ఇప్పటికే సాగర్ పవర్ బంద్...
తెలంగాణ, ఏపీ మధ్య ముదురుతున్న వివాదాలు
హైదరాబాద్: ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ వివాదాలు రోజురోజుకీ ముదురుతున్నాయి. ఇప్పటికే నాగార్జునసాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్ సరఫరాను నిలిపేసిన తెలంగాణ జెన్‌కో... తాజాగా జూరాల విద్యుత్‌నూ ఆపేసింది. ఇది అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రాజెక్టు కావడంతో ఒప్పందం ప్రకారం ప్రియదర్శిని జూరాల ప్లాంటు(234 మెగావాట్లు) నుంచి వారం పాటు కర్ణాటకకు, వారం పాటు ఇరు రాష్ట్రాలకు కరెంటు సరఫరా కావాల్సి ఉంది. గత వారంలో కర్ణాటకకు కరెంటు సరఫరా కాగా.. సోమవారం నుంచి(11వ తేదీ) ఇరు రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా మొదలవ్వాల్సి ఉంది. మొత్తం విద్యుత్‌లో తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం సరఫరా కావాలి. జూరాల నుంచి ఏపీకి విద్యుత్ సరఫరాను తెలంగాణ జెన్‌కో నిలిపివేసింది.
సీలేరు నుంచి రావాల్సిన విద్యుత్‌ను ఏపీ జెన్‌కో తమకు ఇవ్వడం లేదని... అందువల్లే తాము నాగార్జునసాగర్, జూరాల విద్యుత్‌ను ఇవ్వడం లేదని తెలంగాణ ఇంధనశాఖ వర్గాలు తెలిపాయి. తెలంగాణ చర్యలతో తమకే ఎక్కువ నష్టం వాటిల్లుతోందని ఏపీ ఇంధనశాఖ వర్గాలు వాపోతున్నాయి. ‘సీలేరులో 5మిలియన్ యూనిట్ల(ఎంయూ) విద్యుత్ మాత్రమే ఉత్పత్తవుతోంది. జూరాల, నాగార్జునసాగర్‌లు కలిపి 11 ఎంయూల కరెంట్ ఉత్పత్తి అవుతోంది. ఈ లెక్కన ఏపీకే ఎక్కువ నష్టం వాటిల్లుతోంది’ అని ఏపీజెన్‌కో వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవైపు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) కొనసాగాలంటూనే పీపీఏలకు భిన్నంగా సాగర్, జూరాల విద్యుత్‌ను తెలంగాణ వాడుకుంటోందని ఆ వర్గాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
‘సాగర్’ విషయంలోనూ అదే స్థితి
ఇక సాగర్ విషయానికి వస్తే టెయిల్‌పాండ్‌లో నిర్మాణ సామగ్రిని తరలించేందుకు నాగార్జునసాగర్‌లో ఒక యూనిట్‌లో విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని ఏపీజెన్‌కో కోరుతుండగా... కోతలు విధిస్తున్న సమయంలో అది సాధ్యం కాదని తెలంగాణ జెన్‌కో పేర్కొంటోంది. సామగ్రి తరలించుకోవాలని ముందే సూచించినా స్పందించలేదని వాదిస్తోంది. నాగార్జునసాగర్ ప్రధాన డ్యాంపై విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు మొత్తం ఏడున్నాయి. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో పెరిగిన నేపథ్యంలో ప్రధాన విద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించేందుకు తెలంగాణ జెన్‌కో చర్యలు ప్రారంభించింది. ఏడు యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభిస్తే నీటి విడుదల పెరిగి టెయిల్‌పాండ్‌లో నిర్మాణ సామగ్రి మునిగిపోతుందని, ఆరు యూనిట్లలోనే ఉత్పత్తి చేయాలని ఏపీ జెన్‌కో... విజ్ఞప్తి చేసింది. దీనిపై ముందుగానే హెచ్చరించినప్పటికీ సామగ్రిని ఎందుకు తరలించలేదని తెలంగాణ అధికారులు ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుత విద్యుత్ కోతల నేపథ్యంలో ఇది సాధ్యం కాదని తేల్చిచెబుతోంది.
జూరాల కరెంటూ కట్
Published Thu, Aug 14 2014 3:31 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM
Advertisement