ఎల్‌ఎన్ పేట పరిసరాల్లోని ఓ రైస్‌మిల్లు... ఇటీవల పౌరసరఫరాల శాఖలో తనిఖీల బృందం అక్కడికి వెళ్లింది! ముమ్మరంగా సోదాలు చేసింది! రూ.54 లక్షల విలువైన ధాన్యం, బియ్యం అక్రమంగా నిల్వ ఉన్నట్లు కనుగొన్నారు! ఆ సరుకును సీజ్ కూడా చేశారు! సహజంగా ఇలాంటి వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి బాధ్యులపై కేసు నమోదు చేయాలి. అక్రమం ఎంతో తేల్చిన సరుకును ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి!! కానీ కేవలం రూ.22 వేలు బ్యాంకు గ్యారెంటీతో ఆ మొత్తం సరుకును విడుదల చేయించడానికి పౌరసరపరాల శాఖలో ఓ ఉన్నతాధికారి బాధ్యత తీసుకున్నారు! ఓ ఫైల్ తయారు చేసి జిల్లా కలెక్టరు పరిశీలనకు పంపించారు! ఈ గూడుపుఠాణిని గ్రహించిన ఆయన సంబంధిత అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ఆ ఫైల్‌నుఆమోదించాలని కలెక్టరుపై జిల్లాకు చెందిన మంత్రితో పాటు గుంటూరుకు చెందిన మరో మంత్రి నుంచి ఒత్తిళ్లు తెచ్చారంటే ఈ అక్రమ వ్యవహారం ఏ స్థాయికి వెళ్లిందో ఊహించవచ్చు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. ఖరీఫ్‌లో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనేది జిల్లా యంత్రాంగం లక్ష్యం. దీనికోసం 130 ధాన్యం కొనుగోలు కేంద్రాల (పీపీసీల)ను ప్రారంభించారు. ఈ పీపీసీలను స్థానిక రైస్‌మిల్లులతో అనుసంధానం చేశారు. కానీ కొనుగోలు ప్రక్రియనుసకాలంలోనే ప్రారంభించినప్పటికీ ఆశించిన స్థాయిలో జరగలేదు. అయితే కొంతమంది రైస్‌మిల్లర్లు నేరుగా కొనుగోలు చేసుకొచ్చి అక్రమంగా నిల్వలు ఉంచుకున్నారనేది బహిరంగ రహస్యం. ఏదోలా వ్యాపారం నడవాలనే ఉద్దేశంతో కొంతమంది రైస్‌మిల్లర్లు లోపాలకు ఆస్కారం ఇస్తున్నారు. ఇదే పౌరసరఫరాల శాఖలో ఆ ఉన్నతాధికారికి వరంగా మారింది.
ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలోని 307 రైస్‌మిల్లులకు ధాన్యం కొనుగోలు (ప్రొక్యూర్‌మెంట్), మిల్లింగ్‌కు అనుమతులు ఇచ్చారు. ఈ మేరకు వారికి సీఎంఆర్ ధాన్యం సరఫరా చేశారు. అయితే గడిచిన సంవత్సరం నుంచి సీఎంఆర్ పెండింగ్‌లో ఉంచిన 10 రైస్‌మిల్లులపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇదిలా ఉండగా ప్రస్తుత సీజన్‌లోనూ సీఎంఆర్ డెలివరీ 20 శాతం కంటే తక్కువగా మిల్లింగ్ చేసిన రైస్‌మిల్లులు 30 వరకూ ఉన్నాయని తేలింది. ఇలాంటి నిల్వలు ఉంచిన రైస్‌మిల్లులపై దాడులు చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఇదే అవకాశంగా తీసుకున్న పౌరసరఫరాల శాఖలోని సదరు ఉన్నతాధికారి తన అనుయాయులతో మంత్రాంగం రచించారు.
లోపాలే ఆయన ఆయుధం...
రైస్‌మిల్లుల్లో అక్రమాలు వెలుగులోకి తెచ్చేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు డిప్యూటీ తహశీల్దారు కేడరు వారితో ఇటీవల రెండు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. వారు మిల్లుల్లో తనిఖీలు చేసి, నిల్వల సమాచారం ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేయాలి. ధాన్యం, బియ్యం నిల్వల్లో వ్యత్యాసాలు ఉంటే కేసులు నమోదు చేయాలి. అయితే ఇటీవల కాలంలో రైస్‌మిల్లర్లపై ఈ దాడులు జరుగుతున్నాయి. కానీ కేసులు మాత్రం ఆ స్థాయిలో లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైస్‌మిల్లర్ల నుంచి మామూళ్లకు ఆశపడి నిబంధనలకు నీళ్లొదులుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ వ్యవహారంలో డిప్యూటీ తహసీల్దారు స్థాయి అధికారులు ఇద్దరితో పాటు జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఒకరు కీలక పాత్ర పోషిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సుమారు 20 మిల్లుల్లో తనిఖీలు నిర్వహించినా పూర్తిస్థాయిలో ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడానికి మామూళ్ల వ్యవహారమేననే ఆరోపణలు వస్తున్నాయి.
ఆ తనిఖీలేమయ్యాయో...
సరుబుజ్జిలి, పక్కివలస, నరసన్నపేట పరిసర ప్రాంతాల్లోని రైస్‌మిల్లుల్లో ఇటీవల పౌరసరఫరాల శాఖ తనిఖీ బృందాలు సోదాలు నిర్వహించాయి. కొన్ని మిల్లుల్లో ధాన్యం, బియ్యం నిల్వల్లో భారీగా వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. ఆయా మిల్లులపై కేసు నమోదుకు సిఫారసు కూడా ఆ బృందాలు చేశాయి. కానీ ఆ ఉన్నతాధికారి అనుయాయుడైన డిప్యూటీ తహశీల్దారు మంతనాలు చేసి కేసులు లేకుండా మాఫీ చేశారని తెలిసింది.
గత నెల 15వ తేదీ నుంచి రెండ్రోజుల పాటు పౌరసరఫరాల శాఖ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం వజ్రపుకొత్తూరు, నందిగాం మండలాల్లోని పలు రైస్‌మిల్లుల్లో తనిఖీ చేసింది. కొన్ని మిల్లులపై కేసులు నమోదు చేయాలని పౌరసరఫరాల శాఖకు సిఫారసు కూడా చేశారు. కానీ ఇప్పటివరకూ కేసులు పెట్టిన దాఖలాలు లేవు.
వస్తు రూపంలోనూ మామూళ్లు...
పౌరసరఫరాల శాఖలో సదరు ఉన్నతాధికారి ఒత్తిళ్లకు తట్టుకోలేపోతున్నామని కొంతమంది రైస్‌మిల్లర్లు గగ్గోలు పెడుతున్నారు. వారే గాకుండా వస్తురూపంలో మామూళ్లు సమర్పించుకోలేక దిగువస్థాయి ఉద్యోగులు కూడా ఒత్తిడికి గురవుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కానుకల కోసం జీతంలో కొంత ఇచ్చేస్తే తాము ఎలా బతకాలని డీటీ స్థాయి ఉద్యోగి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారంటే అవినీతి స్థాయిని ఊహించవచ్చు. పాలకొండ డివిజన్‌కు చెందిన ఓ డీటీ సదరు ఉన్నతాధికారికి ఒక పెద్ద మంచం ఇటీవలే సమర్పించుకున్నారు. దివాన్ కాట్ కూడా తయారుచేయిస్తున్నారని తెలిసింది. అలాగే శ్రీకాకుళం డివిజన్‌కు చెందిన ఓ డీటీ ప్రతి నెలా ఎక్కడో నివాసం ఉంటున్న సదరు ఉన్నతాధికారి కుటుంబానికి బియ్యం పంపిస్తూనే ఉన్నారట. కొంతమంది రైస్‌మిల్లర్లు పెద్ద ప్లాస్మా టీ వీ, సోఫాసెట్, కుర్చీలు ఇటీవలే కానుకగా సమర్పించుకున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా జిల్లా కార్యాలయంలోని ఓ అధికారిని రూ.10 వేలు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి ఇచ్చి పంపించాలంటూ ఒత్తిడి తెచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment