పూడికతీత మంత్రం
Published Wed, Jan 29 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
సాక్షి, కాకినాడ :జిల్లాను వరదలు.. భారీ వర్షాలు ముంచెత్తినా రెండవ పంటకు ప్రతిఏటా సాగునీటి కష్టాలే. గోదావరిపై సర్ ఆర్ధర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద చాలినంత నీటి నిల్వల్లేక ఒకపక్క సాగునీటికి..మరొకపక్క తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. బ్యారేజ్ వద్ద పేరుకుపోయిన ఇసుక వల్లే ఈ దుస్థితి దాపురించింది. ప్రతి ఏటా ఇసుక పూడికతీతపై చర్చ జరుగుతున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. ఇక నుంచి ప్రతి ఏటా ఆగస్టులో బ్యారేజ్ వద్ద ఇసుకపూడిక తీత తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా నెలకొన్న ఇసుక కష్టాలను ఈ పూడిక ద్వారా అధిగమించాలన్న యోచనకు ప్రభుత్వం వచ్చింది. వీటి కేటాయింపు, స్టాక్ పాయింట్ల ఏర్పాటు తదితర బాధ్యతలను నీటిపారుదల శాఖ ఈఎన్‌సీకి అప్పగించారు.
గోదావరి బ్యారేజ్ వద్ద సుమారు ఎనిమిదిన్నర లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక పూడిక ఉందని గుర్తించిన యంత్రాంగం వీటి తొలగింపు కోసం అనుమతులు మంజూరు చేయాలని ఎప్పటి నుంచో కోరుతోంది. 1975-80ల మధ్య ఈ బ్యారేజ్‌లో పూడిక తీశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఈ పూడిక తీత జోలికి పోలేదు. ప్రస్తుతం ఇసుక రీచ్‌లకు గడువు ముగియడం...ఉన్న కొద్దిపాటి నిల్వలు అడుగంటిపోతుండడంతో ఇసుక కొరత రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. రీచ్‌ల కేటాయింపునకు పర్యావరణ అనుమతులు లేకపోవడం ప్రధాన అడ్డంకిగా నిలవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఇందులో భాగంగాా గత నెలలో జరిగిన జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశంలో బ్యారేజ్ వద్ద పూడికను తొలగించడం ద్వారా ఇసుక కష్టాలను అధిగమించవచ్చునన్న జిల్లా జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, డ్వామా పీడీ సంపత్‌కుమార్ సూచనలు ఫలితాన్నిచ్చాయి. ఈ మేరకు పంపినప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో బ్యార్‌జే వద్ద పూడికతీతకు మార్గం సుగమమైంది.
బ్యార్‌జ్‌కు ఇబ్బంది కలగకుండా...
బ్యారేజ్‌కు ఎగువన రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రిజర్వాయర్ పాయింట్లయిన గోగుల్లంక, కేదార్లంక, కాతేరు పరిధిలో విస్తరించి ఉన్న ప్రాంతంలో సుమారు 2.50 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక పూడికను తొలగించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పూడిక తొలగించేందుకు అర్హత గల ఏజెన్సీని గుర్తించడం.. కేటాయింపు బాధ్యతలను ఇరిగేషన్ ఈఎన్‌సీకీ, స్టాక్ పాయింట్ల గుర్తింపు, ఏర్పాటు బాధ్యతను ఇరిగేషన్ హెడ్‌వర్క్స్‌ఈఈకు అప్పగించారు. ఆయా గ్రామాల పరిధిలోఉన్న బోట్స్‌మెన్ సొసైటీల మధ్య ఏకాభిప్రాయంతో ఒక సొసైటీకి పూడికతీత బాధ్యతలు అప్పగించనున్నారు. వారి మధ్య సయోధ్య కుదరని పక్షంలో లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నారు.
రవాణాకు సంబంధించి ట్రాన్సిట్‌పాస్‌లు జారీ బాధ్యత కూడా ఈఎన్‌సీకే అప్పగించారు. అయితే నిబంధనల అమలును మాత్రం డ్వామా పర్యవేక్షించ నుంది. క్యూబిక్ మీటర్ ఇసుక రూ.415 ధరతో ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తారు. ఇదే రేటుకు ప్రజలకు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏజెన్సీ గుర్తింపు, కేటాయింపు ప్రక్రియను నాలుగైదు రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఏదేమైనా ఫిబ్రవరి మొదటి వారంలో ఇక్కడ నుంచి ఇసుక అందుబాటులోకి రానుంది. ఇదేరీతిలో ప్రతి ఏటా ఆగస్టులో ఇసుక పూడికతీత చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. తాండవ నదిలో కూడా ఇదే రీతిలో పూడికతీతకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ కూడా పూడికతీతకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినప్పటికీ ఏ మేరకు తీయవచ్చునన్న విషయంపై ఇంకా నిర్ధారణ జరగలేదు.
పట్టాల్యాండ్‌లో పూడికతీతకు అనుమతులు
మరొకపక్క పి.గన్నవరం మండలం లంకల గన్నవరంలో అన్నాబత్తుల వెంకటరమణమూర్తికి చెందిన సర్వేనెం 53, 54, 55ల పరిధిలో విస్తరించి ఉన్న 17 ఎకరాల పట్టా భూముల్లో సుమారు 2,15,624 క్యూబిక్ మీటర్ల ఇసుక వెలికితీతకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. జిల్లాలో జొన్నాడ, అయినవిల్లి రీచ్‌ల సమీపంలో స్టాక్ పాయింట్ల వద్ద ఉన్న 40వేల క్యూబిక్ మీటర్ల ఇసుక రవాణాకు మార్చి 5వ తేదీ వరకు, రాజమండ్రి రీచ్ సమీపంలో ఉన్న స్టాక్ పాయింట్ వద్ద 47,300 క్యూబిక్ మీటర్ల ఇసుక రవాణాకు జూలై 1వ తేదీ వరకు అనుమతులున్నాయి. మొత్తమ్మీద ఇసుక కష్టాలను కొంతలో కొంత ఈ పూడికతీత అనుమతులు తీర్చనున్నాయి.
Advertisement
Advertisement