mayor seat
-
మేయరైతే మేయవచ్చు!
♦ ఆశావహులకు సంకేతాలిస్తున్న టీడీపీ అధిష్టానం ♦ ఎవరెక్కువ ముట్టజెబితే వారికే పీఠం ♦ నష్టమేమీ ఉండదని పరోక్ష సంకేతాలు ♦ స్మార్ట్‌సిటీ నిధులతో ‘లాభసాటి’ అని భరోసా ♦ జోరందుకున్న పైరవీలు ‘మేయర్ పీఠం కొనుక్కోండి అడ్డంగా మేసేయండి’ ఇదీ టీడీపీ అధిష్టానం పార్టీ ఆశావహులకు ఇస్తున్న పిలుపు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించినప్పటి నుంచి ఆ పార్టీలో మేయర్ పీఠం కోసం పోటీ నెలకొంది. గట్టిగా పోటీ పడుతున్న నలుగురిలో ఎవరు ఎక్కువ సొమ్ములిస్తే వారికే పదవిని కట్టబెట్టే యోచనలో ఉన్న అధిష్టానం వారు తిరిగి సొమ్ము రాబట్టుకొనే విధానం కూడా సూచిస్తుండడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, కాకినాడ : మొన్నటి వరకు ఎవరు గెలుస్తారనేదానిపై చర్చ ... ఇప్పుడు ఎవరు మేయర్ అవుతారన్న దానిపై టీడీపీలో జగడం మొదలైంది. నలుగురు పోటీ పడుతుండటంతో మేయర్ పీఠంపై ఆసక్తి నెలకొంది. ఎవరెక్కువ ముట్టజెబితే వారికే మేయర్ పీఠం కట్టబెట్టాలని టీడీపీ అధిష్టానం చూస్తోంది. అందువల్ల నష్టపోయేదేమీ లేదని...స్మార్ట్ సిటీ నిధులు దండిగా వస్తాయని...అందులో దండుకోవచ్చునని పరోక్ష సంకేతాలు కూడా పంపిస్తోంది. దీంతో మేయర్ పదవి దక్కించుకునేందుకు అశావహుల పైరవీలు ఊపందుకున్నాయి. పోటీలో ఆ నలుగురు మేయర్ పదవి కోసం నలుగురు పోటీ పడుతున్నారు. 28వ డివిజన్ కార్పొరేటర్ సుంకర పావని, 40వ డివిజన్ కార్పొరేటర్ సుంకర శివప్రసన్న, 38వ డివిజన్ కార్పొరేటర్ మాకినీడి శేషుకుమారి, 8వ డివిజన్ కార్పొరేటర్ అడ్డూరి వరలక్ష్మి ఆశిస్తున్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో నేత తెరవెనుక అండగా నిలుస్తున్నారు. సుంకర శివప్రసన్నకు మంత్రి యనమల అండదండలుండగా, సుంకర పావనికి ఎంపీ తోట నర్సింహంతోపాటు పలువురు ఎమ్మెల్యేలు మద్దతుగా నిలుస్తున్నారు. మాకినీడి శేషుకుమారికి మంత్రి నారాయణ వెన్నుదన్నుగా నిలువగా, అడ్డూరి వరలక్ష్మికి స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మద్దతిస్తున్నారు. దీంతో ఎవరికి వారు పైరవీలకు శ్రీకారం చుట్టారు. ఖర్చుకు వెనుకాడని ఆశావహులు... హాట్‌కేకులా తయారైన మేయర్ పీఠంపై ఆశావహులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఒకసారి మేయర్ కుర్చీపై కూర్చొంటే చాలని కొందరు...పదవి వచ్చాక ఖర్చు పెట్టిందంతా రాబట్టుకోవచ్చన్న ఆలోచనతో మరికొందరు ఎవరిదారిలో వారు పోటీ పడుతున్నారు. అభ్యర్థులు గెలిచేందుకు ఎంతో ఖర్చు పెట్టాం...ఇప్పుడు అందులో కొంతైనా మేయర్ పదవి బూచిగా చూపించి రాబట్టుకోవాలని రాష్ట్ర పార్టీ నేతలు భావిస్తున్నారు. ఓటుకి రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చు పెడితేనే గెలవగలిగామని, ఆ స్థాయిలో చేసిన ఖర్చులో కొంతైనా రికవరీ చేయాలని ఆలోచన చేశారు. అందులో భాగంగానే ఈ పథక రచనకు దిగారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ కోట్ల రూపాయల సీటు పందెంలో ఎవరిది పైచేయో వేచి చూడాల్సిందే....! -
ఎమ్మెల్సీ మీకు.. మేయర్ మాకు
జీవీఎంసీ మేయర్ పీఠంపై సైకిల్-కమలం పట్టు తమకే ఇవ్వాలని ఎవరికివారుగా పోటీ బరిలో దిగేందుకు బడానేతల వారసులు సిద్ధం తాజాగా టీడీపీ చేతిలో ఎమ్మెల్సీ ఆయుధం దాన్ని ప్రయోగించి బీజేపీకి చెక్ పెట్టాలని ఎత్తుగడ ఎమ్మెల్సీ వారికిచ్చి.. మేయర్ పదవి కొట్టేయాలని ఎత్తుగడ జీవీఎంసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో గానీ.. మేయర్ పీఠం విషయంలో మాత్రం ఏడాదిన్నర కాలంగా మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీల మధ్య పీటముడి పడింది.. అదిగో.. ఇదిగో.. అంటూ ఇన్నాళ్లూ ఈ ఎన్నికల విషయంలో కాలయాపన చేస్తూ వస్తున్న సర్కారు.. ఎట్టకేలకు ఎన్నికల దిశగా అడుగులు వేస్తుండటంతో మేయర్ గిరీ మాదంటే.. మాదని రెండు పార్టీల నేతలు పట్టుదలకు పోతున్నారు.. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో దీంతో బీజేపీకి చెక్ పెట్టాలని.. టీడీపీ ప్లాన్ వేస్తోంది..మాకిది.. మీకది పద్ధతిలో ఎమ్మెల్సీ పదవిని కమలానికి కట్టబెట్టి.. మేయర్ పదవిని కొట్టేయాలని చూస్తోంది. ఈ ప్రతిపాదనకు బీజేపీ పెద్దలు ఎంత వరకు ఆమోదిస్తారన్నది ప్రశ్నార్థకమే.. సాక్షి, విశాఖపట్నం: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికతో.. జీవీఎంసీ మేయర్ పీఠంపై మిత్రపక్షమైన బీజేపీతో పడిన పీటముడిని విప్పాలని టీడీపీ యత్నిస్తోంది. ఈ రెండు ఎన్నికలు దాదాపు ఒకేసారి జరిగే అవకాశాలుండడంతో అధికార పార్టీ ఈ ఎత్తు వేస్తోంది. జీవీఎంసీ ఎన్నికల విషయంలో ఇన్నాళ్లూ నాన్చుతూ వచ్చిన ప్రభుత్వం.. ఇటీవల ఆ దిశగా సన్నాహాలు చేస్తుండటంతో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. నగర ఓటర్లు మావైపే ఉన్నారు.. మేయర్ పీఠం మాకే ఇవ్వాలని బీజేపీ, కాదు అధికారంలో ఉన్న తమకే ఇవ్వాలని టీడీపీ ఏడాదిన్నరగా పట్టుబడుతున్నాయి. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని పైకి చెబుతున్నప్పటికీ ‘మేయర్ పీఠం మాదంటే మాదంటూ’ నేతలు చేస్తున్న ప్రకటనలతో రెండు పార్టీల కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. తెరపైకి పెద్దల వారసులు పీఠం ఎవరిదన్నది తేలకపోయినా ఇరు పార్టీల ముఖ్యనేతలు తమ వారసులను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె దీపావెంకట్‌ను బరిలోకి దింపాలని కొందరు బీజేపీ పెద్దలు భావిస్తుంటే, పార్టీ అవకాశం ఇస్తే తన కుమార్తెను బరిలో నిలపాలని ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఆశిస్తున్నారు. ఇక టీడీపీ విషయానికొస్తే తన కోడలైన మంత్రి నారాయణ కుమార్తెను బరిలోకి దింపాలని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు భావిస్తున్నట్టు పార్టీలో బలమైన వాదన విన్పిస్తోంది. మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ పెద్దలు ఆ పీఠం మాకిస్తే మూడోవంతు సీట్లతో సరిపెట్టుకుంటామని.. లేకుంటే చెరిసగం సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. టీడీపీ చేతిలో ఎమ్మెల్సీ ఆస్త్రం ఈ నేపథ్యంలో తెరపైకి వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను తనకు అనుకూలంగా మలచుకొని బీజేపీ డిమాండ్‌కు చెక్ పెట్టాలని టీడీపీ యోచిస్తోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంవీఎస్ శర్మ పదవీకాలం వచ్చే మార్చితో ముగియనుండటంతో కొత్త ఎమ్మెల్సీ ఎన్నికకు సన్నాహాలు మొదలయ్యాయి. ఓటర్ల నమోదుకు శ్రీకారం చుట్టడంతో పట్టభద్రుల్లోనే కాదు.. పార్టీల్లో కూడా ఎన్నికల వేడి మొదలైంది. అందివచ్చిన ఈ అవకాశాన్ని అస్త్రంగా ఉపయోగించి మేయర్ పీఠంపై గురిపెట్టాలని అధికార టీడీపీ చూస్తోంది. ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీకి కేటాయించి మేయర్ పీఠాన్ని తమకే ఉంచుకోవాలన్న ఎత్తుగడను టీడీపీ పెద్దలు తెరపైకి తీసుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావంతో పట్టభద్రుల్లో బీజేపీకి ఆదరణ ఉన్నందున ఈ స్థానాన్ని కమలం పార్టీకి కేటాయించడమే సమంజసమన్న వాదనను ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థికి తాము మద్దతు ఇచ్చి గెలిపించే బాధ్యత తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు. అందుకు ప్రతిగా జీవీఎంసీ మేయర్ పీఠం విషయంలో పట్టుపట్టవద్దని కమలనాధులను కోరుతున్నారు. అవసరమైతే డిప్యూటీ మేయర్ పదవి ఇస్తామని కూడా ఆశ చూపుతున్నారు. బీజేపీ సీనియర్ నేతలైన రామకోటయ్య, పృద్వీరాజ్లతో పాటు మరికొంతమంది పట్టభద్రుల స్థానం నుంచి బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నట్టు కన్పిస్తోంది. అయితే ఎమ్మెల్సీ కంటే మేయర్ పీఠంపైనే బీజేపీ బడా నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా ఈ పీఠం దక్కించుకోవాలని ఉన్నత స్థాయిలో పావులు కదుపుతుండటంతో ఇరుపార్టీల మధ్య వేడి పెరిగింది. బల్క్‌గా ఓటర్ల నమోదు ఎమ్మెల్సీ ఎన్నికకు బల్క్‌గా ఓటర్ల నమోదును నిషేధించినట్లు జిల్లా అధికారులు ప్రకటించినా.. సంబంధిత నిబంధనలో ‘ఎనీ ఇన్స్టిట్యూషన్ (ఏ సంస్థ తరపునైనా బల్క్‌గా ఓటర్ల నమోదుకు అవకాశం)’ అన్న క్లాజ్‌ను ఆసరా చేసుకొని పెద్ద ఎత్తున పట్టభద్రులను నమోదు చేయించేందుకు మంత్రులిరువురు పావులు కదుపుతున్నారు. మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థల ద్వారా పెద్ద ఎత్తున ఓటర్ల నమోదుకు తెరతీస్తున్నారు. దీనికి అధికారులు కూడా వంత పలుకుతూ బల్క్ ఓటర్ల నమోదుకు పచ్చజెండా ఊపుతున్నారు. -
‘దో’స్తానా.. సాగేనా?
టీఆర్ఎస్... మజ్లిస్ల మైత్రిపై సందేహాలు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీఆర్ఎస్... మిత్రపక్షమైన మజ్లిస్‌తో అధికారం పంచుకుంటుందా? లేక ఒంటరిగా ముందుకు సాగుతుందా? ప్రస్తుతం గ్రేటర్లో ప్రధాన చర్చనీయాంశమిదే. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మజ్లిస్ పార్టీని మిత్రపక్షంగా పేర్కొంటూ.. మేయర్ పీఠం విషయంలో అవసరమైతే సహకారం అందించేందుకు మజ్లిస్ ఉందని ప్రకటించిన విషయం విదితమే. ఎన్నికల్లో టీఆర్ఎస్కు పూర్తి స్థాయి మెజార్టీ దక్కడంతో మజ్లిస్ పార్టీ మద్దతు అవసరం లేకుండా పోయింది. జీహెచ్ఎంసీలో మజ్లిస్ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించినా.. మేయర్ పీఠం కోసం అవసరమయ్యే మెజార్టీ మాత్రం సాధించలేకపోయింది. ఫలితంగా ఆ సీటు విషయమై ఎటువంటి ఆలోచనలూ పార్టీలో కనిపించడం లేదు. సీఎం కేసీఆర్ స్వయంగా మజ్లిస్ తమ మిత్రపక్షమని చెప్పడంతో డిప్యూటీ మేయర్ పదవి ఆ పార్టీకి దక్కవచ్చని రాజకీయ పరిశీలకుల అంచనా. జీహెచ్ఎంసీలో పూర్తి స్థాయి మెజార్టీ దక్కించుకున్న టీఆర్ఎస్.. మజ్లిస్‌తో మైత్రిని కోరని పక్షంలో డిప్యూటీ మేయర్ పదవిని ఆ పార్టీకి ఇవ్వక పోవచ్చన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నుంచి విజయం సాధించిన మైనార్టీలకు డిప్యూటీ మేయర్ పదవి కట్టబెట్టే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పటి వరకు అధికార టీఆర్ఎస్ నుంచి మజ్లిస్ పార్టీ నేతలకు ఎలాంటి మైత్రీ సమాచారం అందకపోవడంతో అనుబంధంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల పక్షానికి మొగ్గు..? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించిన మజ్లిస్.... రాజకీయ పరిణామాలను బట్టి అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చొని...ప్రజల పక్షం వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో మెజార్టీ లేకున్నా కాంగ్రెస్‌తో అధికారాన్ని పంచుకొని మూడేళ్ల పాటు పాలన పగ్గాలు చేపట్టింది. ఈసారి టీఆర్ఎస్ ఎవరి మద్దతు లేకున్నా సొంతంగా మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. దీంతో మజ్లిస్ పార్టీతో మైత్రిఅవసరం లేకుండా పోయింది. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపికలో టీఆర్ఎస్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి తమవైఖరిని వెల్లడించాలనే యోచనలో మజ్లిస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. -
జీహెచ్ఎంసీ మేయర్ పీఠం బీసీలకే
ఎన్నికల కమిషన్‌కు స్పష్టత ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ‘బీసీ-జనరల్’ అభ్యర్థికే దక్కనుంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ అప్పటి ప్రభుత్వం 2014 మార్చి 1న జీవో నెం.94 జారీ చేసింది. అప్పట్లో జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ‘బీసీ-జనరల్’గా రిజర్వు చేశారని... ఆ ఉత్తర్వుల ప్రకారమే జీహెచ్ఎంసీ మేయర్ పదవికి పరోక్ష ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంటూ బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ లేఖ రాసింది. -
'జీహెచ్ఎంసీ మేయర్ పీఠం మాదే'
-
'జీహెచ్ఎంసీ మేయర్ పీఠం మాదే'
హైదరాబాద్: జనవరి మూడో వారంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరిగే అవకాశముందని..దీని కోసం తమ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తుందని తెలంగాణ ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లో సాక్షి మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ.... మేనిఫెస్టోపై కసరత్తు పూర్తి చేశామని సీఎం కేసీఆర్ అనుమతితో త్వరలో వెల్లడిస్తామన్నారు. ఎన్నికల్లో సెటిలర్లు టీఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తారన్న నమ్మకం తమకు ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రేటర్ పరిధిలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. గెట్ అవుట్-లెట్ ఓట్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో నగర ప్రముఖులు, క్రీడాకారులతో ప్రచారం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల సమయంలో నోటీసులు సర్వసాధారణమని ఈసీ సందేహాలకు సమాధానమిస్తామని కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఐదు సర్వేలు నిర్వహించామని... సర్వేలన్నింటిలో తమ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని వెల్లడైందని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి... మేయర్ పీఠం దక్కించుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.