- ‘స్థాయీ’ సమావేశంలో ప్రజాప్రతినిధుల ఫైర్
- వాడి వేడిగా చివరి సమావేశం
విశాఖ రూరల్:‘ప్రజాప్రతినిధులంటే జిల్లా అధికారులకు మర్యాద లేనట్టుంది. ఏ సమాచారం ఇవ్వరు. ఏ శాఖలో ఏ పని జరుగుతోందో చెప్ప రు. పద్ధతి మార్చుకోవాలి’ అంటూ అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అధికారులపై ఫైర్ అయ్యారు. బుధవారం ఉద యం నుంచి సాయంత్రం వరకు జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవాని అధ్యక్షతన ఏడు స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి.
ఒకటి నుంచి ఆరు స్థాయి సంఘం సమావేశాలు ప్రశాం తంగా జరగగా సాయంత్రం జరిగిన చివరి స్థాయి సమావేశంలో ప్రజాప్రతినిధులు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ ముత్తంశెట్టి, ఎమ్మెల్యే బండారులు అధికారులను నిలదీశారు. ఇంజనీరింగ్ శాఖలకు సంబంధించి పనుల ప్రగతిపై చర్చకు రాగా కొన్ని పనులు సక్రమంగా జరగడం లేదంటూ అధికారులను ప్రశ్నిం చారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల తీరుపై ఎమ్మెల్యే బండారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ శాఖకు సంబంధిం చి ఎటువంటి సమాచారం అందించడం లేదని, అడిగిన వివరాలు కూ డా సక్రమంగా ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. ఏదైనా ప్రాజెక్టు, పను ల విషయంలో సమస్య తలెత్తితే ప్ర జాప్రతినిధుల దృష్టికి తీసుకువస్తే అవసరమైన వాటిని ప్రభుత్వం దృ ష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. గత మూడేళ్లుగా జిల్లా పరిషత్‌లో చేపట్టిన పను లు, ఖర్చు చేసిన నిధులు వివరాలు చెప్పాలంటూ ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులను నిల దీశారు. ఈ స్థాయి సంఘం సమావేశాలకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పింఛన్లు పునరుద్ధరించాలి
ఉదయం జరిగిన 2వ స్థాయి సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖకు సం బంధించిన అంశాలతోపాటు గృహ నిర్మాణం, సహకారం, పొదుపు, చిన్నమొత్తాల పొదుపు, పరిశ్రమల అంశాలపై చర్చించారు. ఇందులో ప్రధానంగా పెన్షన్ల విషయంపై చర్చకు వచ్చింది. చోడవరం ఎమ్మెల్యేల సన్యాసిరాజు మాట్లాడుతూ చాలా ఏళ్లుగా పించన్లు పొందుతున్న వారిని ఇపుడు అనర్హులుగా గుర్తించడం దా రుణమన్నారు. రద్దు చేసిన పింఛన్లను పునరుద్ధరించాలని కోరగా ప్రజాప్రతినిధులు ఆ విధంగా తీర్మానించారు. జిల్లాలో ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో స్థానికులకే ఉపాధి కల్పించాలని మరో తీర్మానం చేశారు. సమావేశాల్లో జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
జీవీఎంసీకి రైవాడ నీటిని నిలిపివేయాలి
జిల్లాలోని జలాశయాలకు విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని, జనరేటర్లున్నా డీజిల్ ఇవ్వడం లేదని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు నీటిపారుదల శాఖాధికారులను ప్రశ్నించారు. రైవాడ పరిస్థితి దారుణంగా ఉందని, జనరేటర్ ఉన్నా డీజిల్ లేదనగా నిధులవసరమని అధికారులు చెప్పుకొచ్చారు. రైవాడ నీటిని వినియోగించుకుంటున్న జీవీఎంసీ రూ.106 కోట్లు చెల్లించాల్సి ఉందని, అవి చెల్లిస్తేగాని నీటిని సరఫరా చేయొద్దని ఎమ్మెల్యే సూచించారు. సుజల స్రవంతి కింద జిల్లాలో 237 యూనిట్లు ఏర్పాటుచేస్తామని నియోజకవర్గానికి ఒకటి మాత్రమే ఏర్పాటుచేయడంపై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ప్రశ్నించారు. దాతలు ముందుకు వస్తే మిగిలినవి ఏర్పాటు చేస్తామని వారు చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ఆర్టీసీ డీఎం చిన్నచిన్న పొరపాట్లకు చర్యలు తీసుకుంటున్నారని, ఇలా అయితే బస్సులు నడపలేరన్నారు.