‘దో’స్తానా.. సాగేనా?
టీఆర్‌ఎస్... మజ్లిస్‌ల మైత్రిపై సందేహాలు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీఆర్‌ఎస్... మిత్రపక్షమైన మజ్లిస్‌తో అధికారం పంచుకుంటుందా? లేక ఒంటరిగా ముందుకు సాగుతుందా? ప్రస్తుతం గ్రేటర్‌లో ప్రధాన చర్చనీయాంశమిదే. ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మజ్లిస్ పార్టీని మిత్రపక్షంగా పేర్కొంటూ.. మేయర్ పీఠం విషయంలో అవసరమైతే సహకారం అందించేందుకు మజ్లిస్ ఉందని ప్రకటించిన విషయం విదితమే.
ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పూర్తి స్థాయి మెజార్టీ దక్కడంతో మజ్లిస్ పార్టీ మద్దతు అవసరం లేకుండా పోయింది. జీహెచ్‌ఎంసీలో మజ్లిస్ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించినా.. మేయర్ పీఠం కోసం అవసరమయ్యే మెజార్టీ మాత్రం సాధించలేకపోయింది. ఫలితంగా ఆ సీటు విషయమై ఎటువంటి ఆలోచనలూ పార్టీలో కనిపించడం లేదు. సీఎం కేసీఆర్ స్వయంగా మజ్లిస్ తమ మిత్రపక్షమని చెప్పడంతో డిప్యూటీ మేయర్ పదవి ఆ పార్టీకి దక్కవచ్చని రాజకీయ పరిశీలకుల అంచనా.
జీహెచ్‌ఎంసీలో పూర్తి స్థాయి మెజార్టీ దక్కించుకున్న టీఆర్‌ఎస్.. మజ్లిస్‌తో మైత్రిని కోరని పక్షంలో డిప్యూటీ మేయర్ పదవిని ఆ పార్టీకి ఇవ్వక పోవచ్చన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నుంచి విజయం సాధించిన మైనార్టీలకు డిప్యూటీ మేయర్ పదవి కట్టబెట్టే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పటి వరకు అధికార టీఆర్‌ఎస్ నుంచి మజ్లిస్ పార్టీ నేతలకు ఎలాంటి మైత్రీ సమాచారం అందకపోవడంతో అనుబంధంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల పక్షానికి మొగ్గు..?
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించిన మజ్లిస్.... రాజకీయ పరిణామాలను బట్టి అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చొని...ప్రజల పక్షం వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో మెజార్టీ లేకున్నా కాంగ్రెస్‌తో అధికారాన్ని పంచుకొని మూడేళ్ల పాటు పాలన పగ్గాలు చేపట్టింది. ఈసారి టీఆర్‌ఎస్ ఎవరి మద్దతు లేకున్నా సొంతంగా మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. దీంతో మజ్లిస్ పార్టీతో మైత్రిఅవసరం లేకుండా పోయింది. మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎంపికలో టీఆర్‌ఎస్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి తమవైఖరిని వెల్లడించాలనే యోచనలో మజ్లిస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.