చీమకుర్తి: మండల కేంద్రాన్ని ఉలికిపాటుకు గురిచేసిన దంపతుల దారుణ హత్యకు కేసులో పురోభివృద్ధి కనిపిండంలేదు. సెప్టెంబర్ 19న చీమకుర్తి పట్టణంలోని కోటకట్లవారి బజారులో దింటకుర్తి వెంకట సుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులను రాత్రి 9 గంటల సమయంలో అతి దారుణంగా గొంతులు కోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్సైలు ఒక డీఎస్పీ, ఒక సీసీఎస్ డీఎస్‌పీతో కలిసి మూడు బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టినట్లు తెలిసింది. హత్యకు గురైన దంపతుల కుమారులు, బంధువులు మాత్రం హత్యకు గురైన వారికి ఎలాంటి వివాదాలు లేవని చెప్తున్నారు.
అయితే ఈ హత్యల వెనుక అదే సామాజిక వర్గానికే చెందిన ఇద్దరు ముగ్గురు బడా గ్రానైట్ నేతల పాత్ర ఉన్నట్లు సంఘటన జరిగిన వారం రోజుల పాటు చీమకుర్తిలో విస్తృతంగా చర్చ సాగింది. దీంతో ఆర్యవైశ్య సంఘాల నాయకులు నిరసన ర్యాలీలు చేసి హంతకులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేసిన వారు కూడా గత మూడు వారాల నుంచి నోరు మెదపకపోవడం గమనార్హం. గ్రానైట్ వ్యాపార కేంద్రంగా ఉన్న చీమకుర్తివాసుల్లో మనోధైర్యాన్ని కల్పించేందుకు మాత్రం 12 మంది అదనపు పోలీస్ ఫోర్స్‌ను చీమకుర్తికి కేటాయించారు. అంతే తప్ప విచారణలో హంతకులు ఎవరన్న క్లూ దొరక లేదని అంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సీసీ కెమెరాలెందుకు?
చీమకుర్తి పట్టణంలోని ప్రధాన వీధులతో పాటు ప్రధాన కూడళ్లు, బైపాస్‌లో 30కి పైగా సీసీ కెమెరాలను అమర్చినప్పటికీ ఇలా దొంగతనాలు, హత్యలు చేసిన వారిని కనుగొనడటంలో అవి ఏ మాత్రం ఉపయోగపడటంలేదు. అసలు హత్యకు పాల్పడిన వారు దొంగతనం కోసమే వచ్చారా? లేక వ్యాపార, భూసంబంధ, ఇతర వివాదాల నేపథ్యంలో హత్య జరిగిందా..? అనే కోణాలు ఇంకా వెలుగులోకి రాకపోవడం గమనార్హం. జనం రద్దీగా ఉండే బజారులో దారుణంగా భార్యాభర్తలను హత్యచేస్తే పోలీసుల విచారణలో ఎలాంటి పురోగతి కానరాకపోవడం, హంతకులు ఎవరనేది ఇంకా తేల్చకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి చీకటి పడగానే ఇంటి ముందు వీధి లైటు వెలగకపోయినా, ఇంట్లో ఒంటరిగా ఉన్నా భయపడుతున్నారు. హత్య జరిగి దాదాపు నెల రోజులు కావస్తోంది. పోలీసులు మాత్రం విచారణ వేగవంతం చేస్తున్నామంటున్నారు. హంతకులను పట్టుకోవడం ఆలస్యం కావచ్చేమో కానీ కచ్చితంగా బోనులో పెడతామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మూడు బృందాలతో విచారణ:
హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే మూడు బృందాలతో విచారణ చేస్తున్నారు. హంతకులను త్వరలో పట్టుకుంటామనే నమ్మకం ఉంది.
దుర్గాప్రసాద్, ఒంగోలు రూరల్ సీఐ
పబ్లిక్‌లో వచ్చే రూమర్లకు ఆధారాలు లేవు:
హత్యకు గురైన వారి గురించి పబ్లిక్‌లో వచ్చే రూమర్లకు సరైన ఆధారాలు లేవు. హత్యలపై ప్రతిరోజూ వివిధ కోణాల్లో విచారిస్తున్నాం. నూటికి నూరు శాతం హంతకులను త్వరలో పట్టుకుంటాం.
రాఘవేంద్ర, సీసీఎస్ సీఐ, ఒంగోలు
Comments
Please login to add a commentAdd a comment