అంతంత మాత్రంగానే పెరిగిన దేవాదాయం
పెద్దనోట్ల రద్దుతో హుండీల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందని ఆశించిన అధికారులు
తలకిందులైన అంచనాలు
40 రోజుల్లో జిల్లా వ్యాప్త ఆదాయం రూ.5.30 కోట్లే
కొవ్వూరు :
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఆలయాల్లో హుండీల ద్వారా లభించే ఆదాయం భారీగా పెరుగుతుందన్న అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. పాత నోట్లను పెద్దఎత్తున హుండీల్లో వేస్తారని దేవాదాయ శాఖ అధికారులతోపాటు సామాన్యులూ భావించారు. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపించింది. గత ఏడాదితో పోలిస్తే దేవాదాయం పెరిగినా.. ఆశించిన స్థాయిలో లేదు. ఏటా సగటున 10 నుంచి 15 శాతం పెరుగుతుండగా. ఈ ఏడాది కేవలం 20 నుంచి 30 శాతం మాత్రమే పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గడచిన 40 రోజుల్లో జిల్లాలో 1,732 ఆలయాలు ఉండగా, వాటిలోని హుండీల ద్వారా రూ.5.30 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఇందులో సగం ఆదాయం ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామి, మద్ది ఆంజనేయస్వామి, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి, నిడదవోలు కోటసత్తెమ్మ, భీమవరం మావుళ్లమ్మ ఆలయాల ద్వారానే సమకూరింది.
చినవెంకన్నకు వచ్చింది రూ.కోటిన్నర
ద్వారకాతిరుమల ఆలయంలో హుండీల ద్వారా గతంలో నెలకు సరాసరి రూ.కోటి ఆదాయం వచ్చేది. ఈ నెలలో లభించిన మొత్తం సుమారు రూ.కోటిన్నర ఉందని అధికారులు చెబుతున్నారు. ఈనెల 7, 8, 9 తేదీల్లో సుమారు రూ.10 లక్షల ఆదాయం లభించింది. 9వ తేదీ నుంచి 14వ తేదీలోపు ఐదు రోజులకు రూ.34.95 లక్షలు వచ్చింది.
మరో నాలుగు ప్రధాన ఆలయాలైన మద్ది ఆంజనేయస్వామి, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి, నిడదవోలు కోటసత్తెమ్మ, భీమవరం మావుళ్లమ్మ ఆలయాల ఆదాయంలో పెరుగుదల స్వల్పంగానే కనిపించింది. రూ.25 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఆదాయం కలిగిన ఆలయాలు 16 ఉన్నాయి. భీమవరం సోమేశ్వర, జనార్దనస్వామి వార్ల ఆలయం, పెదవేగి మండలం రాట్నాలకుంటోలని రాట్నాలమ్మ, పెదపాడు మండలం అప్పనవీడు ఆంజనేయస్వామి, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలోని పారిజాతగిరి, పెనుగొండలోని కేదారేశ్వరస్వామి, తణుకు సజ్జాపురంలో సోమేశ్వరస్వామి తదితర ఆలయాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటి ఆదాయంలో అతి స్వల్పంగానే పెరుగుదల కనిపించింది. ఏటా రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల ఆదాయం వచ్చే ఆలయాలు 343, రూ.50 వేల నుంచి రూ.2 లక్షలలోపు ఆదాయం గల ఆలయాలు 227 ఉన్నాయి. రూ.50 వేల లోపు ఆదాయం కలిగిన ఆలయాలు 1,033 ఉన్నాయి. వీటి ఆదాయాల్లో ఏమాత్రం పెరుగుదల కనిపించలేదు. రద్దు చేసిన పెద్దనోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే గడువు ముగిసిపోయింది. ఇకపై ఈ నోట్లను రిజర్వ్ బ్యాంక్ శాఖల్లో అఫిడవిట్ సమర్పించి మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అయినా ప్రజల వద్ద మిగిలిపోయిన పాతనోట్లు హుండీల్లో పడవచ్చని దేవాదాయ శాఖ అధికారులు భావిస్తున్నారు.
తరచూ హుండీ లెక్కింపులు
నోట్లు రద్దు కారణంగా చిల్లర నోట్ల కొరత అధికం కావడంతో.. ఆ పరిస్థితి నుంచి కొంత ఉపశమనం కల్పించేందుకు ఆలయాల్లోని హుండీ ఆదాయాన్ని రెండు రోజులకు ఒకసారి లెక్కించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆ ఆదాయ మొత్తాలను ఎప్పటికప్పుడు బ్యాంకుల్లో జమ చేయాలని సూచించారు. కొన్ని ఆలయాల్లో రోజు విడిచి రోజు, మరికొన్ని ఆలయాల్లో మూడు రోజులకు, మరికొన్నిచోట్ల నాలుగైదు రోజులకు ఒకసారి హుండీ ఆదాయాల్ని లెక్కిస్తున్నారు.
అధిక మిచ్చేందుకు హుండీల ను రోజు విడిచి రోజు లెక్కించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.వీలును బట్టి కోన్ని ఆలయాల్లో మూడు రోజులకు ఒకసారి, మరికొన్ని ఆలయా ల్లో నాలుగైదు రోజులకు, వారానికి ఒకసారి లెక్కిస్తున్నారు. టీటీడీ హుండీ ఆదాయం భారీగా పెరగడంతో జిల్లాలోని ప్రముఖ ఆలయాల ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని అధికారులు పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. అంచనాలు తారుమారైనప్పటికీ కొద్దోగొప్పో పెరిగిందని చెబుతున్నారు.