
సాక్షి, హైదరాబాద్: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా చాడ వెంకట్‌రెడ్డి రెండోసారి ఎన్నికయ్యారు. బుధవారం ఆయనతోపాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సహాయ కార్యదర్శులుగా పల్లా వెంకట్ రెడ్డి, కునంనేని సాంబశివరావును ఎన్నుకోగా, కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎన్.బాలమల్లేశ్, పి.పద్మ, ఇ.నరసింహ, ఎం.ఆది రెడ్డి, టి.శ్రీనివాసరావు, జి.మల్లేశ్‌ను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా మరో 33 మందిని కలుపుకొని మొత్తం 133 మందితో రాష్ట్ర కౌన్సిల్‌ను ఎన్నుకున్నారు.
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఫ్రంట్
ముగిసిన సీపీఐ రాష్ట్ర మహాసభలు
ఎన్నికల హామీలను నెరవేర్చలేక, మాటలు చెప్పడమే తప్ప ఆచరణలో చూపలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్రంట్ పేరుతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. నాలుగురోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర మహాసభలు బుధవారం ముగిశాయి, ఈ సమావేశంలోని తీర్మానాలను, వివరాలను కూనంనేనితోపాటు పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు మల్లేపల్లి ఆదిరెడ్డి, ఎన్.బాలమల్లేశ్ మీడియాకు వివరించారు.
రాష్ట్రంలో బలమైన నియోజకవర్గాలను గుర్తించి, వాటిపై కేంద్రీకరించి పనిచేస్తామన్నారు. ఆ నియోజకవర్గాల్లో స్వతంత్రంగా బలం పెంచుకోవాలని నిర్ణయించినట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో కోదండరాం, వామపక్ష, ప్రజాస్వామిక, లౌకికశక్తులతో కలసి పెద్దఎత్తున ప్రజాపోరాటాలు నిర్వహిస్తామన్నారు.