మేయరైతే మేయవచ్చు!
♦ ఆశావహులకు సంకేతాలిస్తున్న టీడీపీ అధిష్టానం
♦ ఎవరెక్కువ ముట్టజెబితే వారికే పీఠం
♦ నష్టమేమీ ఉండదని పరోక్ష సంకేతాలు
♦ స్మార్ట్‌సిటీ నిధులతో ‘లాభసాటి’ అని భరోసా
♦ జోరందుకున్న పైరవీలు
‘మేయర్ పీఠం కొనుక్కోండి అడ్డంగా మేసేయండి’ ఇదీ టీడీపీ అధిష్టానం పార్టీ ఆశావహులకు ఇస్తున్న పిలుపు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించినప్పటి నుంచి ఆ పార్టీలో మేయర్ పీఠం కోసం పోటీ నెలకొంది. గట్టిగా పోటీ పడుతున్న నలుగురిలో ఎవరు ఎక్కువ సొమ్ములిస్తే వారికే పదవిని కట్టబెట్టే యోచనలో ఉన్న అధిష్టానం వారు తిరిగి సొమ్ము రాబట్టుకొనే విధానం కూడా సూచిస్తుండడం గమనార్హం.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : మొన్నటి వరకు ఎవరు గెలుస్తారనేదానిపై చర్చ ... ఇప్పుడు ఎవరు మేయర్ అవుతారన్న దానిపై టీడీపీలో జగడం మొదలైంది. నలుగురు పోటీ పడుతుండటంతో మేయర్ పీఠంపై ఆసక్తి నెలకొంది. ఎవరెక్కువ ముట్టజెబితే వారికే మేయర్ పీఠం కట్టబెట్టాలని టీడీపీ అధిష్టానం చూస్తోంది. అందువల్ల నష్టపోయేదేమీ లేదని...స్మార్ట్ సిటీ నిధులు దండిగా వస్తాయని...అందులో దండుకోవచ్చునని పరోక్ష సంకేతాలు కూడా పంపిస్తోంది. దీంతో మేయర్ పదవి దక్కించుకునేందుకు అశావహుల పైరవీలు ఊపందుకున్నాయి.
పోటీలో ఆ నలుగురు
మేయర్ పదవి కోసం నలుగురు పోటీ పడుతున్నారు. 28వ డివిజన్ కార్పొరేటర్ సుంకర పావని, 40వ డివిజన్ కార్పొరేటర్ సుంకర శివప్రసన్న, 38వ డివిజన్ కార్పొరేటర్ మాకినీడి శేషుకుమారి, 8వ డివిజన్ కార్పొరేటర్ అడ్డూరి వరలక్ష్మి ఆశిస్తున్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో నేత తెరవెనుక అండగా నిలుస్తున్నారు. సుంకర శివప్రసన్నకు మంత్రి యనమల అండదండలుండగా, సుంకర పావనికి ఎంపీ తోట నర్సింహంతోపాటు పలువురు ఎమ్మెల్యేలు మద్దతుగా నిలుస్తున్నారు. మాకినీడి శేషుకుమారికి మంత్రి నారాయణ వెన్నుదన్నుగా నిలువగా, అడ్డూరి వరలక్ష్మికి స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మద్దతిస్తున్నారు. దీంతో ఎవరికి వారు పైరవీలకు శ్రీకారం చుట్టారు.
ఖర్చుకు వెనుకాడని ఆశావహులు...
హాట్‌కేకులా తయారైన మేయర్ పీఠంపై ఆశావహులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఒకసారి మేయర్ కుర్చీపై కూర్చొంటే చాలని కొందరు...పదవి వచ్చాక ఖర్చు పెట్టిందంతా రాబట్టుకోవచ్చన్న ఆలోచనతో మరికొందరు ఎవరిదారిలో వారు పోటీ పడుతున్నారు. అభ్యర్థులు గెలిచేందుకు ఎంతో ఖర్చు పెట్టాం...ఇప్పుడు అందులో కొంతైనా మేయర్ పదవి బూచిగా చూపించి రాబట్టుకోవాలని రాష్ట్ర పార్టీ నేతలు భావిస్తున్నారు. ఓటుకి రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చు పెడితేనే గెలవగలిగామని, ఆ స్థాయిలో చేసిన ఖర్చులో కొంతైనా రికవరీ చేయాలని ఆలోచన చేశారు. అందులో భాగంగానే ఈ పథక రచనకు దిగారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ కోట్ల రూపాయల సీటు పందెంలో ఎవరిది పైచేయో వేచి చూడాల్సిందే....!