ఆదిలాబాద్, న్యూస్‌లైన్ :
దసరా పండుగ ఈసారి మద్యం బాబులకు కిక్కెక్కించనుంది. ఇప్పటికే పల్లెల్లో గుడుంబా గుప్పుమంటోంది. అప్పుడే దేశీదారూ ఏరులై పారుతోంది. ప్రధానంగా ఏజెన్సీల పరిధిలో ఈ తంతు కొనసాగించేందుకు రంగం సిద్ధమైంది. మరోపక్క దేశీదారు సరిహద్దు రాష్ట్రాల నుంచి జోరుగా జిల్లాలోకి అక్రమం గా వస్తున్నా.. పట్టించుకునే వారు కరువయ్యారు. పండుగ నేపథ్యంలో పేదలు, కూలీలు, ఆర్థిక స్థోమత లేనివారు డబ్బులు చెల్లించి మద్యం తాగలేక గుడుం బా, దేశీదారును ఆశ్రయిస్తుంటా రు. దీన్ని ఆసరాగా చేసుకున్న పలువు రు నిల్వలను సిద్ధం చేశారు. వాటిని తాగిన వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది.
ఎటుచూసినా గుడుంబా దందా..
గతంలో ఇప్పపువ్వు ముడిసరుకుగా ఉపయోగించి గుడుంబా తయారు చేసేవారు. ఇది కొంత నాణ్యతగా ఉండేది. కాలక్రమేణ కాసుల కక్కుర్తిలో గుడుంబా తయారీదారులు అడ్డదారులు తొక్కుతున్నారు. నల్లబెల్లం పానకం, పటిక, కుల్లిన కూరగాయలు, అరటి తొక్కలు, తుమ్మ చెక్కలు, యూరియా వంటి పదార్థాలతో గుడుంబా తయారు చేస్తున్నారు. దీంతో దాన్ని సేవించిన వారు అనారోగ్యానికి గురవుతున్నారు. సాధారణంగా నిర్ణీత ఉష్ణోగ్రతలో నిర్ణీత ప్రమాణాల్లో మత్తు కలిగించేలా గుడుంబా తయారు చేయాలి. ఇవేమీ పాటించకుండా ఇష్టారాజ్యంగా తయారుచేస్తుండడం గందరగోళానికి గురిచేస్తోంది.
దీర్ఘకాలికంగా సేవించిన వారు వ్యాధుల బారిన పడి మృతిచెందుతున్నారు. కాళ్లు చేతులు చచ్చుబడడం.. నరాల బలహీనత, టీబీ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఆబ్కారీ శాఖ గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపాల్సి ఉండగా, ‘మామూలు’గా తీసుకుంటున్నారనేఆ రోపణలు ఉన్నాయి. ఏజెన్సీలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, సిర్పూర్(యు), జైనూర్ మండలాల్లో గుడుంబా తయారీ ఓ కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. ఉట్నూర్ మండలం లక్కారం, బీర్సాయిపేట్, దంతన్‌పల్లి, ఇంద్రవెల్లి, నార్నూర్, లోకారి, శట్టిహడత్నూర్, జైనూర్ ప్రాంతాల్లో అమ్మకాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. మంచిర్యాల ర్యాలీగడ్‌పూర్, సింగపూర్, నస్పూర్, బెల్లంపల్లి కాల్‌టెక్స్ ఏరియా, మందమర్రి మండలం గద్దెరేగడి, ఆదిలాబాద్ మండలం రామాయి, ఖండాల, చించుఘాట్, పిప్పల్‌ధరి, లోకారి, జైనథ్ మండలం సాత్నాల, వటోలిసాంగ్వి, బోథ్, ఇచ్చోడ, నేరడిగొండ, గుడిహత్నూర్, బజార్‌హత్నూర్ మండలాల్లోనూ వాగుల ఒడ్డున, అటవీ ప్రాంతాల్లో జోరుగా గుడుంబా తయారు చేస్తున్నారు. ఖానాపూర్, కడెం, చెన్నూర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి ఏరియాల్లోనూ తయారవుతోంది.
దేశీదారు ప్రవాహం
ఐఎంఎల్ విక్రయాల పరంగా చీప్‌లిక్కర్ క్వార్టర్ ధర రూ.60 నుంచి రూ.70 పలుకుతోంది. అదే దేశీదారు అయితే రూ.50కే లభిస్తుంది. దీన్ని వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు. మహారాష్ట్రలో లభించే దేశీదారును జిల్లాలో విక్రయిస్తున్నారు. మహారాష్ట్రలో రూ.1200లకు ఒక కార్టున్ (48 సీసాలు) తీసుకొచ్చి.. ఇక్కడ రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. వాటిపై సుమారు రూ.1500 వరకు లాభం పొందుతున్నారు. జిల్లాకు మూడు వైపులా మహారాష్ట్ర సరిహద్దు ఉండడంతో అక్రమ రవాణాను నిరోధించేందుకు భోరజ్, వాంకిడి, ఘన్‌పూర్, లక్ష్మీపూర్, భైంసా వద్ద ఎక్సైజ్ చెక్‌పోస్టులు ఉన్నాయి. అయితే.. వాటిలో నిఘా కరువవడం.. పోస్టుల కొరతతో దేశీదారు రవాణా యథేచ్ఛగా సాగుతోంది.
ఆదిలాబాద్‌లోని మార్కెట్ యార్డుకు సమీపంలో ఉన్న ఓ బస్తీలో కొంతమంది బాహాటంగా దేశీదారు విక్రయాలు జరుపుతున్నారు. ప్రధానంగా మహారాష్ట్రలోని కనికి, పాండ్రకౌడ, పిప్పల్‌కోటి, కిన్వట్ ప్రాంతాల నుంచి దిగుమతి అవుతోంది. అలాగే.. జైనథ్‌లోని వటోలి సాంగ్వికి, తాంసి, అర్లి, మాండ్వికి దేశీదారు వస్తోంది. భైంసా ప్రాంతానికి మహారాష్ట్రలోని ధర్మాబాద్, పాలజ్, నిర్మల్‌కు సారంగాపూర్ మండలానికి దగ్గరగా ఉన్న మహారాష్ట్రలోని అప్పారావుపేట్ నుంచి జోరుగా రవాణా అవుతోంది. కాగజ్‌నగర్‌కు రైళ్ల ద్వారా బల్లార్షా, బీరూర్ ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నారు.
నిఘా కరువు..
జిల్లాలో దేశీదారు, గుడుంబాను నిరోధించడంలో ఆబ్కారీ శాఖ వైఫల్యం చెందింది. జిల్లా వ్యాప్తంగా 11 ఎక్సైజ్ సర్కిళ్లు, 11 మంది ఇన్‌స్పెక్టర్లు, 15 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. 190 కానిస్టేబుళ్ల పోస్టులకు గాను కేవలం 41 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగితా పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ప్రతి సర్కిల్ పరిధిలో ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఒకరు సెంట్రి డ్యూటీ, మరొకరు కోర్టు డ్యూటీ పోను క్షేత్రస్థాయిలో దాడులకు వెళ్లేందుకు సిబ్బంది లేరు. చెక్‌పోస్టుల వద్ద ఒకరిద్దరు కానిస్టేబుళ్లు ఉంటే అక్రమ మద్యం తరలించే వాహనాలను ఆపేందుకు ప్రయత్నిస్తుండగా వారిపై దాడులు జరుగుతున్నాయి.
దీనికితోడు ఇటీవల మద్యం వ్యాపారంలో అనుకున్న స్థా యిలో లాభాలు లేకపోవడంతో వ్యాపారులు ఇదివరకు మాదిరి ఎక్సైజ్ అధికారులకు సహకరించ డం లేదు. గతంలో దేశీదారును నిరోధించేందుకు మద్యం వ్యాపారులే అధికారులకు సమాచారం ఇచ్చి దొంగదారుల నుంచి వచ్చే దేశీదారును పట్టించేందుకు దోహద పడేవారు. వారే సమాచారం ఇచ్చి దాడులు చేసేం దుకు వాహనాలు కూడా సమకూర్చేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారు సహకరించకపోవడంతో నిఘా కూడా కొరవడిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిరంతరం దాడులు నిర్వహిస్తున్నాం..
జిల్లాలో గుడుంబా స్థావరాలు, దేశీదారు అక్రమ రవాణాపై నిరంతరం దృష్టి సారించాం. చెక్‌పోస్టుల నుం చి కాకుండా దొంగదారుల గుండా వచ్చే వారిని అడ్డుకుంటున్నాం. ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్, ఈఎస్ టీమ్, ఆ యా సర్కిళ్ల టీమ్‌లు మూడు నిరంతరంగా గస్తీ నిర్వహిస్తున్నాం. ఇటీవల 14 కేసులు నమోదు చేశాం. పూర్తిస్థాయిలో అక్రమ వ్యాపారాన్ని నిరోధిస్తాం.
- విజయ్ భాస్కర్‌రెడ్డి, ఆదిలాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్
దసరా కిక్
Published Sun, Oct 13 2013 1:36 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
Advertisement
Advertisement