
'జీహెచ్ఎంసీ మేయర్ పీఠం మాదే'
హైదరాబాద్: జనవరి మూడో వారంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరిగే అవకాశముందని..దీని కోసం తమ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తుందని తెలంగాణ ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్లో సాక్షి మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ.... మేనిఫెస్టోపై కసరత్తు పూర్తి చేశామని సీఎం కేసీఆర్ అనుమతితో త్వరలో వెల్లడిస్తామన్నారు.
ఎన్నికల్లో సెటిలర్లు టీఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తారన్న నమ్మకం తమకు ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రేటర్ పరిధిలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. గెట్ అవుట్-లెట్ ఓట్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో నగర ప్రముఖులు, క్రీడాకారులతో ప్రచారం నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
ఎన్నికల సమయంలో నోటీసులు సర్వసాధారణమని ఈసీ సందేహాలకు సమాధానమిస్తామని కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఐదు సర్వేలు నిర్వహించామని... సర్వేలన్నింటిలో తమ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని వెల్లడైందని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి... మేయర్ పీఠం దక్కించుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.