బోథ్‌లోని శ్రీ వేంకటేశ్వర ఆలయం (ఈ ఆలయానికి చెందిన 48.29 ఎకరాలు కబ్జాకు గురైంది)
సాక్షి, బోథ్: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో దేవుడి భూములు అన్యాక్రాంతమయ్యాయి. దేవాదాయశాఖకు చెందిన వందలాది భూములు పరాయి వారి చేతుల్లోకి చేరాయి. మొత్తం 111 ఆలయాలకు దాదాపు 3563 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో నుంచి చాలా భూములు కబ్జాకు గురయ్యాయి. కొన్నేళ్ల తరబడి ఈ భూముల్లో వ్యవసాయం సాగిస్తున్నారు. ఇటీవల రెవెన్యూ అధికారులు భూసర్వేలో అధికారులు దేవాదాయశాఖ భూములు గుర్తించడంలో విఫలమయ్యారు. దేవాదాయశాఖ అధికారులు ఆలయాల పేరు మీద ఉన్న భూముల వివరాలు ఇవ్వాలని ఇప్పటికే కోరారు. అయితే వందలాది ఎకరాలు పరాధీనంలో ఉండడంతో రెవెన్యూ అధికారుల నుంచి స్పందన కరువైందని తెలుస్తోంది. దేవాలయ భూములు గుర్తించి దేవాదాయశాఖకు అప్పగిస్తే..ఆ భూములకు వచ్చే కౌలుతో దేవాలయాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలోని 111 దేవాలయాల దేవుడి భూములు 3563 ఎకరాలు ఉన్నాయి. ఇందులో 1250 ఎకరాల భూములు ఆలయాల అర్చకుల ఆధీనంలో ఉన్నాయి. మిగతా భూముల విషయంలో దేవాదాయశాఖ అధికారుల వద్ద పాత రికార్డులు, గెజిట్‌లు ఉన్నా..భూములు మాత్రం పరాయివారి ఆధీనంలో ఉన్నాయి.
- బోథ్ మండలంలోని కుచులాపూర్ పంచాయతీ పరిధిలోని అతి ప్రాచీనమైన శ్రీ వేంకటేశ్వర ఆలయానికి చెందిన 48 ఎకరాల 29 గుంటల భూమి దశాబ్దాలుగా పరాదీనంలో ఉంది. ఈ భూమని గుర్తించి దేవాదాయశాఖకు అప్పగిస్తే వచ్చిన కౌలు డబ్బుతో ఆలయాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఏర్పడుతుంది.
- ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వర దేవాలయ ధర్మశాల పేరిట గుడిహత్నూర్ మండలంలోని సీతాగొందిలో 29.31 ఎకరాల భూమి ఉంది. ఇందులో 26.31 ఎకరాలు పరాధీనంలో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ భూమి విషయమై అధికారులు ట్రిబ్యునల్‌ను కూడా ఆశ్రయించారు.
- నిర్మల్ మండలంలోని సోన్‌లోని దత్తస్వామి మఠానికి చెందిన ఏడు ఎకరాల భూమి నేరడిగొండ మండలంలోని బుద్దికొండలో ఉంది. ఈ భూమి ఇతరులు సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది.
- నేరడిగొండ మండలంలోని వడూర్ గ్రామంలోని శ్రీరామ చంద్రస్వామి ఆలయానికి 48 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి వడూర్, ఆరెపల్లి, బుద్దికొండ, వాగ్దారి, బోరిగాం గ్రామాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూమి కబ్జాలో ఉంది.
- ఆదిలాబాద్ పట్టణకేంద్రంలోని పురాతనమైన గోపాలకృష్ణ మఠానికి చెందిన 1259 ఎకరాల వ్యవసాయ భూములు మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలోని కేలాపూర్ తాలుకాలోని గోమ్సి గ్రామంలో ఉన్నాయి.
- గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది హనుమాన్ ఆలయం పేరిట 31.24 ఎకరాల భూమి ఉంది. కానీ స్థానికంగా 15 ఎకరాలు మాత్రమే ఉందని అధికారులు చెబుతున్నారు. మిగతా భూమి ఎక్కడికెళ్లిందో తెలియని పరిస్థితి.
- ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ బాలాజీ వేంకటేశ్వర ఆలయానికి బేల మండలంలో 54 ఎకరాలు, జైనథ్ మండలంలో 221 ఎకరాలు, తలమడుగు మండలంలో 43 ఎకరాలు ఉన్నాయి. ఈ భూముల్లో ఇటీవల అధికారులు 23 ఎకరాలు గుర్తించి సాగు చేసుకున్నారు. మిగతా భూమి కొంత మంది పట్టా చేసుకున్నారని సమాచారం. అయితే చాలా వరకు భూములు అధికారులు గుర్తించడంలో విఫలమవుతున్నారు. ప్రస్తుతం దేవాదాయశాఖ వద్ద కేవలం 554 ఎకరాల భూములు మాత్రమే ఉన్నాయి. 500 ఎకరాలు కబ్జాకు గురి కాగా..1259 ఎకరాలు మహారాష్ట్రలో ఉన్నాయి. 1250 ఎకరాలు అర్చకుల పేరు మీద ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా భూములు తమకు అప్పగించాలని ఇప్పటికే దేవాదాయశాఖ అధికారులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.
ప్రభుత్వ భూసర్వేలో వెల్లడైన దేవాలయాలకు చెందిన భూముల వివరాలు..
జిల్లా | దేవాలయాలు | ఎకరాలు | భూమి ఉన్న ఆలయాలు | గుర్తించిన భూమి |
ఆదిలాబాద్ | 17 | 373 | 8 | 120 |
మంచిర్యాల | 16 | 91 | 6 | 17 |
నిర్మల్ | 72 | 1301 | 16 | 86 |
కుమురంభీం | 6 | 164 | 6 | 122 |
పరాధీనంలో కొన్ని దేవాదాయభూములు
దేవాలయం | విస్తీర్ణం(ఎకరాల్లో) |
జంగం మఠం,బోథ్ | 7.39 |
శ్రీ వేంకటేశ్వర ఆలయం,బోథ్ | 48.29 |
బాలాజీ వేంకటేశ్వర ఆలయం, ఆదిలాబాద్ | 290.35 |
దత్తస్వామి మఠం, సోన్ మండలం | 7.09 |
రామచంద్రస్వామి దేవాలయం, వడూర్,నేరడిగొండ | 48.06 |
వేంకటేశ్వర స్వామి ఆలయం, తాంసి | 39.24 |
హనుమాన్ మందిరం, సీతాగొంది, గుడిహత్నూర్ | 31.24 |
మహాదేవ్ మందిరం,గుడిహత్నూర్ | 16.24 |
రామలక్ష్మణ స్వామి మందిరం, గుడిహత్నూర్ | 10.00 |
వేంకటేశ్వర ధర్మశాల, ఆదిలాబాద్ | 23.31 |
దేవుడి మాన్యాలు స్వాధీనం చేసుకుంటాం
జిల్లాలోని దేవుడి మాన్యాలు స్వాధీనం చేసుకుంటాం. ఈ మేరకు ట్రిబ్యునల్‌కు వెళ్లాం. భూములకు సంబంధించి రెవెన్యూ అధికారుల నుంచి సమాచారం కోరాం. భూములకు సంబంధించి పాత రికార్డులు, గెజిట్‌ల ఆధారంగా రెవెన్యూ అధికారులతో కలిసి స్వాధీనం చేసుకుంటాం. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఎవరైనా దేవాదాయ భూములు కబ్జా చేస్తే కోర్టుకు వెళ్తాం.– విజయరామారావు, అసిస్టెంట్ కమిషనర్, దేవాదాయశాఖ
Comments
Please login to add a commentAdd a comment