మావోల విషయంలో అప్రమత్తం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎక్కడా మావోయిస్టుల ప్రభావం లేదని, తెలంగాణలోని తీవ్రవాద ప్రభావిత మండలాలు గోదావరి జిల్లాల్లో కలిసిన నేపథ్యంలో మావోల పట్ల అప్రమత్తంగానే ఉన్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప చెప్పారు. జిల్లా పోలీస్ శాఖ ప్రగతిని సమీక్షించేందుకు బుధవారం ఏలూరు వచ్చిన ఆయన ఇరిగేషన్ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. బాధితులు ఫిర్యాదు చేసిన 10 నిమిషాల్లోనే పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రతి జిల్లాలో ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నామని, ఏ సమయంలోనైనా ప్రజలు తమ ఫిర్యాదులను ఫోన్ ద్వారా తెలియచేసిన వెంటనే పోలీసులు స్పందిస్తారని చెప్పారు.
సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేలా పోలీసులు, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి మండలంలోనూ మైత్రీ సంఘాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. నరసాపురం తీర ప్రాంతంలో మెరైన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదన ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉందని, దీనికి త్వరలోనే కార్యరూపం తీసుకువస్తామని ఆయన తెలిపారు. భీమవరంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ స్థారుుని పెంచనున్నట్టు వెల్లడించారు. జిల్లాలో పోలీస్ స్టేషన్లకు వచ్చే కౌంటర్ కేసులను సాధ్యమైనంత వరకూ తగ్గించేలా అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దొంగనోట్ల చెలామణి యథేచ్ఛగా జరుగుతోందన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ వ్యవహారంలో దోషులు ఎంతటివారైనా వదిలేది లేదని ఆయన హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్, జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి పాల్గొన్నారు.