సాక్షి, ప్రకాశం జిల్లా: దర్శి సమీపంలోని ఘోర ప్రమాదం జరిగింది. ఎన్ఎస్పీ కాలువలోకి ఆర్టీసీ ఇంద్ర బస్సు దూసుకుపోవడంతో ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 30 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో అబ్దుల్ అజీస్(65), జానీబేగం(65), అబ్దుల్ హనీ(60), నూర్జహాన్(58), షేక్ రమీజ్(48), షబీనా(35), షేక్ హీనా(6) మృతిచెందారు. బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వివాహ రిసెప్షన్ కోసం కాకినాడ వెళ్లేందుకు పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకున్నారు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 నుంచి 40మంది వరకు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు ఆస్పత్రికి తరలించారు. బస్సు తలకిందులుగా పడటంతో ఒకరిపై ఒకరు పడి ఊపిరాడక 7 మంది మృతి చెందారు. దర్శి డిఎస్పీ అశోక్ వర్ధన్, సీఐ రామకోటయ్య ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ఘటన జరిగినట్లుగా అనుమానిస్తున్నారు.
బస్సు ప్రమాద ఘటనాస్థలిని ఎస్పీ మలిక గర్గ్ పరిశీలించారు. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి ప్రమాదం చోటుచేసుకుందని ఎస్పీ తెలిపారు. రాత్రి ఒంటి గంట సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment