ఇంటర్నెట్ ద్వారా ఆర్థిక నేరాలు, ఉగ్రవాద కార్యక్రమాలు
విజయవాడలో దక్షిణ భారత స్థాయి సెమినార్
సాక్షి, విజయవాడ బ్యూరో: ఉగ్ర కార్యకలాపాల విస్తరణ, రిక్రూట్‌మెంట్ వంటి వాటిలో ఇంటర్నెట్ ప్రధాన భూమిక పోషిస్తుండటంతో సైబర్ క్రైంపై పోలీస్ శాఖ అప్రమత్తమైంది. సైబర్ క్రైం నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై విజయవాడ గేట్‌వే హోటల్‌లో గురువారం దక్షిణ భారత స్థాయి సెమినార్ నిర్వహించారు. నంబర్, చిరునామా తెలియకుండా ఇంటర్నెట్ ఫోన్‌కాల్ (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్-వివోఐపీ) గుర్తించి సైబర్ క్రైంకు చెక్ పెట్టే పద్ధతులపై అవగాహన కల్పించారు. ట్రూత్ ల్యాబ్, మైక్రోసాఫ్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పోలీస్ శాఖల్లో సైబర్ విభాగం, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచి పోలీసులకు ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాల సలహాదారు, ట్రూత్ ల్యాబ్ చైర్మన్ గాంధీ, డెరైక్టర్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ (హైదరాబాద్) ఎ.ఎస్.రామశాస్త్రి మాట్లాడారు. ఈ వర్క్‌షాప్‌లో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (వాషింగ్టన్ డీసీ-యూఎస్‌ఏ) ప్రతినిధి బెట్సీ బ్రోడెర్, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్(బీపీఆర్‌అండ్‌డి) రిటైర్డ్ డెరైక్టర్ జనరల్ ఎన్‌ఆర్ వాసన్‌లు మాట్లాడారు.