పోలవరం ప్రాజెక్టు 902 హిల్ వ్యూ ప్రాంతంలో ఏర్పడిన పగుళ్లు
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో భూమి బీటలు వారి కుంగిపోవడంతో ప్రజలు, కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. 902 హిల్ వ్యూ ప్రాంతంలో త్రివేణి ఏజెన్సీకి చెందిన మెకానికల్ షెడ్ ప్రాంతంలో శనివారం ఒక్కసారిగా భూమి బీటలువారి పెద్దపెద్ద పగుళ్లు ఏర్పడటంతో ఆందోళన చెందారు. మెకానికల్ షెడ్‌లోనూ భారీగా పగుళ్లు తీయడంతో యంత్రాలు, వాహనాలు, సామగ్రిని హుటాహుటిన సురక్షిత ప్రదేశానికి తరలించారు. రెండవ విడత ఖాళీ చేయాల్సిన 19 గ్రామాల నిర్వాసితులు రాకపోకలు సాగించేందుకు.. ప్రాజెక్ట్ మార్గానికి వెళ్లేందుకు ఉన్న రోడ్డు మార్గం సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
భూకంపం మాదిరిగా ఇక్కడ భూమి బీటలు వారి పగుళ్లు తీసి కుంగిపోవడం ఆరు నెలల్లో ఇది మూడోసారి. ఈ ఘటనతో పోలవరం ప్రాంత వాసుల్లో భయం మరింత పెరిగింది. 2018 నవంబర్ 4వ తేదీన ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి 100 మీటర్ల పొడవునా, 6 మీటర్ల ఎత్తున పెద్దపెద్ద నెర్రలు ఏర్పడి భూమి పైకి ఉబికింది. దీంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా.. ప్రాజెక్ట్ ప్రాంతానికి వెళ్లేందుకు అంతరాయం ఏర్పడింది. 2019 ఫిబ్రవరి 24న మరోసారి స్పిల్‌వే రెస్టారెంట్ ఎదురుగా ప్రాజెక్ట్ ప్రాంతానికి వెళ్లే రోడ్డు మార్గం పైకి ఉబికి బీటలువారి పగుళ్లు తీసింది. రెస్టారెంట్ చుట్టూ ఉన్న సిమెంట్ కట్టడాలు పగిలిపోయాయి. రెస్టారెంట్ లోపల గచ్చు విడిపోయింది. అప్పట్లో ప్రాజెక్ట్ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని రోడ్డు మార్గాన్ని సరిచేశారు. తిరిగి శనివారం మూడోసారి 902 హిల్ వ్యూ ప్రాంతంలోనూ అదేవిధంగా ఘటన చోటుచేసుకుంది. భూమిపై రెండు అడుగుల వెడల్పున గోతులు ఏర్పడ్డాయి. 20 మీటర్ల పొడవున భూమి ఈ విధంగా బీటలువారింది.
భూమికి పగుళ్లు ఏర్పడటంతో మెకానికల్ షెడ్‌లోని వాహనాలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న దృశ్యం
అంతుబట్టని కారణాలు
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో ఈ విధంగా భూమి పగుళ్లు తీసి బీటలు వారడానికి కారణాలేమిటో తెలియక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాల్లో కొండల్ని తవ్వగా వచ్చిన రాళ్లను, మట్టిని యార్డు ప్రాంతంలో పరిమితికి మించి డంపింగ్ చేయడం వల్ల ఒత్తిడి పెరిగి భూమి బీటలు వారుతోందా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మెకానిక్ షెడ్‌కు ఒక పక్కన హిల్ వ్యూ కొండను బ్లాస్టింగ్ చేసి రాయిని డంప్ చేస్తున్నారు. మరో వైపు స్పిల్‌ఛానల్‌లో మట్టి తవ్వకం పనులు సాగుతున్నాయి. స్పిల్‌ఛానల్ తవ్వకం వల్ల ఈ ప్రాంతంలో బీటలు ఏర్పడ్డాయా లేక బ్లాస్టింగ్‌ల వల్లా అనేది తెలియని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ భారీ ఎత్తున డంపింగ్ చేయడం వల్లే ఈ విధంగా బీటలు వారుతున్నాయా అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనల వల్ల పోలవరం వాసులతోపాటు ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే ప్రజలు కూడా సతమతమవుతున్నారు. ఈ పగుళ్లు మరింత పెరిగితే ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే రోడ్డు పూర్తిగా దెబ్బతింటుదేమోనని భయాందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment