పంటకాలువ రోడ్డు పనులను పరిశీలిస్తున కమిషనర్ నివాస్ (ఫైల్)
‘నగరం పసుపుమయంతోపాటు పచ్చదనంతో కళకళలాడాలి. రంగులతో శోభాయమానంగా తీర్చిదిద్దాలి’ ఇదీ చినబాబు ఆదేశం. అసలే అప్పుల ఊబిలో పీకల్లోతులో కూరుకుపోయిన కార్పొరేషన్ అధికారులు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనిలో మునిగారు. మహా ప్రాపకం కోసం సిబ్బందే దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తూ అప్పుల భారాలను మరింతపెంచుతున్నారు.
సాక్షి,అమరావతిబ్యూరో/ పటమట : విజయవాడ నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది..విలువైన ఆస్తులను తాకట్టు పెట్టాం , బ్యాంకు రుణాలకు వడ్డీ కట్టలేని దుస్థితిలో ఉన్నాం.. నిధులు దుర్వినియోగం చేయెద్దు, అందరూ పొదుపు పాటించండి.. ఇదీ నగర మేయర్ కోనేరు శ్రీధర్ నిత్యం ప్రకటన సారాంశం..
మేయర్ ప్రకటనకు క్షేత్ర స్థాయిలో జరిగే పనులకు ఏమాత్రం పొంతన ఉండడం లేదు. అధికార పార్టీ కనుసన్నల్లో నడిచే వీఎంసీ పాలకపక్షం వారి ప్రాపకం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచేలా తీసుకుంటున్న నిర్ణయాలపై నగరవాసులు మండిపడుతున్నారు. టీడీపీ ఈనెల 27న కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించే మహానాడు కార్యక్రమ సేవలో వీఎంసీ పాలక పక్షం నుంచి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తలమునకలయ్యారు. అప్పుల్లో ఉన్న వీఎంసీ నిధులు కూడా మహానాడు కార్యక్రమం కోసం వెచ్చిస్తున్నారు.
ఇప్పటికే రూ.400 కోట్లు అప్పుల ఊబిలో ఉంది. నెలవారీ వడ్డీలు కూడా చెల్లించలేని దుస్థితి ఉంది. నగరంలో చూస్తే ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి.. తాగు నీటి కష్టాలు వెంటాడుతున్నాయి..ఇన్ని సమస్యలుంటే వాటిని వదిలేసి మహానాడు కోసం అధికారులు , ఉద్యోగులు , సిబ్బంది, పాలకపక్ష నేతలు పరుగులు తీస్తున్నారు.
సుందరీకరణ ముసుగేసి..
మహానాడు వచ్చే నేతలకు నగరాన్ని రంగుల హంగులతో తీర్చిదిద్దాలని చినబాబు ఆదేశాలిచ్చారు. అంతే నగర పాలకసంస్థ ఉన్నతాధికారులు నుంచి కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బంది వరకు సుందరీకరణ పనుల్లో పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. గ్రీనరీ, రోడ్డు అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నగర కమిషనర్ జనరల్ ఫండ్ నుంచి రూ.కోటి నిధులు విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగానికి రూ.50 లక్షలు, ఉద్యానవన విభాగానికి రూ.50 లక్షలు ఖర్చు చేసేలా ప్రతిపాదనలు రాత్రికి రాత్రే పూర్తి చేసి పనులు చేపట్టారు.
గ్రీనరీలో కక్కుర్తి ..
గ్రీనరీ పనుల్లో అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలున్నాయి.. సెంట్రల్ డివైడర్ మధ్యలో ఏర్పాటుచేస్తున్న పెంటనాస్, లిల్లీ మొక్కలు రూ.12 నుంచి 15 రూపాయల వరకు ఉంటాయి. కానీ వాటిని సంబంధిత కాంట్రాక్టర్ రూ. 25 వంతున కొనుగోళ్లు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ పనులు కూడా రాత్రికిరాత్రే నామినేటెడ్ విధానంలో కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులకు కూడా డివైడర్ మధ్యలో వేసే కోనాకార్పస్ మొక్కలు రూ. 75 ఉన్నప్పటికీ రూ . 150 వెచ్చించినట్లు తెలుస్తోంది.
హడావిడిగా రోడ్డు పనులు
పంటకాల్వ రోడ్డును వెడల్పు చేసేందుకు వీఎంసీ అధికారులు రాత్రికి రాత్రే ప్రణాళికలు రూపొందించేశారు. సుమారు 2.5 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ప్రాంతానికి రోడ్డుకు ఇరువైపులా మూడు అడుగులమేర వెడల్పు చేస్తున్నారు. ఇందు కోసం దాదాపు రూ.50 ల„ýక్షలు వెచ్చించినట్లు తెలిసింది. ఆ పనులను భారీ యంత్రాలతో ఆగమేçఘాలపై చేయిస్తున్నారు. కమిషనర్ స్వయంగా పనులను పర్యవేక్షించడం విశేషం.
కార్పొరేషన్ సిబ్బందితో పనులు
మహానాడు కోసం హడావుడిగా చేస్తున్న నగర గ్రీనరీ పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అయితే పనులు వేగవంతంగా జరగకపోవడంతో కార్పొరేషన్ సిబ్బందినే ఈ పనులకు పురమాయించారు. డివైడర్ మధ్యలో మట్టిని నింపి, మొక్కలు నాటేందుకు హార్టీ కల్చర్ విభాగంలో విధులు నిర్వహించే 50 మంది సిబ్బందిని వాడుకుంటున్నారు. ఇందుకు ఆ విభాగ ముఖ్యఅధికారికి కాంట్రాక్టర్ తాయిలాలు అందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
14 లారీల మొక్కలు
పటమట పంటకాలువ రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఆటోనగర్ సనత్‌నగర్ క్రాస్ వరకు డివైడర్ మధ్యలో మొక్కలు నాటేందుకు వీఎంసీ బాధ్యతలు తీసుకుంటే అక్కడి నుంచి కానూరు మహా నాడు ప్రాంతం వరకు సీఆర్‌డీఏ ఆ పనులు చేపడుతోంది. కార్పొరేషన్ పరిధిలో పెంటనాస్, లిల్లీ మొక్కలను నాటేందుకు 7 లారీల మొక్కలు దిగుమతి చేసుకున్నారు. ఒక్కోలారీకి రూ. 3 వేల మొక్కలు పడతాయి. కానూరు పంచాయతీ పరిధి ప్రారంభం నుంచి మహానాడు జరిగే సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల వరకు రోడ్డు మధ్యలో నాటే కోనా కార్పస్ మొక్కలు మరో ఏడు లారీలు, మిగిలిన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో మొక్కలు నాటేందుకు మరో ఆరు లారీల మొక్కలు దిగుమతి చేసుకుంటామని అధికారులు తెలిపారు.
సుందరీకరణకోసం
నగరంలోని వివిధ ప్రాంతాలను సుందరీకరణ చేయడానికి చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సెంట్రల్ డివైడర్‌లో, పార్కులు, ఇతర ప్రాంతాల్లో ఆహ్లాదకరవాతావరణం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. కమిషనర్ ఆదేశాల మేరకు గత 20 రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో రూ. 50 లక్షల వరకు మొక్కల కొనుగోలు, మట్టి కొనుగోలు, పాతమట్టి తొలగింపు, కొత్తమట్టి ఏర్పాటు, మొక్కలు నాటుతున్నాం. పంటకాల్వ రోడ్డుకు ఇప్పటి వరకు రూ. 20 లక్షల వరకు వెచ్చించాం.– ప్రదీప్, ఏడీహెచ్
నగరాభివృద్ధిలో భాగంగానే..
రాజధాని నేపధ్యంలో నగరంలో విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతుంది. దీన్ని నియత్రించేందుకు వీఎంసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రోడ్డు మధ్యల్లో సెంట్రల్ డివైడర్లు ఏర్పాటు చేయడం, పాతవాటికి రంగులు వేయడం, రోడ్డుకు ఇరువైపులా వెడల్పు చేయడానికి చర్యలు చేపడుతున్నాం. అన్ని ప్రాంతాల్లో డివైడర్లకు రంగులు వేస్తున్నాం. పంటకాల్వ రోడ్డుకు వెడల్పుకు, డివైడర్‌కు రంగులకు ఇప్పటి వరకు రూ. 30 లక్షల అంచనాలతో పనులు జరుగుతున్నాయి. తూర్పు నియోజకవర్గ పరిధిలో జరిగే అభివృద్ధి పనులను సర్కిల్–3 పరిధిలోని ఈఈ పర్యవేక్షిస్తున్నారు.– పి.ఆదిశేషు, సీఈ
Comments
Please login to add a commentAdd a comment