నేడు ఢిల్లీకి డిప్యూటీ సీఎం
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కు కాంగ్రెస్ అధిష్టానం పిలుపు అందింది. గురువారం ఉదయం 6.40 గంటలకు ఆయన హైదరాబాద్‌లో బయలుదేరి హస్తినకు చేరనున్నారు. హైదరాబాద్ విషయంలో పరిమిత ఆంక్షలు విధిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నందున.. డిప్యూటీ సీఎం అభిప్రాయాన్ని తెలుసుకునేందుకే ఢిల్లీకి పిలిచినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌పై పరిమిత ఆంక్షల వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన వ్యూహం, ఆర్థిక ప్యాకేజీ వంటి అంశాలపై తాను ప్రత్యేకంగా రూపొందించిన నోట్‌ను జీవోఎం సభ్యులకు సమర్పించనున్నట్టు సమాచారం. దామోదర తొలుత కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేతో భేటీ అవుతారని తెలిసింది. ఆ తరువాత అందుబాటులో ఉన్న జీవోఎం సభ్యులతో భేటీ అవుతారు.