ప్రత్యేక రాష్ట్ర సాధన నేపథ్యంలో సామాజిక తెలంగాణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు.
టీఆర్‌ఎస్‌తో పొత్తు లేకున్నా
100 ఎమ్మెల్యే, 16 ఎంపీ సీట్లు సాధిస్తాం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర సాధన నేపథ్యంలో సామాజిక తెలంగాణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. పరిపాలనలో బడుగు, బలహీనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణ చాంపియన్ కేసీఆర్ అని జరుగుతున్న ప్రచారాన్ని డీఎస్ కొట్టిపారేశారు.
పార్లమెంట్ ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం కోసం సోనియా చేసిన కృషి ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు. కేసీఆర్ పార్టీ పుట్టకముందే తాను తెలంగాణపై శాసనసభలోనే మూడున్నర గంటలపాటు మాట్లాడానని, ఆ రోజు కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవిలో కొనసాగుతున్నారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజా సంఘాలు సైతం ప్రత్యేక రాష్ర్టం కోసం ఎంతో కష్టపడ్డాయన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమైనా, కాకపోయినా తెలంగాణలో 16 ఎంపీ, 100 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.