సీపీఐ మాజీ ఎమ్మెల్యే బద్దు చౌహాన్ కన్నుమూత
హైదరాబాద్, న్యూస్‌లైన్: నల్లగొండ జిల్లా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, సీపీఐ నేత ముడావత్ బద్దు చౌహాన్(62) ఆదివారం తుది శ్వాస విడిచారు. ఎల్‌బీనగర్ పరిధి కొత్తపేట లక్ష్మీనగర్ కాలనీలోని ఆయన నివాసంలో ఉంచిన భౌతికకాయాన్ని సీపీఐ నేతలు పల్లా వెంకట్‌రెడ్డి, రవీందర్ నాయక్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్‌రావు, పల్లా నర్సింహారెడ్డి సహా పలువురు సందర్శించి నివాళులర్పించారు. సీపీఐ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. గిరిజన సమస్యల పరిష్కారానికి గొంతెత్తిన నేత చౌహాన్ అని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా కొరివి మండలం కంచర్లగూడేనికి చెందిన తుపియా చౌహాన్, చోమ్లీ దంపతులకు రెండో కుమారుడైన బద్దుచౌహాన్ తొలుత అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్)లో పనిచేశారు. ఎంఏ, బీఈడీ చదివారు.
ఆయన కుమారుడు గౌతమ్ చౌహాన్, కుమార్తె ఝాన్సీ లక్ష్మీ ఇద్దరూ వైద్యులే. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ కావడంతో సీపీఐ అభ్యర్థిగా 1985 ఎన్నికలలో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్యానాయక్ చేతిలో ఓటమిపాలయ్యారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా, రాష్ట్ర గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, వ్యవసాయ సంఘం నాయకుడిగా సేవలందించారు. కొన్ని రోజుల క్రితం రైలు దిగుతూ ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో వెన్నుపూసకు గాయమవ్వడంతో పక్షవాతం బారినపడ్డారు. బద్దు చౌహాన్ అంత్యక్రియలు సోమవారం చైతన్యపురి వీవీనగర్ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.