కాకినాడ : ‘చచ్చినా వదలం’ అన్న ధోరణిలో మృతి చెందిన పింఛన్ లబ్ధిదారుల వేలిముద్రలూ వేసేసి సొమ్ము కైంకర్యం చేస్తున్న దళారులకు ‘ట్యాబ్’ల ద్వారా అధికారులు చెక్ పెట్టనున్నారు. పింఛన్ లబ్ధిదారుల వేలిముద్రలను ఆధార్‌తో అనుసంధానం చేసి నిర్ధారణ అయ్యాకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ఇంతకాలం పెద్ద మొత్తంలో పింఛన్లు కైంకర్యం చేస్తున్న అక్రమార్కులు ఆందోళనలో ఉన్నారు. జిల్లాలోని 4 లక్షల 71వేల 588 మంది పింఛన్ లబ్ధిదారులకు ప్రతినెలా రూ.50కోట్ల పింఛన్లు నేరుగా పంపిణీ చేస్తున్నారు.
దీంతో కొన్నిచోట్ల సిబ్బంది, దళారులు, ఇటీవల కొత్తగా ఏర్పాటైన జన్మభూమి కమిటీలు కుమ్మక్కై పెద్దమొత్తంలో పింఛన్లు స్వాహా చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ట్యాబ్‌ల ద్వారా పింఛన్ల పంపిణీకి అధికారులు రంగం సిద్ధం చేశారు. దీనివల్ల అక్రమాలకు చెక్‌పడే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలోని నగరపాలక, పురపాలక సంఘల్లో ఒక్కోవార్డుకు ఒక్కో ట్యాబ్‌ను సమకూరుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకూ వీటిని అందిస్తున్నారు. 750 జనాభా దాటిన గ్రామాలకు అదనపు ట్యాబ్‌లు సమకూరుస్తున్నారు. ఇలా మొత్తంగా జిల్లాకు 1526 ట్యాబ్‌లు చేరుకున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా వీటిని ఆయా పంపిణీ కేంద్రాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ట్యాబ్‌లకు ఏపీ ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ ద్వారా ద్వారా ఆధార్ అనుసందానం, ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. అవి ఆధార్‌తో సరిపోల్చుకున్నాకే పింఛన్ అందిస్తారు.
పింఛన్ల అవినీతి జబ్బుకు ‘ట్యాబ్’లెట్!
Published Fri, Aug 28 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM
Advertisement
Advertisement