దర్శి: కాలేజీకి వెళ్లకుండా..నేరుగా పరీక్ష రాసి బీఈడీ సర్టిఫికెట్ తీసుకోవాలనుకుంటున్నారా..అయితే దర్శికి రండి. ఇక్కడి బీఈడీ కాలేజీల్లో వారు అడిగినంత కాసులు ముట్టజెబితే చాలు క్లాసుల మొఖం చూడకపోయినా..పరీక్ష రాసేందుకు వస్తేచాలు దగ్గరుండి మరీ కాపీలు రాయించి పాస్ చేయించేస్తారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులే ఎక్కువగా ఈ తరహా కాలేజీల్లో చదువుకుని సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు.
ఇందుకోసం ఒక్కో విద్యార్థి వద్ద సీటుకు రూ.60 వేల చొప్పున తీసుకుని, పరీక్ష సమయంలో అవసరమైతే ఇతరులు రాయడం, లేదంటే జవాబులు దగ్గరుండి చెప్తారని చెప్పి దీనికి అదనంగా మరో రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. నాలుగు రోజులుగా దర్శిలోని మూడు సెంటర్లలో బీఈడీ పరీక్షలు రాస్తున్న 1093 మంది విద్యార్థుల్లో 95 శాతం ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే ఉండటం గమనార్హం.
ఈ బీఈడీ పరీక్షల్లో జిల్లా మొత్తం ఇప్పటి వరకు 30 మంది బుక్ అవగా..ఒక్క దర్శిలోని గత శుక్రవారం 14 మంది, సోమవారం ఒకరు బుక్ అయ్యారు. భారీ స్థాయిలో మాస్ కాపీయింగ్, పరీక్ష పేపర్లను మార్చటం జరుగుతున్నా ఇన్విజిలేటర్లు, స్క్వాడ్‌లు నామమాత్రపు తనిఖీలు చేసి కొందరు విద్యార్థులను బుక్‌చేసి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా...
డిగ్రీ పూర్తి చేసి బీఈడీ ఎంట్రన్స్ రాసిన వారికి వచ్చిన ర్యాంకుల ప్రకారం సీట్లను కేటాయించాలి. సరైన పద్ధతిలో సీట్లను ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు సీట్లను అధిక మొత్తాలకు మేనేజ్‌మెంట్ కోటాలో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతిసీటు ఆన్‌లైన్‌లో ప్రభుత్వ పరిశీలనలో ఉన్నా గుడ్లప్పగించి చూస్తున్నారే గానీ ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. ఒక వేళ బీఈడీ ఎంట్రన్స్ రాసి మెరిట్ సాధించిన విద్యార్థులు సీట్లు అడిగితే ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తుండటంతో వారు బీఈడీ బదులు ఇతర కోర్సుల వైపు మొగ్గుచూపుతున్నారు.
ఒక్క దర్శి పట్టణంలోనే ఏటా 1500 మంది విద్యార్థులకు పైగా డిగ్రీ విద్యను పూర్తి చేసి బీఈడీ ఎంట్రన్స్ రాస్తున్నారు. దర్శిలోని 5 బీఈడీ కాలేజీల్లో ఒక్కో కాలేజీకి 100 వంతున 500 సీట్లున్నాయి. వీటిలో 450కిపైగా సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తూ..50 లోపు మాత్రమే తెలుగు విద్యార్థులకు ఇస్తున్నారు. పొదిలిలో ఉన్న బీఈడీ పరీక్ష సెంటర్లను సైతం తీసివేయించి అక్కడి విద్యార్థులకు కూడా దర్శి సెంటర్లలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వారు కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే కావడం గమనార్హం.
ఈ విషయమై నాగార్జున యూనివర్శిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేటర్ (సీఈ) సత్యనారాయణను వివరణ కోరగా...బీఈడీ పరీక్షల్లో కాపీయింగ్‌ను నిరోధించేందుకు స్పెషల్ స్క్వాడ్ రెండు టీమ్‌లను వేశామని, అబ్జర్వర్లను కూడా గట్టిగా హెచ్చరిస్తున్నామని చెప్పారు. మళ్లీ స్పెషల్ స్క్వాడ్ ను పంపిస్తామని, పరీక్షలలో అవకతవకలు, కాపీలు జరగకుండా గట్టిగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బీఈడీ.. గారడీ
Published Thu, Aug 28 2014 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM
Advertisement
Advertisement