ఎస్కేయూ అనుబంధ కళాశాలల్లో భర్తీ కాని సీట్లు 2717
క్యాంపస్ కళాశాలల్లో 198 సీట్లు ఖాళీ
ఎస్కేయూ: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ కళాశాలలు, అనుబంధ పీజీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎస్కేయూ సెట్- 2016 రెండో దఫా కౌన్సెలింగ్ శుక్రవారం ముగిసింది. అనుబంధ పీజీ కళాశాలల్లో 4,683 పీజీ సీట్లు ఉండగా 1,966 మాత్రమే భర్తీ అయ్యాయి. 2,717 సీట్లు మిగిలిపోయాయి. క్యాంపస్ కళాశాలల్లోనూ గతేడాదితో పోలిస్తే మిగులు సీట్ల సంఖ్య పెరిగింది. క్యాంపస్ కళాశాలల్లో 921 సీట్లు అందుబాటులో ఉండగా, రెగ్యులర్ సీట్లు 55, సెల్ఫ్‌ఫైనాన్స్/ పేమెంట్ సీట్లు 143 కలిపి 198 సీట్లు భర్తీ కాలేదు.
యాజమాన్యాల్లో నష్ట భయం
కొన్ని కళాశాలల్లో 1, 3, 2, 5, 6 , 7, 19 మంది మాత్రమే అడ్మిషన్లు పొందారు. ఇది యాజమాన్యాలకు మరింత భారం కానుంది. 2016-17 విద్యాసంవత్సరం నుంచి హాజరు నమోదుకు బయోమెట్రిక్ ప్రవేశపెట్టనుండడంతో తరగతులు తప్పనిసరిగా నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఫ్యాకల్టీని విధిగా నియమించుకోవాలి. అడ్మిషన్లు తగ్గుముఖం పట్టడంతో యాజమాన్యాల్లో నష్టభయం నెలకొంది.
డిగ్రీలో కొరవడిన విద్యా ప్రమాణాలు : డిగ్రీ కోర్సులో సరైన విద్యా ప్రమాణాలు లేకపోవడంతో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గణనీయంగా తగ్గింది. డిగ్రీ కళాశాలల స్థితిగతులపై అధ్యయనం చేయాల్సిన యూనివర్సి టీ కళాశాల డెవలప్‌మెంట్ కౌన్సిల్ (సీడీసీ) ఒక్క రోజు కూడా పర్యవేక్షించిన దాఖలాలు లేవు. డిగ్రీ ఉత్తీర్ణత శాతం పెంచితేనే వర్సిటీలలో విద్యార్థుల నమోదు శాతం పెంచవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.