
ప్రజారోగ్యశాఖకు అవినీతి జబ్బు
- కార్యాలయాలకే పరిమితమవుతున్న పీహెచ్ వర్కర్లు
- డబ్బు ముట్టే చోటికే మేస్త్రుల బదిలీలు
- క్యాష్ ఇస్తే దేనికైనా రెడీ
- కుంటుపడుతున్న నగర పారిశుధ్యం
విజయవాడ సెంట్రల్ : ప్రజారోగ్యశాఖకు అవినీతి జబ్బు చేసింది. కాసులిస్తే చాలు.. కావాల్సిన పోస్టింగ్ వచ్చి ఒళ్లో వాలుతుంది. పీహెచ్ వర్కర్‌గా నియామకం పొంది రోడ్లు ఊడ్చేందుకు ఇష్టపడని వారు టైపిస్టులుగా, స్కూళ్లలో వాచ్‌మెన్లుగా పనిచేసుకోవచ్చు. ఇక శానిటరీ మేస్త్రులైతే డబ్బు బాగా వచ్చే ప్రాంతానికి బదిలీ చేయించుకోవచ్చు. ఇందుకు చేయాల్సిందల్లా అధికారుల చేయి తడపడమే. అడిగినంత ముట్టజెబితే చాలు డెప్యూటేషన్ ముసుగులో పీహెచ్ (పబ్లిక్ హెల్త్) వర్కర్లు కార్యాలయానికే పరిమితమైనా పట్టించుకునే వారుండరు.
కార్పొరేషన్‌లోని ప్రజారోగ్య శాఖ అవినీతి కథ ఇదంతా. ఇలాంటి వాటిని అరికట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ విజిటింగ్ ఆఫీసర్లలా వచ్చిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కమిషనర్ జి.వీరపాండియన్ కలగజేసుకుంటే కానీ పరిస్థితి మారదని కొందరు అధికారులే పేర్కొంటున్నారు.
అంతులేని అవినీతి
ప్రతినెలా నాలుగున్నర కోట్లు జీతాల రూపంలో అందిస్తున్నా నగరంలో మెరుగైన పారిశుధ్యం అందించలేని పరిస్థితి. ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించాల్సిన అధికారులు అవినీతికి దాసోహం అంటున్నారు. దీంతో కిందిస్థాయి ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నగరపాలక సంస్థలో 44 శానిటరీ డివిజన్లు ఉండగా, 102 మంది మేస్త్రులు పనిచేస్తున్నారు. దండిగా ఆదాయం వచ్చే డివిజన్లలో ఇద్దరు, ముగ్గురు మేస్త్రులు పనిచేయడంతో 12 డివిజన్లు మేస్త్రులు లేక ఖాళీగా ఉన్నాయి. గత డిసెంబర్‌లో లాటరీ పద్ధతిలో మేస్త్రుల్ని బదిలీ చేశారు. ఈ లాటరీని కూడా కొందరు అధికారులు క్యాష్ చేసుకున్నారు. కాసులిస్తే కావాల్సిన చోట అనధికారికంగా పోస్టింగ్ ఇస్తామని ఆఫర్ ప్రకటించారు. దీంతో నెలరోజులు కూడా తిరక్కుండానే కొందరు తమకు కావాల్సిన డివిజన్లలో అనధికారికంగా పోస్టింగ్ పొందారు
మచ్చుకు కొన్ని...
7, 5 డివిజన్లలో పనిచేయాల్సిన రాజేంద్రప్రసాద్, శివప్రసాద్ వాటర్‌వర్క్స్ ఏఈ, సర్కిల్-3 నైట్ శానిటేషన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నాగ మారుతి అనే మహిళకు 18వ డివిజన్ మేస్త్రిగా పోస్టింగ్ ఇస్తే.. ఆమె ఏఎంహెచ్‌వో-3 వద్ద సబర్డినేట్‌గా పనిచేస్తున్నారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. నిశితంగా పరిశీలిస్తే మరిన్ని అక్రమ బదిలీలు వెలుగుచూసే అవకాశం ఉంది.
ముడుపుల బాగోతం
అనధికార బదిలీలకు సంబంధించి అధికారులకు రూ.10వేల నుంచి రూ.20 వేల వరకు ముడుపులు ముట్టాయనే ఆరోపణలు ఉన్నాయి. పీహెచ్ వర్కర్లను క్షేత్రస్థాయిలోనే పనిచేయించాలని కమిషనర్‌గా హరికిరణ్ ఉన్న సమయంలో మేయర్ కోనేరు శ్రీధర్ సూచించారు. దీనిపై ఫైల్ తయారు చేయించాల్సిందిగా సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. కమిషనర్ మారడంతో ఆ ఫైల్‌ను పక్కన పడేశారు. హెల్త్ సెక్షన్‌లో టైపిస్ట్‌లుగా, స్కూళ్లలో వాచ్‌మెన్లుగా, అర్బన్ హెల్త్ సెంటర్లలో డెప్యూటేషన్లపై సుమారు 200 మంది విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. ఫలితంగా నగర పారిశుధ్యం మరుగున పడుతోంది.
విచారణ చేపడతా..
అనధికారిక బదిలీల విషయం నా దృష్టికి రాలేదు. లాటరీలో వచ్చిన ప్రకారమే మేస్త్రులు డివిజన్లలో పనిచేయాలి. ఇందుకు విరుద్ధంగా పనిచేస్తామంటే కుదరదు. దీనిపై సమగ్ర విచారణ చేపడతా. అక్రమాలను ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకుంటాం.
- ఎం.గోపీనాయక్,
చీఫ్ మెడికల్ ఆఫీసర్