రంగారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా సారథిగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నియమిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రక టించారు. జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన పి.మహేందర్‌రెడ్డి ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంచిరెడ్డి గతంలో తొమ్మిదేళ్లపాటు జిల్లా పార్టీ బాధ్యతలు నిర్వర్తించారు.
ఈ నేపథ్యంలోనే ఎన్నికల వేళ సమర్థుడిగా పేరున్న ఆయన నాయకత్వానికి చంద్రబాబు మొగ్గు చూపారు. శనివారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, టీజేఏసీ సలహాదారు చిగుళ్లపల్లి రమేశ్‌కుమార్ నేతృత్వంలో వందలాదిమంది కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌తో ప్రత్యేకంగా చంద్రబాబు సమావేశమయ్యారు. సీనియరైన మంచిరెడ్డికి జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయానికి సానుకూలంగా స్పందించిన ప్రకాశ్... ఆయన నేతృత్వంలో పనిచేసేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలిసింది.
వందమందిని తయారు చేస్తా..
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా మారుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. శాటిలైట్ టౌన్‌గా అభివృద్ధి చేయడానికి హైదరాబాద్‌తో వికారాబాద్‌ను అనుసంధానం చేస్తానని అన్నారు. విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడంతోపాటు విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నా రు. టీడీపీని ఖాళీ చేయిస్తామని కొందరు మాట్లాడుతున్నారని.. ఖాళీ కావడానికి బ్రాందీ సీసా కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. బలమైన కేడర్ ఉన్నంత వరకు పార్టీని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఒక్కొక్కరికి సమానంగా వందమందిని తయారుచేస్తానన్నారు. పురపాలక సం ఘాల్లో పార్టీ సత్తా చాటేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.