శ్రీముఖలింగం ప్రధాన ఆలయం
శ్రీకాకుళం, జలుమూరు: జిల్లాలో అతిపురాతన ఆలయాల్లో ప్రముఖమైనవి శ్రీకూర్మం, అరసవల్లి, శ్రీముఖలింగం క్షేత్రాలు. వీటిలో అరసవల్లి ఆదాయంలో ఎప్పుడూ అగ్రశ్రేణిలో నిలుస్తోంది. శ్రీకూర్మం కాసింత ఆపసోపాలు పడుతున్నా పాస్ మార్కులు వేయించుకుంటోంది. కానీ ముఖలింగేశ్వరునికి మాత్రం లక్ష్మీ కటాక్షం కలగడం లేదు. ఆదాయానికి అన్ని అర్హతలు, అవకాశాలు ఉన్నా మధుకేశ్వరుని చెంత ధనం నిలవడం లేదు. దక్షిణ కాశీగా కీర్తించే ముఖలింగేశ్వరాలయంలో ఏటా మూడు లక్షల మంది స్వామిని దర్శించుకుంటారని అధికారుల అంచనా. ఎంతో విశిష్టత ఉన్న ఈ ఆలయం ఆదాయంలో మాత్రం ఏటా వెనుకబడిపోతోంది. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తూ ఇక్కడి శిల్ప సంపద చూసి తరిస్తుంటారు. కాసిన్ని సదుపాయాలు పెంచితే ప్రముఖ పర్యాటక స్థలంగా దీన్ని మార్చేయవచ్చు. కానీ ఏళ్ల పాటు నిరీక్షణ తప్ప పనులు మాత్రం ఇక్కడ జరగడం లేదు.
ఆదాయానికి తూట్లు
జిల్లాలో ప్రసిద్ధ దేవాలయాలైన అరసవెల్లికి ఏటా ఆదాయం రూ.ఐదున్నర కోట్లు, శ్రీకూర్మం దేవాలయానికిరూ.75 లక్షలు, పాలకొండ కోటదుర్గమ్మ ఆలయ ఆదాయం రూ. 50 లక్షల వరకు వస్తుంది. కానీ శ్రీముఖలింగంలో మాత్రం రూ.29 లక్షలకు దాటకపోవడంపై భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నిర్వహణ, అర్చకుల తీరుపై గత ఏడాది రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయడు సైతం బహిరంగ సభలో అన్న మాటలు నిజమే అనిపిస్తున్నాయి. గుడి ఎంతో పవిత్రమైనది కానీ మీ అర్చకులను చూసి భక్తులు భయపడుతున్నారని తీవ్రంగా విమర్శించారు.
అవకాశాలు ఉన్నా..
శ్రీముఖలింగం ఆదాయం పెంపునకు అవకాశాలు చాలా వరకూ ఉన్నా దేవాదాయ శాఖ అధికారులు మాత్రం కనీసం చొరవ చూపడం లేదన్న అపవాదు మూటగట్టుకుంటున్నారు. అరసవల్లి 6ఏ ఆలయం మినహాయించి జిల్లాలోగల శ్రీకూర్మం, పాలకొండ కోటదుర్గమ్మ, రావివలస తదితర ఆలయాల్లో ఆదాయం గణనీయంగా వస్తోంది. ఇక్కడ మాత్రం ప్రత్యేక టిక్కెట్లు లేకపోవడంతో ఆదాయ మార్గాలు మూసుకుపోతున్నాయని భక్తులు విమర్శిస్తున్నారు. అలాగే ప్రత్యేక దర్శనం టికెట్లతోపాటు క్యూలైన్లు కూడా కార్తీక మాసం మొత్తం లేకపోవడంతో భక్తులు ఎక్కువ సేపు ఉండలేక సాధారణ క్యూలైన్ల ద్వారా వచ్చి వెళ్లిపోతున్నారు. వీరికి కూడా ప్రత్యేక మార్గం ఉంటే కానుకలు అర్చకుల ప్లేట్లలో కాకుండా హుండీలో పడతాయని స్థానికులు అంటున్నారు.
ఏడు రోజులే..
శ్రీముఖలింగంలో కార్తీక మాసం నాలుగు సోమవారాలు, శివరాత్రి సమయాల్లో నాలుగు రోజులు కలిపి ఏడు రోజులు మాత్రమే ప్రత్యేక దర్శన టికెట్లు విక్రయిస్తారు. మిగిలిన అమ్మవారి దసరా ఉత్సవాలు, సంక్రాంతి, స్వామివారి కల్యాణం సమయంలో కూడా టికెట్లు పెడితే ఆదాయం వస్తుందని కొందరి అభిప్రాయం.
కానరాని అర్చకులు
శ్రీముఖలింగం ప్రధాన దేవాలయం, సోమేశ్వర ఆలయం మినహా ఎక్కడా అర్చకులు కనీసం కనబడరు. ఇదే చోట భక్తులు తాకిడి ఉంటుందని భీమేశ్వర తదితర ఆలయాల్లో కనీసం అర్చకులు మచ్చుకైనా కనబడరు. ఇక్కడ కూడా దేవాయ శాఖ అధికారులు చొరవ తీసుకొని అర్చకులను ఏర్పాటు చేస్తే ఇక్కడ ఆలయ విశిష్టత అందరికీ తెలియడంతో పాటు ఆదాయ మార్గాలు పెంచే వారు అవుతారని యాత్రికులు చెబుతున్నారు.
అసిస్టెంట్ కమిషనర్‌కు నివేదించాను
కార్తీక సోమవారాలే కాకుం డా నెల మొత్తం ప్రత్యేక టిక్కెట్లు అమ్మేందుకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌కు లేఖ ద్వారా నివేదించాను. అలాగే అన్ని దేవాలయాల మాదిరిగానే సీజీఎఫ్(కామన్ గుడ్ ఫండ్) కంట్రిబ్యూషన్, ఆడిట్ ఫీజు తదితరవి మొత్తం ఆదాయం సుమారు 13.5 శాతం చెల్తిస్తున్నాం. ఆదాయం పెరిగితే ఆలయం కూడా అభివృద్ధి చెందుతుంది. అధికారులు కూడా చర్యలు తీసుకుని అనుమతులు ఇవ్వాలి. – వీవీఎస్ నారాయణ, ఈఓ,శ్రీముఖలింగం
Comments
Please login to add a commentAdd a comment