నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: ఓ వైపు ఎన్నికల వేడి కొనసాగుతుండగానే మరోవైపు ఐపీఎల్ టోర్నీ ప్రారంభమైంది. ఎన్నికల ప్రక్రియ ముమ్మరంగా సాగుతుండడంతో శాంతిభద్రత లకు విఘాతం కలగకుండా పోలీసులు బందోబస్తు విధుల్లో తలమునకలవుతున్నారు. ఇదే అదనుగా క్రికెట్ బుకీలు తమ కార్యకలాపాలను విస్తృతం చేస్తున్నారు. కాలనీ, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి చోటా క్రికెట్ బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి.
రాజకీయ నాయకులు, పోలీసుల్లో కొందరి అండ ఉండడంతో బుకీలు మూడు సిక్సర్లు, నాలుగు వికెట్ల చందాన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ రెచ్చిపోతున్నారు. ఈ నెల 16న ప్రారంభమైన ఐపీఎల్ మ్యాచ్‌లు 45 రోజుల పాటు సాగనున్నాయి. ఈ సీజన్‌లో నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు బుకీలు తమ కార్యకలాపాల జోరు పెంచారు.
ప్రధానంగా జిల్లాలోని అన్ని పట్టణాలతో పాటు నెల్లూరులోనూ మకాం వేసి బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారు. కొన్ని లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లు, దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్‌లు,అపార్ట్‌మెంట్లలోని ప్లాంట్లు వీరి వ్యాపారానికి అడ్డాగా మారాయి. జట్టు ప్రాముఖ్యత, మ్యాచ్ స్వరూపం, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దిగ్గజాలను బట్టి వెయ్యి నుంచి లక్షల, కోట్ల రూపాయల వరకు పందేలు కాస్తున్నారు. బుకీకీ, ఫంటర్‌కు మధ్య ముఖ పరిచయం లేకుండానే బ్యాంకు ఖాతాలు, ఇంటర్నెట్ ద్వారానే బెట్టింగ్ లావాదేవీలు సాగిపోతున్నాయి.
బెట్టింగ్ సాగేదిలా..
ఇటీవల నాలుగో నగర పోలీసులు కొందరు బుకీలను అరెస్ట్ చేశారు. వారి విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. బుకీలు ఎవరికంటే వారికి బెట్టింగ్‌కు అవకాశం ఇవ్వరు. వారి పరిధిలోని ఏజెంట్లు కానీ, నమ్మకమైన సభ్యుడు కానీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఇలా బెట్టింగ్‌కు అర్హత పొందిన వారిని ఫంటర్ అంటారు.
బుకీ అకౌంట్‌లో రూ. 50వేలు జమచేసిన రోజు నుంచే ఫంటర్ బెట్టింగ్‌లో పాల్గొనవచ్చు. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి అరగంట ముందు ఎంతమంది ఫంటర్‌లు బెట్టింగ్‌కు దిగుతారో ఫోనుచేసి బుకీకి తెలుపుతారు. ఇంటర్నెట్‌లో ఫంటర్లు రూ. 5 వేల ఉంచి రూ. 50లక్షల వరకు బెట్టింగ్ కాస్తారు. రూ. 50వేలు అంతకు మించి వెచ్చించేవారు డిపాజిట్లు సైతం అంతేస్థాయిలో జమచేయాల్సి ఉంటుంది. గెలుపొందిన తర్వాత బుకీ మరుసటిరోజు బ్యాంకు టైమ్ నాటికి ఫంటర్ ఖాతాలో డబ్బు జమచేస్తారు. ఒకవేళ ఫంటర్ ఓడిపోతే వారు సైతం బ్యాంకు ఖాతాల్లో కచ్చితంగా నగదు జమచేయాలి.
ప్రతి అంశం పందెమే
ఫోర్, సిక్స్, హాఫ్‌సెంచరీ, సెంచరీ అంటూ బ్యాట్స్‌మెన్‌లపై, బౌలింగ్‌లో ఫలానా ఓవర్‌లో ఏ బ్యాట్స్‌మెన్ ఔట్ అవుతారు? అనే వాటిపై పందేలు కాస్తారు. మ్యాచ్ స్వరూపాన్ని ఒంటిచేత్తో మార్చే సత్తావున్న బ్యాట్స్‌మెన్లు, బౌలర్లపైనే అధిక మొత్తంలో బెట్టింగ్ సాగుతోంది. ఫలానా బ్యాట్స్‌మెన్ ఇన్ని ఫోర్లు, ఇన్ని సిక్సర్లు బాదుతాడనీ, ఒక్కో ఫోర్, సిక్స్‌కు రూ. 5వేల నుంచి రూ. 10వేల వరకు పందెం కాస్తున్నారు. ప్రధానంగా చెన్నై, ముంబై, బెంగళూరు, రాజస్థాన్ జట్లపై రూ. 50వేల నుంచి రూ. 10లక్షల వరకు పందేలు సాగుతున్నట్లు సమాచారం.
పల్లెకూ పాకిన వైనం
బెట్టింగ్ జాఢ్యం నగరాలు, పట్టణాల నుంచి పల్లెలకు కూడా పాకింది. గతంలో చెట్ల కింద దాయాలు, చింతగింజల ఆటలాడేవారు ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్‌పై దృష్టిసారించారు. టీవీలు, ఇంటర్నెట్ ద్వారా ఎప్పటికప్పుడు స్కోర్లు తెలుసుకుంటూ పందేలు కడుతున్నారు. కొన్ని బృందాలు కావలి, గూడూరు, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో ఇళ్లను అద్దెకు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. అయితే బుకీలు తమకు పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుంటున్నారు. భారీ మొత్తంలో బెట్టింగ్‌లు జరుగుతుంటే పోలీసుల కదలికలపైనే నిఘా పెట్టే స్థాయికి చేరుకున్నారు.
ఐపీఎల్ హోరు.. బెట్టింగ్ జోరు
Published Mon, Apr 21 2014 3:44 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement