అంతు చూసిన అనుమానాల కార్చిచ్చు!
భార్యభర్తలు సజీవదహనం
అనుమానాలే ఆత్మహత్యకు పురిగొలిపాయా?
అనాథలైన ఇద్దరు కుమార్తెలు
ప్రేమించుకోడానికి రెండు మనసులు చాలు. పెళ్లికి మాత్రం రెండు కుటుంబాలు కావాలి... అని రాశాడొక సినీ రచయిత. పెద్దలు చేసిన పెళ్లిని కాదనుకుంది. కూతురితో సహా ప్రియుడి చెంతకు చేరింది. అతనితో మరో కూతురికి జన్మనిచ్చింది. ఏడేళ్లు బాగానే గడిచింది. బుధవారం అర్ధరాత్రి ఆ ఇంట్లో లేచిన మంటల్లో ఇద్దరి జీవితాలకు తెర పడింది. ఏమైంది... ఏం జరిగింది... అనుమానమే ఇద్దరి అన్యోన్యతను చీల్చిందా... అందమైన కుటుంబంలో విభేదాల కార్చిచ్చుకు మరే కారణమైనా ఉందా... కారణాలేవైనా రెండు నిండు జీవితాలు బూడిదయ్యాయి. ఏ పాపం తెలియని ఇద్దరు చిట్టితల్లులు అనాథలయ్యారు. మారికవలస రాజీవ్‌గృహకల్ప కాలనీలో బుధవారం అర్థరాత్రి ముత్యాలు శ్రీను, పంపాన సత్యవతి దంపతుల సజీవ దహనం అత్యంత విషాదాన్ని మిగిల్చింది.
విశాఖపట్నం: సాలిపేట ప్రాంతానికి చెందిన ముత్యాలు శ్రీను, పంపాన సత్యవతి క్లాస్‌మేట్లు. పదో తరగతి నుంచే ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. కానీ పంపాన సత్యవతికి ఆమె తల్లితండ్రులు మల్కాపురానికి చెందిన వ్యక్తితో పెళ్లి చేశారు. వీరికి ఒక గౌతమి అనే కుమార్తె జన్మించింది. కానీ సత్యవతి మొదటి భర్త నుంచి విడిపోయి ఏడేళ్ల క్రితమే శ్రీను దగ్గరకు వచ్చేసింది. చేసేదిలేక అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు కూడా వీరి ప్రేమ వ్యవహారానికి అడ్డు చెప్పలేదు. ఆ తరువాత శ్రీను, సత్యవతికి హరిణి అనే కుమార్తె జన్మించింది. దీంతో సత్యవతి తల్లిదండ్రులు మొదటి అమ్మాయి గౌతమిని తమ వద్దే పెంచుకుంటున్నారు. ఇలా ఏడేళ్లపాటు వీరి కాపురం సజావుగానే సాగింది.
వేరే వ్యక్తి స్కూటర్‌పై వెళ్లడంతో కలతలు
నగరంలోని నివసిస్తున్న శ్రీను ప్రముఖ వస్త్ర దుకాణంలో, సత్యవతి సిరిపురంలోని ఓ బ్యూటీ ప్లార్లర్‌లో పనిచేస్తున్నారు. రోజూ భార్యను సిరిపురంలో దించి తన విధులకు వెళ్లడం శ్రీనుకు అలవాటు. నెలరోజుల క్రితం సత్యవతి వేరే వ్యక్తి స్కూటర్‌పై వెళ్లడాన్ని శ్రీను చూశాడని... అప్పటినుంచి ఇద్దరి మధ్య కలతలు మొదలయ్యాయని సమీప బంధువులు చెబుతున్నారు. దీంతో దంపతులు వారం రోజుల క్రితమే మారికవలస రాజీవ్‌గృహకల్ప కాలనీ బ్లాకు నంబర్ 155లో ఎఫ్‌ఎఫ్ 5 ఇంటిని అద్దెకు తీసుకున్నారు.
పెద్ద కూతురి పుట్టిన రోజు చేసి...
అమ్మమ్మ దగ్గర పెరుగుతున్న పెద్ద కూతురు గౌతమి పదో సంవత్సరం పుట్టిన రోజు వేడుకలు బుధవారం జరిగాయి. వేడుకల కోసం చిన్న కూతురు హరిణితో కలసి సత్యవతి తల్లి ఇంటికి వెళ్లింది. వేడుకలకు హాజరుకాని శ్రీను రాత్రి భార్యను తీసుకొచ్చేందుకు మాత్రం అక్కడికి వెళ్లాడు. చిన్న కూతురు హరిణిని అక్కడే వదిలేసి భార్యభర్తలు మారికవలసలోని ఇంటికి వచ్చేశారు.
అర్థరాత్రి అఘాయిత్యం: రాత్రి ఒంటిగంట ప్రాంతంలో శ్రీను ఇంటి నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయి. సమీపంలో నివసిస్తున్న శంకర్, పార్వతీశం, త్రినాథ్ అనే యువకులు బయటికొచ్చి చూసేసరికి ఇల్లు కాలిపోతోంది. వెంటనే వారు శ్రీను ఇంటికి వెళ్లి చూస్తే లోపల గడియ పెట్టి ఉంది. బలవంతంగా తలుపులను నెట్టేసరికి మంటలు దట్టంగా వ్యాపించడం... ముందుగదిలో గ్యాస్ సిలిండర్ ఉండటంతో భయపడి కిందకు వచ్చి 108కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక శకటం వచ్చి మంటలను ఆర్పింది. అప్పటికే శ్రీను, సత్యవతి శరీరాలు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న పీఎంపాలెం ఎస్‌ఐ ఎం. మహేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని మృతుల బంధుమిత్రులకు నమాచారం అందించారు. శ్రీను, సత్యవతి మృతదేహాలను చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు.
అమ్మ కావాలి: సంఘటన స్థలం వద్ద చిన్న కూతురు హరిణి తల్లి సత్యవతి కోసం విలపిం చిన తీరు కంటతడి పెట్టించింది. అమ్మను చూ పించండని విలపిస్తున్న ఆ చిన్నారిని ఓదార్చ డం ఎవరి తరం కాలేదు. శ్రీను, సత్యవతి మరణించడం వెనుక గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని ఎస్‌ఐ మహేష్ చెప్పారు.