కోరుకొండ స్వామి ఆదాయం రూ.15.27లక్షలు
భక్తి శ్రద్ధలతో శ్రీ పుష్పయాగం
కోరుకొండ : లక్ష్మీనరసింహ స్వామి వారి దివ్య కల్యాణం పురస్కరించుకుని వివిధ రూపాల్లో భక్తులు ఇచ్చిన విరాళాలు, హుండీల సొమ్ము ద్వారా స్వామికి రూ.15 లక్షల 27 వేల 206 ఆదాయం వచ్చింది. సోమవారం ఆలయ ప్రాంగణంలో అన్నవరం దేవస్థానం అధికారులు జగన్నాథం, తులారాం, ఎంకేటీఎన్‌వీ ప్రసాద్, టీవీ రమణ, టీఎన్ రాంజీ, కోరుకొండ లక్ష్మీనరసింహ ఆలయ ధర్మకర్త ఎస్పీ రంగరాజభట్టర్, భక్తుల సమక్షంలో హుండీల లెక్కింపు నిర్వహించారు. కల్యాణం టికెట్ల ద్వారా రూ.76,500, దర్శనం టికెట్ల ద్వారా రూ.1,28,637, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1,37,760, కల్యాణం ద్వారా రూ.8,761, భక్తుల ప్రత్యేక విరాళాలు రూ.15,650, కొబ్బరి చెక్కల పాటలు రూ.50,500, తలనీలాల ద్వారా రూ.నాలుగు వేలు, చెప్పుల పాటల ద్వారా రూ.19,400, హుండీల ద్వారా రూ.7,67,567, ఉత్సవాలకు ముందు డిబ్బీల లెక్కింపు ద్వారా వచ్చిన ఆదాయం రూ. 3,18,930 ఆదాయం స్వామి వారికి వచ్చిందన్నారు. ఈ మొత్తం రూ.15,27,206 నగదును శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తామని అన్నవరం దేవస్థానం అధికారులు తెలిపారు.
శ్రీ పుష్పయాగం
లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణ మహోత్సవాలు పురస్కరించుకుని సోమవారం ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. సాయంత్రం వివిధ రకాల ప్రసాదాలు, పండ్లు, విశేష పుష్పఅలంకరణతో స్వామి వారికి విశేష సేవా కాలం (శ్రీ పుష్పయాగం) నిర్వహించారు. తదుపరి పవళింపు సేవలో స్వామి వారిని చూసి భక్తులు సేవించుకున్నారు.