తొమ్మిదో తరగతి వరకు చదివిన విద్యార్థులు 10వ తరగతికి వేరే పాఠశాలకు వెళ్లిపోకుండా కట్టడి చేయడానికి కార్పొరేట్ యాజమాన్యాలు వేసవి సెలవుల్లో పదో తరగతి సిలబస్ బోధించడం మొదలుపెట్టాయి. తద్వారా విద్యార్థులకు వేసవి సెలవులు లేకుండా పోయాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కడైనా విహార యాత్రకు వెళ్లడానికి కూడా వీలు లేకుండా కార్పొరేట్ స్కూళ్లు వ్యవహరిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది.
తిరుపతి ఎడ్యుకేషన్ : ఉన్నత విద్యకు వారధి ఇంటర్. దీని తర్వాత ఇంజినీరింగ్, మెడిసిన్, ఇతర కోర్సుల్లో చేరేందుకు జేఈఈ, నీట్ వంటి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇదే సాకుగా ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించకుండా కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలతో పాటు బ్రిడ్జి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఈ వింత పోకడ కాస్త స్కూళ్లకు పాకింది. వేసవిలో తరగతులు నిర్వహించకూడదన్న నిబంధనలను తుంగలో తొక్కి తరగతులు నిర్వహిస్తున్నాయి.
తొమ్మిదో తరగతి ముగించుకున్న విద్యార్థులకు వేసవి సెలవుల్లో పదో తరగతి సిలబస్‌ను బోధిస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలలే కాకుండా సాధారణ పాఠశాలలు ఈ పంథాను అవలంబిస్తూ విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నాయి. తిరుపతి నగరంలో దాదాపుగా 160 వరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలున్నాయి. పాఠశాలల మధ్య పోటీ పెరిగింది. ఈ పోటీని తట్టుకుని నిలబడేం దుకు కొన్ని పాఠశాలలు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ రూపొందించిన షెడ్యూల్ ప్రకా రం కాకుండా ముందస్తుగానే పదో తరగతిలో సిలబస్‌ను పూర్తి చేయించి, విద్యార్థులకు పునఃశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఒక రకంగా ఇది విద్యార్థులకు మేలు చేకూరే అంశమే అయినప్పటికీ విద్యార్థుల హక్కులను కాలరాస్తూ వేసవిలో తరగతులు నిర్వహించడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.
వేసవిలో పదో తరగతి సిలబస్
కార్పొరేట్ తరహాలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ వేసవి సెలవుల్లో పదో తరగతి సిలబస్‌ను బోధిస్తున్నాయి. విద్యాశాఖ నిబంధనలకు ఇది విరుద్ధం. ఏప్రిల్ 23 నుంచి జూన్ 12వ తేదీ వరకు పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 13న పునఃప్రారంభించాలి. ఈ నిబంధనలను కొన్ని పాఠశాలలు పాటించడం లేదు. చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖాధికారులు చోద్యం చూస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
పదికి 10 జీపీఏ కోసమేనంటూ
పోటీ ప్రపంచానికి దీటుగా రాణించాలంటే చదువు తప్పనిసరి అంటూ పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తూ విద్యార్థులను వేసవి సెలవులకు దూరం చేస్తున్నాయి. పదో తరగతి ఫలితాల్లో పదికి 10 జీపీఏ సాధిం చాలంటే ఇప్పటి నుంచే చదవాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తున్నాయి. తిరుపతిలోనే కొన్ని పాఠశాలలు సెలవులు ఇవ్వకుండా తొమ్మిదో తరగతి విద్యార్థులకు తరగతులు యథేచ్ఛగా నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మార్కుల మాయలో ç తల్లిదండ్రులు సైతం అభ్యంతరం చెప్పకుండా ఊరకుంటున్నారు. తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రావాలని, లేకుంటే పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది కలిగించిన వారమవుతామని మేధావులు హెచ్చరిస్తున్నారు.
హక్కులను కాలరాయొద్దు
కొన్ని విద్యాసంస్థలు విద్యాశాఖ నిబంధనలను పాటించకుండా విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నాయి. ఏడాది పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలకు వేసవి సెలవులు ఆటవిడుపునిస్తాయి. మానసికోల్లాసాన్ని కలిగి స్తాయి. ఒత్తిడి దూరమవుతుంది. అయితే మార్కుల పేరుతో వేసవి సెలవుల్లో తొమ్మిదో తరగతి ముగించుకున్న విద్యార్థులకు పదో తరగతి సిలబస్‌ను బోధిస్తున్నాయి. ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే ఊరుకోం.– వడిత్య శంకర్‌నాయక్, వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, జీవీఎస్
కఠిన చర్యలు తీసుకుంటాం
విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 23 నుంచి జూన్ 12వ తేదీ వరకు వేసవి సెలవుల్లో ఎటువంటి తరగతులూ నిర్వహించకూడదు. ఇప్పటికే ఎంఈఓ, సీఆర్పీల ద్వారా వేసవిలో తరగతులు నిర్వహించకూడదంటూ అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేశాం. నిబంధనలు అతిక్రమించి వేసవి తరగతులు నిర్వహిస్తే ఆయా పాఠశాలలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు సిఫా రసు చేస్తాం. అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటాం. – సీ విజయేంద్రరావు, ఉప విద్యాశాఖాధికారి, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment