పైసా వసూల్‌ | Corruption In meeseva Centres Applications Visakhapatnam | Sakshi
Sakshi News home page

పైసా వసూల్‌

Published Tue, Nov 27 2018 12:50 PM | Last Updated on Thu, Jan 3 2019 12:14 PM

Corruption In meeseva Centres Applications Visakhapatnam - Sakshi

అర్హతే ప్రమాణంగా.. ఎలాంటి సిఫార్సులు లేకుండా మంజూరు చేయాల్సిన మీ సేవ కేంద్రాలను అధికార టీడీపీ నేతలుపప్పుబెల్లాల్లా పంచుకుంటున్నారు. ఇష్టానుసారంగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకప్రాంతంలో ఏర్పాటు చేయాల్సినవి మరో చోటకు తరలించిలక్షలు దండుకుంటున్నారు. ఒక్కో కేంద్రానికి రూ.2 లక్షలకు పైగానే అమ్ముకుంటున్నట్టుగా తెలుస్తోంది. అర్బన్‌ ప్రాంతాల్లో అయితే ఇది ఇంకా ఎక్కువగానే ఉంది. ఇప్పటికే 30 నుంచి 40 శాతం మీ సేవ కేంద్రాలు మంజూరైన వారు కాకుండా వేరే వారునిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

సాక్షి, విశాఖపట్నం:  పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజీవ్‌ ఇంటర్నెట్‌ విలేజ్‌ సెంటర్స్‌కు ప్రారంభించారు. రాష్ట్రంలో మొదటిసారిగా విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వేంపాడులో 2006లో ఈ పథకానికి ఆ మహానేత శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఈ సెంటర్స్‌ను ఈ సేవా సెంటర్స్‌గా మార్చగా, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సేవా సెంటర్లుగా మార్పు చేసింది. తొలుత పట్టణ, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను ఆ తర్వాత దశల వారీగా పెంచుకుంటూ వచ్చారు. ప్రస్తుతం జీవీఎంసీతో పాటు గ్రామీణ విశాఖ జిల్లాలో ప్రస్తుతం 970 మీసేవా కేంద్రాలున్నాయి. వీటిలో 320 కేంద్రాలు జీవీఎంసీ పరిధిలో ఉండగా.. మండల కేంద్రాలతో సహా 605 పంచాయతీల్లో మీ సేవా కేంద్రాలున్నాయి. 32 డిపార్టుమెంట్లకు చెందిన 320 పౌర సేవలను నిర్ణీత యూజర్‌ చార్జీలతో ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. 

డిగ్రీ అర్హత గల నిరుద్యోగ యువతకు ఈ మీ సేవా కేంద్రాలను ఎలాంటి సిఫార్సుల్లేకుండా మంజూరుచేయాల్సి ఉన్నప్పటికీ అధికార టీడీపీ నేతలు గడిచిన నాలుగేళ్లుగా ఈ కేంద్రాల మంజూరు పేరిట లక్షలు దండుకున్నారు. ప్రజాప్రతినిధుల సిఫార్సు తప్పనిసరి చేయడంతో అధికార టీడీపీ నేతలు మీ సేవా కంద్రాలను పప్పుబెల్లాల్లా పంచుకోవడమే కాదు తమ కార్యకర్తలు ఇష్టానుసారంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఇలా గడిచిన మూడేళ్లలో కొత్తగా 300కు పైగా మీసేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు టెక్నికల్‌ సపోర్టు ఇచ్చేందుకు జీవీఎంసీ పరిధిలో ఏపీ ఆన్‌లైన్‌ సర్వీస్, రామ్‌ఇన్‌ఫ్రా కంపెనీలకు అప్పగించగా, గ్రామీణ ప్రాంతాల్లో సీఎంఎస్‌ కంప్యూటర్స్‌ సంస్థకు అప్పగించారు. ఈ మూడు ఏజెన్సీల పరిధిలోనే మీసేవా కేంద్రాలు సేవలందిస్తుంటాయి.

నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు
ఒక పంచాయతీకి మంజూరైన కేంద్రాన్ని మరో పంచాయతీకి, మారుమూల పల్లె వాసులకోసం ఏర్పాటు చేసిన కేంద్రాలను మండల కేంద్రాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన దాఖలాలు జిల్లాలో ఎక్కువగానే ఉన్నాయి. ఇలా ఒకచోట మంజూరై మరో చోట ఏర్పాటైనట్టుగా ఫిర్యాదులందినా ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల మేరకు అధికారులు కూడా వాటి జోలికి వెళ్లే సాహసం చేయలేక పోతున్నారు. పేరు మార్చే అవకాశం లేకున్నప్పటికీ అనధికారికంగా చేతులు మారి పోతున్నాయి. ఈ విధంగా కనీసం 20 శాతం మీ సేవా కేంద్రాలు చేతులు మారిపోయినట్టుగా చెబుతున్నారు. ఒక్కో కేంద్రానికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అమ్ముకుంటున్నట్టుగా తెలుస్తోంది. అర్బన్‌ ప్రాంతాల్లో అయితే ఇంకా ఎక్కువగానే అమ్మడుపోతున్నారు. ఇప్పటికే 30 నుంచి 40 శాతం మీ సేవా కేంద్రాలు మంజూరైన వారు కాకుండా వేరే వారు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

మరో 106 మీ సేవా కేంద్రాలకు నోటిఫికేషన్‌
జిల్లాలో ఇంకా 320 పంచాయతీల్లో మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కొన్ని మారుమూల పంచాయతీల్లో కేంద్రాల ఏర్పాటుకు ఎవరు ముందుకురాకపోవడంతో కేంద్రాలు లేని పంచాయతీలను 106  క్లస్టర్స్‌గా విభజించారు. నిర్వాహకుల నియామకం కోసం అర్హులైన నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. డిసెంబర్‌ 10వ తేదీలోగా జిల్లా వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.విశాఖపట్నం.ఎన్‌ఐసీ.ఇన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి ఆ క్లస్టర్‌ పరిధిలోని పంచాయతీల్లో నివాసముంటూ కనీస కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఎంపిక ప్రతిభ, ప్రాధాన్యత, విద్యార్హత ఆధారంగా నిర్ణయిస్తారు. దరఖాస్తుదారులు దరఖాస్తుతో పాటు విద్యార్హత, వయస్సు, నివాస ధృవపత్రాలు, ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో జత చేయాలి. దరఖాస్తుదారులు గతంలో మీ సేవా, మీకోసం ప్రజావాణి, కలెక్టర్‌ కార్యాలయంలో నేరుగా సమర్పించిన అభ్యర్థులు కూడా తప్పనిసరిగా ఆన్‌లైన్‌ ద్వారా పైన పేర్కొన్న వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని మీ సేవా జిల్లా మేనేజర్‌ అశోక్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఏ ఏ కేంద్రాల్లో మీ సేవా కేంద్రాలు మంజూరయ్యాయో వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్టు పేర్కొన్నారు.

గుర్తించి చర్యలు తీసుకుంటాం
చేతులు మారిన మీసేవా కేంద్రాలు, ఒక చోట మంజూరై మరో చోట ఏర్పాటైన కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటువంటి వాటిని గుర్తించి రద్దు చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జి.సృజన ఆదేశించారు. జేసీ ఆదేశాల మేరకు వారం రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా మీ సేవా కేంద్రాలను నిర్వహించే సీఎంఎస్, ఏపీ ఆన్‌లైన్, రామ్‌ ఇన్‌ఫ్రా సంస్థలను లిఖితపూర్వకంగా కోరాం. వారి నుంచి జాబితాలు రాగానే జేసీకి నివేదించి తదుపరి చర్యలు తీసుకుంటాం.–అశోక్‌కుమార్, జిల్లా మేనేజర్,మీ సేవా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement