విజయనగరం: ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం పట్టణంలో పౌర విమానయానశాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఇంటిని సీపీఐ నాయకులు శుక్రవారం ముట్టడించారు. ముందుగా ఆందోళనకారులు అమర్ భవన్ నుంచి ర్యాలీగా ఆర్టీసీ కాంప్లెక్స్, మయూరి జంక్షన్, ఎత్తుబ్రిడ్జి మీదుగా కేంద్రమంత్రి అశోక్ ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కామేశ్వరరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట మార్చారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం చేతకాకపోతే కేంద్రమంత్రి పదవికి అశోక్ గజపతిరాజు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సీపీఐ నాయకులు కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ఇంటిని ముట్టడించి, లోపలివెళ్లేందుకు ప్రయత్నంచేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. 10మంది సీపీఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.