వ్యాధి నిర్ధారణలో రేడియాలజిస్ట్‌ల పాత్ర కీలకం
- ఎమర్జెన్సీ రేడియాలజీ సదస్సులో డాక్టర్ కాకర్ల సుబ్బారావు
విజయవాడ : వ్యాధి నిర్ధారణలో రేడియాలజిస్ట్‌ల పాత్ర కీలకమని నిమ్స్ మాజీ డెరైక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు అన్నారు. ఇండియన్ రేడియాలజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్(ఐఆర్‌ఐఏ) విజయవాడ శాఖ ఆధ్వర్యాన రామవరప్పాడు రింగ్ సమీపంలోని ‘కె’ హోటల్‌లో ‘ఎమర్జెన్సీ రేడియాలజీ’పై రెండు రోజులపాటు నిర్వహించే జాతీయ సదస్సు శనివారం ప్రారంభమైంది.
ఈ సదస్సును ఐఆర్‌ఐఏ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ వీఎన్ వరప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన టెక్నికల్ సెషన్స్‌లో డాక్టర్ కాకర్ల సుబ్బారావు మాట్లాడుతూ ప్రమాదాలకు గురైన చిన్నారుల గాయాలను గుర్తించే విధానాలను పలు రేర్ ఇమేజెస్‌ను చూపిస్తూ వివరించారు. రేడియాలజీలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ వ్యాధి నిర్ధారణలో కీలకంగా వ్యవహరించాలని సూచించారు.
గతంలో సీటీ తీస్తే రేడియేషన్ ప్రభావం ఉంటుందని ఆందోళన చెందేవారని, ప్రస్తుత తక్కువ రేడియేషన్‌తో వ్యాధిని నిర్ధారించే స్కానింగ్ పరికరాలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. డాక్టర్ వీఎన్ వరప్రసాద్ మాట్లాడుతూ ప్రమాదాల్లో వెన్నుపూస, మెదడు, ఇతర అవయవాలకు అయిన గాయాలను ఐదు నుంచి పది నిమిషాల వ్యవధిలోనే స్కాన్ చేసి గుర్తించే అడ్వాన్స్‌డ్ సీటీ, ఎంఆర్‌ఐ స్కానింగ్ మిషన్‌లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి వ్యాధి నిర్ధారణ ఎంతో ముఖ్యమని, రేడియాలజిస్ట్‌లు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. ప్రాణాపాయ సమయంలో వ్యాధి నిర్ధారణ కచ్చితంగా ఎలా చేయాలనే అంశాన్ని విశ్లేషనాత్మకంగా వివరించేందుకే ఈ సదస్సు ఏర్పాటు చేశామని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల నుంచి 300 మందికిపైగా రేడియాలజిస్ట్‌లు హాజరయ్యారని వివరించారు. అనంతరం ‘బేసిక్స్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, ఎమర్జింగ్ టూల్’ అనే అంశంపై నగరానికి చెందిన డాక్టర్ కె.లక్ష్మీసుధ ప్రసన్న ప్రసంగించారు.
‘స్పైనల్ గాయాలు’పై డాక్టర్ రవివర్మ, ‘నాన్ ట్రామాటిక్ న్యూరాలజికల్ ఎమర్జెన్సీ’పై డాక్టర్ సి.కేశవదాస్, ‘అక్యుట్‌లో నడుము నొప్పి’పై డాక్టర్ భావిన్ జాన్‌కరియా మాట్లాడారు. ‘గైనకాలజీ ఎమర్జెన్సీస్’పై డాక్టర్ టి.రాజేశ్వరరావు, ‘ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఎమర్జెన్సీ’పై డాక్టర్ పి.సతీష్ ప్రసంగించారు. ఐఆర్‌ఐఏ నగర శాఖ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ జీవీ మోహన్‌ప్రసాద్, డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.