శ్రీకాకుళం: శ్రీకాకుళం రూరల్ మండలం కుందుగానిపేట గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హుద్‌హుద్ బాధితుల కోసం నిర్మించ తలపెట్టిన ఇళ్ల కోసం ఎంచుకున్న భూమి విషయంలో నెలకొన్న సందిగ్ధతే ఈ ఉద్రిక్తతకు కారణంగా తెలుస్తోంది. జీడి మామిడి తోటలు ఉన్న ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా.. అందరికి ఆమోదయోగ్యమైన ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా గ్రామస్థులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల కిందట గ్రామాన్ని సందర్శించడానికి వచ్చిన అధికారులకు గ్రామస్తులు తమ గోడు వెళ్ల బోసుకున్నారు.
తాజాగా.. శుక్రవారం ఉదయం అధికారులు మరోమారు గ్రామానికి వస్తున్నారనే విషయం తెలుసుకొని ఆందోళనలకు దిగారు. ప్రభుత్వం తమ పంట భూముల్లో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించుకుంటే ఆత్మహత్య చేసుకుంటామని.. గ్రామానికి చెందిన కొందరు రైతులు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పోలీస్ సిబ్బందితో సహా ఆ ప్రాంతానికి బయలు దేరారు.