పట్టపగలు వృద్ధురాలి హత్య | Daylight murder in Kothavalsa | Sakshi
Sakshi News home page

పట్టపగలు వృద్ధురాలి హత్య

Published Sun, Sep 1 2013 2:32 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

Daylight murder in Kothavalsa

కొత్తవలస, న్యూస్‌లైన్ : మండలంలోని కొత్తవలస మేజర్ పంచాయతీ శివారు చీపురువలస గ్రామంలో శనివారం పట్టపగలే వృద్ధురాలు హత్యకు గురైంది. గ్రామంలోని వ్యక్తే ఈ హత్య చేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖ జిల్లా సబ్బవరం మండలం గుల్లిపల్లి గ్రామానికి చెందిన బోకం దేముడమ్మ(60) వారం రోజుల క్రితం కంటి శస్త్రచికిత్స చేయించుకుంది.
 
శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుందామని కొత్తవలస మండలం చీపురువలసలో ఉంటున్న కుమార్తె అన్నంరెడ్డి పైడితల్లమ్మ ఇంటికి ఆమె వచ్చింది. శనివారం పైడితల్లమ్మ.. తల్లి దేముడమ్మను ఇంటి వద్దే ఉంచి రోజూ మాదిరిగా పొలం పనులకు వెళ్లిపోయింది. మధ్యాహ్నం సమయంలో పైడితల్లమ్మ కుమారుడు ఇంటికి వచ్చాడు. అమ్మమ్మకు పండ్లు ఇచ్చేందుకు తట్టి లేపాడు. అయితే ఆమె ఎప్పటికీ లేవకపోవడంతో ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించాడు. అప్పటికే ఆమె మృతి చెంది ఉండడంతో భోరుమన్నాడు. 
 
డబ్బు కోసమే హత్య..
మృతురాలి కుమార్తె పైడితల్లమ్మ ఇటీవలే పాడిగేదెను రూ.20 వేలకు అమ్మింది. ఆ డబ్బు ను ఇంట్లోని సూట్‌కేసులో దాచింది. ఆ డబ్బు కోసమే ఆ వ్యక్తి లోపలికి ప్రవేశించి ఉంటాడని, అడ్డొచ్చిన వృద్ధురాలిని హత్య చేసి ఉంటాడని తెలుస్తోంది. బాగా తెలిసిన వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్నం సుమా రు 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగి ఉంటుందని తెలుస్తోంది. ఇంట్లోని సూట్ కేసు తాళం విరగ్గొటి, అందులో నగదును అగంతకుడు అపహరించాడు. వృద్ధురాలి ముక్కుకు ఉన్న పావుతులం బంగారపు పుడకను దోచుకున్నాడు. మృతురాలి గొంతు కింద ఉన్న ఆనవాళ్లతో పాటు, ముక్కుపై ఉన్న గాయాలను బట్టి వృద్ధురాలు తీవ్రంగా పెనుగులాడినట్లు తెలుస్తోంది. దుండగుడు ఆమె గొంతు పిసికి హత్య చేసినట్లు స్పష్టమవుతోంది. 
 
విశ్రాంతి తీసుకుందామని వచ్చి.. విగతజీవైంది...
కంటి శస్త్రచికిత్స చేయించుకుని రెండు రోజులు విశ్రాంతి తీసుకుందామని వచ్చిందని, ఇలా హత్యకు గురైందని మృతురాలి కుమార్తె పైడితల్లమ్మ గుండెలవిసేలా రోదిస్తోంది. తాను పొలం పనులకు వెళ్లిన రెండు గంటల్లోనే ఘోరం జరిగిపోయిందని వాపోయింది. ఇంట్లో ఉన్న డబ్బుల కోసం మనుషుల ప్రాణాలు తీసేస్తారా? అంటూ కన్నీటిపర్యంతమైంది. గ్రామ తలయారి ఫిర్యాదు మేరకు కొత్తవలస సీఐ జూరెడ్డి మురళి, ఏఎస్సై ఎస్.జియాఉద్దీన్, హెచ్‌సీ బి.చిన్నయ్య సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సీహెచ్‌ఎన్‌సీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement