సీఎం వస్తున్నారని విద్యుత్ కట్! | current cut to public about cm | Sakshi
Sakshi News home page

సీఎం వస్తున్నారని విద్యుత్ కట్!

Published Sat, Feb 14 2015 12:39 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

సీఎం వస్తున్నారని విద్యుత్ కట్! - Sakshi

సీఎం వస్తున్నారని విద్యుత్ కట్!

ప్రజల ఆందోళన.. ఎట్టకేలకు పునరుద్ధరణ
 
నరసన్నపేట : సాధారణంగా సీఎం స్థాయి నాయకులు వస్తున్నారంటే.. వారు పర్యటించే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా అధికారులు జాగ్రత్త పడటం పరిపాటి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. సీఎం చంద్రబాబు సందర్శించనున్న నరసన్నపేటలోని ఇందిరానగర్ కాలనీకి ట్రాన్స్‌కో సిబ్బంది కరెంటు లేకుండా చేశారు. శనివారం నరసన్నపేట ప్రాంతంలో పర్యటించనున్న చంద్రబాబు స్మార్ట్ వార్డుగా గుర్తించిన స్థానిక ఇందిరానగర్ కాలనీ ప్రజలకు అవగాహన కల్పించేందుకు వస్తున్నారు.

దాంతో సీఎం కాన్వాయ్‌కి అడ్డుగా ఉన్నాయని చెప్పి కాలనీలోని పలు ఇళ్ల విద్యుత్ సర్వీస్ వైర్లను ట్రాన్స్‌కో సిబ్బంది కట్ చేసి పారేశారు. ఎటువంటి సమాచారం లేకుండా వైర్లు కట్ చేయడంతో కాలనీ ప్రజలు చీకట్లో మగ్గిపోతున్నారని ఎం.రాఘవ, రాజేంద్ర, గడ్డెయ్యలు తీవ్ర నిరశన వ్యక్తం చేశారు. కనీసం ముందు తెలియజేస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొనే వారమని అన్నారు. విద్యుత్ లేకపోవడంతో బావుల నుంచి నీరు తోడుకోవాల్సి వస్తోందని వాపోయారు. ముఖ్యమంత్రి వస్తున్నారని తమను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ప్రశ్నించారు. అంతే కాదు కాలనీ వాసులు ఆందోళనకు సిద్ధపడగా రాత్రి 9 గంటల సమయంలో సిబ్బంది వచ్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీనిపై ట్రాన్స్‌కో ఏఈ రమణమూర్తి వద్ద ప్రస్తావించగా సీఎం సెక్యూరిటీ సిబ్బంది ఆదేశాల మేరకు 8 ఇళ్ల వైర్లు కట్ చేశామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement