల్లడించారు. రెడ్ జోన్ల సంఖ్య ఇప్పుడున్న వాటికే పరిమితం కావాలని, లేనిపక్షంలో మే 3 వరకు సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తామని స్పష్టం చేశారు.
మార్పేదీ?
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అనుమానిత లక్షణాలున్న వారికి పరీక్షలు చేసి క్వారంటైన్‌కు తరలించారు. పాజిటివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నా జిల్లా కేంద్రమైన కాకినాడ, కత్తిపూడిలోని కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు, వైద్య సిబ్బంది, పోలీసులు, వలంటీర్లు, పారిశుద్ధ్య కారి్మకులు ఇలా ప్రతి ఒక్కరూ ‘కోవిడ్–19’ కట్టడికి కృషి చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం అవేమీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. ప్రమాదమని తెలిసినా కూడా పెడచెవిన పెడుతూ కనీస భద్రత చర్యలు కూడా తీసుకోవడం లేదు.
కత్తిపూడి ఘటనే ఉదాహరణ
కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని ప్రచార మాధ్యమాల ద్వారా అధికార యంత్రాంగం ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. విద్యా వంతులై ఉండి కూడా ఇలాంటి వాటిని పట్టించుకోవడం లేదనడానికి కత్తిపూడిలో ఇటీవల జరిగిన ఘటనే ఇందుకు సాక్ష్యం. ఉపాధ్యాయుడైన అతను వైరస్ సోకిందని నిర్ధారించుకుని వైద్యులను సంప్రదించకుండా ఆర్‌ఎంపీ దగ్గర వైద్యం చేయించుకోవడం.. తిరిగి మరో ఐదుగురికి వైరస్ సోకేందుకు కారణమయ్యాడు. ఇలాంటి ఘటనలు పునావృతమైతే కేసులు పెరిగి లాక్‌డౌన్ ఆంక్షలు మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉంది. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండి, అధికారులకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు అంటున్నారు.
మరింత పకడ్బందీగా...
‘కోవిడ్–19’ వైరస్ వ్యాప్తి నివారించేందుకు లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఇకపై మరింత కఠినతరం చేస్తాం. ప్రజలందరూ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వివరాలు దాచకుండా వైద్య సిబ్బందికి సహకరించాలి. జలుబు, దగ్గులాంటి లక్షణాలుంటే ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి చికిత్స తీసుకోవాలి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆర్‌ఎంపీలు వైద్యం చేయొద్దు. లాక్‌డౌన్ నుంచి త్వరగా విముక్తి పొందాంటే ఒక్క కేసు కూడా నమోదు కాకుండా చూసుకోవాలి. అలా జరగాలంటే ప్రజలు సహకరించాలి. –డి.మురళీధర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్
ఆంక్షలు కఠినతరం
లాక్‌డౌన్ ఆంక్షలు ఈ నెల 20వ తేదీ వరకు మరింత కఠినతరం చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిత్యావసరాలు, కూరగాయలు తీసుకునేందుకు ఉదయం 9 గంటల వరకే అనుమతులు మంజూరు చేయనున్నారు. కఠిన నిర్ణయాలు అమలు చేయకపోతే కేసుల సంఖ్య మరింతగా పెరిగి లాక్‌డౌన్‌లోనే మరింకొంత కాలం ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటాయి.
Comments
Please login to add a commentAdd a comment