
సీనియర్ జర్నలిస్టు సీవీఆర్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు, రచయిత, ‘ఆంధ్రపత్రిక’ పూర్వ సంపాదకులు చండ్రుపట్ల వెంకట రాజగోపాలరావు(సీవీఆర్) బుధవారం తెల్లవారుజామున నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందారు. సీవీఆర్(83) హైదరాబాద్‌లోని అంబర్‌పేట డీడీకాలనీలో తన కుటుంబంతో కలసి నివసిస్తున్నారు. 1932 ఆగస్టు 12వ తేదీన తూర్పు గోదావరి జిల్లా ఇందుకూరుపేటలో ఆయన జన్మించారు.
సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వర్లు, వరదాచారి, ఎం.వి.ఆర్ శాస్త్రి, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ సురేందర్ తదితరులు సీవీఆర్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అంబర్‌పేటలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరి గాయి. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, నాటి ‘కాంగ్రెస్’ పత్రిక సంపాదకులు చండ్రుపట్ల హనుమంతరావు కుమారుడు సీవీఆర్. టంగుటూరి ప్రకాశం పంతులు స్థాపించిన ‘ప్రజాపత్రిక’ ద్వారా సీవీఆర్ జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించారు.
‘ఆంధ్రపత్రిక’లో దాదాపు నాలుగు దశాబ్దాలపాటు కొనసాగి చివరకు ఎడిటర్‌గా పనిచేశారు. పలు పరిశోధనా గ్రంథాలు రచించారు. ‘ఆంధ్రపత్రిక చరిత్ర’ పుస్తకాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథంగా ప్రకటించింది. కాగా, సీవీఆర్ మృతిపట్ల సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆంధ్రపత్రికకు ఎడిటర్‌గా పనిచేసి తనదైన ముద్ర వేశారని కొనియాడారు.